ఫస్ట్ ఫ్యాషన్‌ మూవీ `పాషన్‌` ఓపెనింగ్‌.. `రాజుగారి అమ్మాయి..` నుంచి శృంగార గీతం.. సుహాస్‌ కొత్త సినిమా..

By Aithagoni RajuFirst Published Dec 19, 2023, 11:47 PM IST
Highlights

తెలుగులో మొదటి ఫ్యాషన్ మూవీ రాబోతుంది. అలాగే `సలార్‌` ప్రశాంత్‌ నీల్‌ నుంచి సుహాస్‌ మూవీ ప్రారంభమైంది. మరోవైపు `రాజుగారి అమ్మాయి నాయుడిగారి అబ్బాయి` నుంచి శృంగార గీతం విడుదలైంది. 
 

`పాషన్‌` మూవీ ఓపెనింగ్‌

ఫ్యాషన్‌కి సంబంధించి హిందీలో పలు సినిమాలొచ్చాయి. కానీ తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్ తో మూవీ రాలేదు. మొదటిసారి ఫ్యాషన్‌ రంగంపై ఓ మూవీ వస్తుంది. `పాషన్‌` పేరుతో తెరకెక్కుతుంది. ఇది నేడు(డిసెంబర్‌ 19న) ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల చేతుల మీదుగా ఇది స్టార్ట్ అయ్యింది. సుధీష్ వెంకట్, అంకిత సాహ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంగా  ప్రేమ కథా చిత్రంగా సాగుతుంది. ఈ సినిమాను తోలు బొమ్మలాట ఫిల్మ్జ్ బ్యానర్ పై డాక్టర్ అరుణ్ మొండితోక, నరసింహ, ఏ పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు.  "పాషన్" చిత్రంతో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఆయన స్టార్ డైరెక్టర్స్ శేఖర్ కమ్ముల, మదన్, మోహన కృష్ణ ఇంద్రగంటి వంటి వారి వద్ద పనిచేశారు. 

Latest Videos

మంగళవారం హైదరాబాద్ లో "పాషన్" సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ప్రముఖ దర్శకులు శేఖర్  కమ్ముల ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మొండితోక కెమెరా స్విచ్ఛాన్ చేయగా...దర్శకుడు వేణు ఊడుగుల ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాత పద్మనాభ రెడ్డి స్క్రిప్ట్ ను దర్శకుడు అరవింద్ జోషువాకు అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ - ఈ స్టోరీ రాయడం, దాన్ని నవలగా ప్రచురించడం, సినిమా తీసే ప్రయత్నం, నాకు అన్నీ తెలియజేస్తూ ఉన్నాడు అరవింద్. ఇది చాలా మంచి కథ. నేను అంతా కొత్తవాళ్ళతో తీసిన హ్యాపీడేస్ లా పాషన్ కూడా యూత్ ని ఆకట్టుకుని, ఇన్ స్పైర్ చేసే మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నాను` అని అన్నారు

`రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి` నుండి శృంగార గీతం "ధిర ధిరన" లిరికల్ వీడియో విడుదల..

తన్విక అండ్ మొక్షిక క్రియేషన్స్ పతాకంపై నూతన తారలు రవితేజ నున్న హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం ' రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి'. సత్య రాజ్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు నిర్మాతలు. యువ ప్రతిభావంతులు కలిసి రూపొందిస్తున్న "రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి" చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన "ఐ లవ్ యు" గీతం ప్రేక్షకులను కట్టిపడేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి శృంగార గీతం "ధిర ధిరన" లిరికల్ వీడియో విడుదలైంది.

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం చేయటం విశేషం. రోషన్ సాలూరి స్వరపరిచిన "ధిర ధిరన" గీతం ఆకట్టుకుంటోంది. సాహితి చాగంటి ఆలపించిన ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించారు. రోషన్ సాలూరి మధురమైన సంగీతానికి సాహితి చాగంటి గాత్రం, రెహమాన్ సాహిత్యం తోడై పాట మరింత అందంగా మారింది. లిరికల్ వీడియోలో నాయికా నాయకుల మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. థియేటర్లలో ఈ సాంగ్ యువత మనసు దోచుకోవడం ఖాయమనిపిస్తోంది.

"రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి" చిత్ర కథాంశం, ఈ తరం సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన 'రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి' టీజర్ మెప్పించింది. ప్రేక్షకులలో ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేయడానికి ఈ చిత్రం యొక్క ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం కొద్ది రోజులలో  థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులను అలరించడానికి  సిద్ధమవుతోంది.

ప్రశాంత్‌ నీల్‌ చేతులు మీదుగా సుహాస్‌ మూవీ ఓపెనింగ్‌..

ఇదిలా ఉంటే హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆకట్టుకుంటున్నాడు సుహాస్‌. చివరగా `రైటర్‌ పద్మభూషణ్‌` చిత్రంతో మెప్పించాడు.ఇప్పుడు మరో సినిమాని ప్రారంభించుకున్నారు. ఇది `సలార్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ చేతుల మీదుగా ప్రారంభం కావడం విశేషం. దిల్‌రాజు ప్రొడక్షన్‌ పతాకంపై నాల్గో చిత్రంగా ఇది తెరకెక్కుతుంది. ఇందులో సుహాస్‌కి జోడీగా సంగీర్తన హీరోయిన్‌గా చేస్తుంది. సందీప్‌ బండ్ల దర్శకుడు. హర్షిత్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే ఫన్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా మూవీ అని టీమ్‌ తెలిపింది.  
 

click me!