వర్మ రిక్వెస్ట్ కు, కేటీఆర్ అదిరిపోయే కౌంటర్

By Surya PrakashFirst Published Apr 11, 2020, 8:25 AM IST
Highlights

నెటిజన్లు తనను ట్విటర్ ద్వారా సుదీర్ఘ సమయం పాటు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. అందరి ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న కేటీఆర్ ... పనిలో పనిగా రామ్ గోపాల్ వర్మ పని సైతం పట్టారు. 

ఇద్దరు తెలివైన వాళ్లు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది. వాళ్ల మధ్య పడే పంచ్ లు ఎలా ఉంటాయి. అదిరిపోవూ. అదే కేటీఆర్ కు, రామ్ గోపాల్ వర్మ కు మధ్య ట్విట్టర్ లో జరిగింది.  శుక్రవారం రాత్రి 8 గంటలకు మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి #AskKTR (కేటీఆర్‌ను అడగండి) నిర్వహించారు. నెటిజన్లు తనను ట్విటర్ ద్వారా సుదీర్ఘ సమయం పాటు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. అందరి ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న కేటీఆర్ ...పనిలో పనిగా రామ్ గోపాల్ వర్మ పని సైతం పట్టారు. ఆయన అడిగిన ఓ రిక్వెస్ట్ కు సరైన కౌంటర్ ఇచ్చి అదరకొట్టారు. ఇంతకీ వర్మ ఏమి అడిగారు..కేటీఆర్ ఏం చెప్పారో చూద్దాం.

వివరాల్లోకి వెళితే..#AskKTR లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  ఓ ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న వేరే దాన్ని గురించి కాదు.. మద్యం సరఫరా గురించి. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల అక్కడి ప్రభుత్వం మద్యాన్ని డోర్ డెలివరీ చేసేలా నిర్ణయం తీసుకున్న సంగతి ప్రస్తావిస్తూ.. వర్మ.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ఓ కోరిక కోరారు.

‘‘మీకు నాదో విన్నపం. ఎవరైతే బోర్‌గా ఫీలవుతూ జుట్టు పీక్కుంటున్నారో, చిన్నపిల్లల్లాగా ఏడుస్తున్నారో, మెంటల్ ఆస్పత్రుల్లో చేరుతున్నారో, ఫ్రస్టేషన్‌తో భార్యలను కొడుతున్నారో వీరి కోసం మమతా బెనర్జీ లాంటి పెద్ద మనస్సు ఉండాలి. అలాంటి పద్ధతినే ఇక్కడ కూడా ప్రవేశపెట్టండి’’ అని వర్మ ట్వీట్ చేశారు. 

రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్‌కు వెంటనే మంత్రి కేటీఆర్‌ సరదాగా బదులిచ్చారు. ‘రామూ గారూ.. హెయిర్‌ కట్‌ గురించే అడుగుతున్నారు కదా’ అంటూ చమత్కరించారు. ఆలోచిస్తున్న ఓ ఇమోజీని కూడా జత చేశారు. మంత్రి ‘ఆస్క్ కేటీఆర్ మొదలు పెట్టిన వెంటనే మొదటి ట్వీట్ ఇదే కావడం విశేషం.  అలాగే లాక్ డౌన్ సమయంలో తమకు సాయం కావాలని కోరగా అవసరమైన వారికి తన కార్యాలయం నుంచి సహకారం పొందాల్సిందిగా హామీ ఇచ్చారు. 

click me!