బాలు... బోడి గుండు అనుభవం!

By Surya PrakashFirst Published Sep 26, 2020, 12:53 PM IST
Highlights

16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన సంగీత ప్రియుల మృదయాల్లో ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. ఆయన జీవితంలో ఎన్నో చెప్పుకోదగ్గ ఘట్టాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని సరదాగానూ అనిపిస్తాయి. అలాంటి ఎక్సపీరియన్స్ ఒకటి..బాలు గారు గుండు చేయించుకున్నప్పుడు జరిగింది. 


సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతు మూగబోయింది. భారతీయ సంగీతం మధురమైన గొంతును మిస్‍ అయింది. ఇంజినీరింగ్‍ మధ్యలో మానేసిన ఆయన సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. కెరీల్లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన బాలు భారతీయ సంగీత ప్రపంచంలోనే ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.ఆయన జీవితంలో ఎన్నో చెప్పుకోదగ్గ ఘట్టాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని సరదాగానూ అనిపిస్తాయి. అలాంటి ఎక్సపీరియన్స్ ఒకటి..బాలు గారు గుండు చేయించుకున్నప్పుడు జరిగింది. 

వివరాల్లోకి వెళ్తే.. ఒకసారి విజయవాడ వస్త్రలత సంస్ద వారు బాలు బృందం చేత సంగీత కచేరి నిర్వహించారు. ఆ బృందం లో ఇళయరాజా కూడా ఉన్నారు. చెన్నై నుంచి అంతా బయిలుదేరారు. అయితే ఇళయరాజా,మిగతా టీమ్ అంతా ముందుగా విజయవాడ వచ్చేసారు. వెనక బాలు తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించుకొని కాస్త ఆలస్యంగా విజయవాడ చేరుకున్నారు. అయితే అప్పటికే ఆడిటోరియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. సంగీత విభావరి మొదలవలేదని జనం అరుపులూ, కేకలతో గోల చేస్తున్నారు. 

లేటయ్యేటట్లు ఉందని ఇళయరాజా ప్రోగ్రాం మొదలెట్టారు. ఇంతలో బాలు ఆడిటోరియం చేరుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. గేట్‌మన్‌ మాత్రం గుండులో ఉన్న ఆయన్ని గుర్తు పట్టక అభ్యంతర పెట్టాడు. లోపల ఉన్నవాళ్లకే చోటులేదని, తలుపులు తాళాలు వేసేశానని, తియ్యడం కుదరదని కాస్త  సీరియస్ గానే మాట్లాడాడు.

 బాలు వినయంతో అతనితో ‘బాబూ నేను బాలసుబ్రహ్మణ్యాన్ని కచేరిలో పాటలు  పాడాలి వెళ్లనివ్వు’ అన్నారు. ‘‘ఈ రోజుల్లో ప్రతివాడికి తను ఘంటసాలననో, బాలసుబ్రహ్మణ్యాననో చెప్పుకోవడం అలవాటైంది తప్పుకో’’ అన్నాడు గేట్‌మన్‌. అక్కడ పోగ్రామ్ నిర్వాహకులు ఎవరూ కనిపించలేదు. ఇక చేసేది లేక బాలు వేరే గేటు ద్వారా తంటాలుపడి లోనికి వెళ్లి పోగ్రామ్ లో పాల్గొని రక్తి కట్టించారు. 

ప్రేక్షకులు మూడు గంటలసేపు ఆ సంగీత వాహినిలో తేలియడుతూ మంత్ర ముగ్ధులై ఆలకించారు. చప్పట్లతో ఆడిటోరియం మారుమోగిపోయింది. కచేరి అయ్యాక బాలు సేదతీరుతున్న సమయంలో గేట్‌మన్‌ ఆయన దగ్గరకు వచ్చి ‘‘పొరపాటైంది. క్షమించండి సార్‌’’ అంటూ ప్రాధేయపడ్డారు. అప్పుడు బాలు  ‘‘నీదేమి తప్పులేదు బాబూ.. నేనేమీ సినిమా స్టార్‌ను కాదుగా. పైగా గుండు చేయించుకున్నాను గుర్తుపట్టలేకపోవడం యాదృచ్చికమే..కావాలని చేసింది కాదుగా’’ అన్నారు.
 

click me!