
Annadata Sukhibhava Launch : తెలుగు రైతులు ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. వర్షాకాలం మొదలై రెండు నెలలు గడిచినా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం గత 15 రోజులుగా మాత్రమే జోరువానలు కురుస్తున్నాయి. కాబట్టి కాస్త ఆలస్యంగా ఖరీప్ సాగు మొదలయ్యింది... ఇప్పుడు రైతులకు పెట్టుబడి కోసం డబ్బులు అవసరం. సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) డబ్బులు అందించేందుకు సిద్దమయ్యింది.
నరేంద్ర మోదీ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు నేరుగా ఆర్థికసాయం చేసేందుకు అ పీఎం కిసాన్ పథకాన్ని అమలుచేస్తోంది. ఈ పథకం కింద అర్హత గల ఒక్కో రైతుకు ఏడాదికి ఆరువేలు అందిస్తారు... మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు పడతాయి. ఇప్పటికే ఈ ఏడాది ఓ విడత డబ్బులు పడగా రెండోవిడతగా మరో రూ.2 వేలను రైతుల ఖాతాల్లో వేయడానికి కేంద్ర సిద్దమయ్యింది.
ఆగస్ట్ 2న అంటే రేపు శనివారం దేశంలోని రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమ కానున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని తన సొంత పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ రేపు పర్యటించనున్నారు... ఇక్కడినుండి ఈ ఏడాది రెండోవిడత మొత్తంగా 20వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. ఇలా తెలుగు రైతుల ఖాతాల్లోనూ రూ.2000 వేలు జమ కానున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ రైతులకు ఈసారి కేవలం రూ.2 వేలు కాదు... మొత్త ఏడువేలు అకౌంట్లో జమకానున్నాయి. పీఎం కిసాన్ డబ్బులతో పాటు 'అన్నదాత సుఖీభవ' డబ్బులను జతచేసి అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఏపీలోని ఒక్కో రైతు ఖాతాలో రూ.7,000 వేల చొప్పున శనివారం జమకానున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కోటిగా అమలుచేస్తూ వస్తోంది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఆగస్ట్ లో మరో రెండు పథకాలను ప్రారంభిస్తోంది... రైతుల కోసం అన్నదాత సుఖీభవ, మహిళల కోసం 'స్త్రీశక్తి' పేరిట ఉచిత బస్సు పథకాలను ప్రారంభిస్తోంది. ఆగస్ట్ 2 అంటే రేపు రైతులకు పెట్టుబడిసాయం అందించే 'అన్నదాత సుఖీభవ' ను ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో శనివారం రూ.7 వేలు జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శిలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ అన్నదాత సుఖీభవ అమలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. రైతులకు ఎంతో మేలుచేసే ఈ పథకం అమలు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరపాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఈ పెట్టుబడి సాయం డబ్బులు అర్హులైన ప్రతి రైతు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి. ఏదైనా సమస్య ఉంటే మాత్రం డబ్బులు రాకపోవచ్చు. అయితే అన్నదాత సుఖీభవ డబ్బులు రాకుంటే కంగారుపడాల్సిన పనిలేదు... కారణమేంటో తెలుసుకునేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటుచేసింది.
అన్నదాత సుఖీభవ పథకంగురించి తెలుసుకునేందకు 155251, 18004255032 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. అలాగే అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhavastatus.in/ సందర్శించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. మీ దరఖాస్తు ఎక్కడైనా పెండింగ్ లో ఉందా? అన్నది 'Know Your Status' పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
మీ అకౌంట్లో అన్నదాత సుఖీభవ డబ్బులు జమకాకుంటే నేరుగా ప్రభుత్వ అధికారులు, బ్యాంక్ సిబ్బందిని సంప్రదించండి. తద్వారా సమస్య ఎక్కడుందో తెలుస్తుంది... మీకు డబ్బులు ఎందుకు పడలేవో అర్థమవుతుంది. బ్యాంక్ సమస్య అయితే వెంటనే పరిష్కరించుకుంటే డబ్బులు పడతాయి. అధికారిక సమస్య అయితే ఏంటో తెలుసుకుని పరిష్కరించుకోవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 46,85,838 మంది రైతులకు నేరుగా లబ్ది జరుగుతుందని... ఒక్కొక్కరి ఖాతాల్లో ఏడువేల చొప్పు డబ్బులు జమ అవుతాయని ప్రకటించింది చంద్రబాబు సర్కార్. ఇందుకోసం ఇప్పటికే రూ.2,342 కోట్ల నిధులను కేటాయించామని సీఎం వెల్లడించారు. కేంద్రం ఇచ్చే రూ.2 వేలకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.5 వేలు జమచేసి మొత్తం రూ.7 వేలు వేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అన్నదాన సుఖీభవ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారంగా కాదు బాధ్యతగా భావిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. కాబట్టి అర్హుడైన ప్రతిరైతుకు ఈ పథకం కింద పెట్టుబడి సాయం అందించాలని... ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. 'మనమిత్ర' ద్వారా అన్నదాత సుఖీభవ అర్హులకు డబ్బులు జమ కానున్నట్లు ఇవాళే(శుక్రవారం) మెసేజ్ పంపించాలని సూచించారు. బ్యాంక్ అకౌంట్ సమస్యలుంటే వెంటనే రైతులు పరిష్కరించుకునేందుకు సహకరించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
అన్నదాత సుఖీభవ పథకం చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి కోసం అప్పులపాలు కాకుండా ఆర్థికసాయం అందించేందుకు అమలుచేస్తున్న పథకం. కాబట్టి కొన్ని అర్హతలు కలిగిన రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
అర్హతలు :
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రైతులకు మాత్రమే ఈ సాయం అందుతుంది.
సాగుభూమిని కలిగిన రైతులకే పెట్టుబడి సాయం
ఐదెకరాల లోపు వ్యవసాయ భూమి కలిగివుండాలి.
కౌలు రైతులు కూడా అర్హులే
అనర్హతలు :
ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు
అదాయపు పన్ను చెల్లించేవారు
ఐదెకరాల కంటే ఎక్కువభూమి కలిగినవారు