సోనూసూద్ ఫ్రాడా? సేవ పేరుతో చేసిందా మోసమా?

By Surya PrakashFirst Published Sep 22, 2020, 3:03 PM IST
Highlights

ఆయన్ను ఫ్రాడ్ అంటూ నిందిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆయన పేరు ట్విట్టర్ లో బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ 2020 అంటూ మారు మ్రోగుతోంది. ఆయన సహాయం చేసిన వారందరూ ట్విట్టర్ లో మాయమయ్యారు. 

కరోనా సమయంలో  వలస జీవులకు సాయం చేసిన బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ ని అందరూ మెచ్చుకున్నారు. ఆయన ఆ స్పూర్తితో  ఇప్పటికి తన సేవ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. విదేశాల్లో ఉన్న వారిని స్వదేశానికి రప్పించడం, పేదలకు వైద్యం చేయించడం అలా ఎన్నో సామాజిక సేవలు చేస్తూనే ఉన్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆపకుండా చేయూతనందిస్తున్న ఆయనను ట్రోల్స్‌ వెంటాడుతున్నాయి.  ఆయన సేవా కార్యక్రమాల వెనుక ఉద్దేశం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. 

ఇదంతా సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో చర్చనీయాంశమౌతోంది. ఏదో ప్రయోజనం ఆశించకుండా ఆయన ఇదంతా ఎందుకు చేస్తాడని అంటున్నారు. అంతేకాదు ఆయన్ను ఫ్రాడ్ అంటూ నిందిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆయన పేరు ట్విట్టర్ లో బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ 2020 అంటూ మారు మ్రోగుతోంది. ఆయన సహాయం చేసిన వారందరూ ట్విట్టర్ లో మాయమయ్యారు. వారి ట్విట్టర్ ఎక్కౌంట్స్ అన్నీ డీయాక్టివేట్ అయ్యాయని పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఇలా ఎందుకు జరిగిందని నిలదీస్తున్నారు.  ఈ విమర్శలకు సోనూ ఇటీవల ఓ ఇంటర్వూ లో కథ రూపంలో జవాబిచ్చారు.

‘‘నేను చిన్నప్పుడు ఓ కథ విన్నాను. ఓ సాధువు వద్ద ఒక ఉత్తమ జాతి గుర్రం ఉండేది. దానిని తనకు ఇవ్వమని ఓ దొంగ అడగ్గా.. సాధువు తిరస్కరిస్తాడు. కొంతదూరం ప్రయాణించాక, నడవలేక నడుస్తున్న ఓ ముదుసలి సాధువుకు కనిపిస్తాడు. సాధువు జాలితో ఆ ముసలి వ్యక్తికి తన గుర్రాన్ని ఇచ్చేస్తాడు. అయితే గుర్రం మీద కూర్చున్న వెంటనే అ వ్యక్తి భయంకరంగా నవ్వి.. తానే ఆ దొంగ అనే సంగతి బయటపెడతాడు. అప్పుడు సాధువు అతన్ని అపి.. అతను గుర్రాన్ని తీసుకోవచ్చని కానీ ఈ విధంగా తీసుకున్నట్టు ఎవరికీ చెప్పవద్దంటాడు. 

ఈ విషయం ప్రజలకు తెలిస్తే వారు అవసరంలో ఉన్నవారికి కూడా సహాయం చేయటం మానేస్తారని దొంగను కోరుతాడు. ఇప్పుడు నేనూ అదే చెప్తున్నాను. ఇది (విమర్శలు) మీ వృత్తి.. దీని వల్ల మీకు వేతనం లభిస్తుంది కాబట్టి మీరు చేయవచ్చు. కానీ మీ మాటలు, చేతల ప్రభావం నాపై పడదు. నేను నా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటాను’’ అని సోనూ అన్నారు.

‘‘నేను ఏమి చేయలేదని నాది మోసం అనే వారికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేను ఇదంతా మీ మెప్పు కోసం చేయట్లేదు. అలాగే నేను సాయం  చేసిన వారి డేటా అంతా నా దగ్గర ఉంది. వారి చిరునామాలు, ఫోన్‌ నంబర్లు నా దగ్గర ఉన్నాయి.

 అంతేకాదు విదేశాల నుంచి తీసుకువచ్చిన విద్యార్థుల వివరాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను స్పష్టం చేయాలనుకోవట్లేదు.. కానీ నన్ను విమర్శించేందుకు బదులుగా బయటకు వెళ్లి ఎవరికైనా సాయం చేయాలని కోరుతున్న’’ అంటూ సమాధానం ఇచ్చారు. అంతేగాక ప్రస్తుతం తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని మరోసారి ఆయన స్ఫష్టం చేశారు.

click me!