ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. "స్త్రీ శక్తి" పేరుతో రూపొందించిన ఈ పథకం ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా అమలులోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన 8,456 బస్సుల్లో ఇది అమలు కానుంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 142 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కుటుంబానికి నెలకు సుమారు రూ. 800 ఆదా అవుతుందని అంచనాగా ప్రభుత్వ రిపోర్టులు పేర్కొంటున్నాయి. దేశంలో ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ తరహా పథకాలు ఉన్నాయి. కానీ, వాటికన్నా మెరుగ్గా అమలు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రభుత్వంపై ఏడాదికి రూ. 1,942 కోట్ల భారం పడనుంది.
DID YOU KNOW ?
స్త్రీ శక్తి పథకం
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం కోసం సీఎం చంద్రబాబు సర్కారు స్త్రీ శక్తి పథకం తీసుకొచ్చింది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 8,456 APSRTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సేవలు అందుబాటులో ఉంటాయి.
25
నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్
ఉచిత విద్యుత్ కు సంబంధించి మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాయీ బ్రాహ్మణ వర్గానికి హెయిర్ కటింగ్ సెలూన్లకు ఇప్పటి వరకూ 150 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. అయితే, ఇప్పుడు దాన్ని 200 యూనిట్లకు పెంచారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది చిన్న వ్యాపారస్తులకు ఊరటనివ్వనుంది. అంతేకాక, చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మంజూరు చేసింది ఏపీ క్యాబినెట్.
35
కొత్త బార్ పాలసీ 2025–2028కి ఆమోదం.. కల్లు కార్మికులకు ప్రత్యేక కోటా
చంద్రబాబు సర్కారు 2025-2028 సంవత్సరాల మధ్య అమలయ్యే కొత్త బార్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఇందులో ముఖ్యంగా కల్లు గీత కార్మికులకు ప్రయోజనం కల్పిస్తూ బార్లలో 10 శాతం షాపులు వారికే కేటాయించనున్నారు. అలాగే, ఫీజులో 50 శాతం రాయితీ కూడా లభించనుంది.
బార్ లైసెన్స్ ఫీజు రూ.5 లక్షలుగా నిర్ణయించారు. బార్‌లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే పనిచేయాలి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా నియంత్రించేందుకు పర్మిట్ రూములకు అనుమతి ఇచ్చారు.
ఏపీ కేబినెట్ సమావేశంలో మావోయిస్టులపై ఇప్పటికే అమలులో ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)తో పాటు రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ వంటి అనుబంధ సంస్థలపై నిషేధం కొనసాగనుంది. ఇది రాష్ట్రంలోని అంతర్గత భద్రతను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక అడుగుగా చెబుతున్నారు.
55
పారిశ్రామిక అభివృద్ధికి ఊతం
పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఏపీఐఐసీకి రూ.7,500 కోట్ల రుణాన్ని తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ నిధులతో పారిశ్రామిక పార్కులు, టెక్ హబ్‌లు అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం.
భూసేకరణ, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఇదే సమయంలో టూరిజం రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహకాలు కల్పిస్తూ, ఏపీఈపీటీసీకి చెందిన 22 హోటళ్లు, 6 క్లస్టర్ల రిసార్ట్ల నిర్వహణకు ప్రైవేటు ఏజెన్సీల ఎంపికకు అనుమతి ఇచ్చారు.