కర్నూల్ జిల్లాలో కరోనా కలకలం... పక్కరాష్ట్రాల్లో పర్యటించినవారికి పరీక్షలు

By Arun Kumar PFirst Published Mar 23, 2020, 2:32 PM IST
Highlights

నంద్యాల పట్టణం నుండి ఇటీవలే కొంతమంది ఉత్తరప్రదేశ్ లోని కాశీ, ఉజ్జయిని క్షేత్రాలకు తీర్థయాత్రకు వెళ్లొచ్చిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు అధికారులు. 

కర్నూల్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్ లోనూ వేగంగా వ్యాప్తిచెందుతోంది. తెలుగురాష్ట్రాలపై కూడా ఈ వైరస్ బారినపడినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో అంతర్రాష్ట్రీయ సరిహద్దులను మూసేశారు. ఇక ఇప్పటివరకు విదేశాల  నుండి వచ్చినవారికే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా తాజాగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చివారికి కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా కర్నూల్ జిల్లా నుండి ఇతర రాష్ట్రాలకు తీర్థయాత్రలకు వెళ్లిన వారిలో కొందరిని ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పరీక్షిస్తున్నారు. 

నంద్యాల పట్టణం నుండి ఇటీవలే కొంతమంది ఉత్తరప్రదేశ్ లోని కాశీ, ఉజ్జయిని క్షేత్రాలకు తీర్థయాత్రకు వెళ్లొచ్చారు. అయితే ముందస్తుజాగ్రత్తలో భాగంగా వారిని క్వారంటైన్ చేసిన వైద్యశాఖ అధికారులు వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారికి కరోనా నెగెటివ్ అని తేలినా 14 రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణ లో వుంచనున్నట్లు అధికారులు  తెలిపారు. 

భారత్ లో కరోనా మొదటి రెండు దశలు దాటిన నేపథ్యంలో భయంకరమైన మూడో దశ అనగా సామూహిక వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన చర్యల్లో భాగంగానే పక్క రాష్ట్రాలకు వెళ్ళొచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే నంద్యాల వాసులు కొందరిని ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 

ఇవాళ తెల్లవారుజామునే సొంతప్రాంతాలకు తిరిగివచ్చిన భక్తులను నేరుగా రైల్వేస్టేషన్ నుంచే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి రక్త నమూనాలు సేకరించారు.  వ్యాధి నిర్ధారణ కోసం వాటిని తిరుపతి ల్యాబ్ కు పంపించారు.

ప్రస్తుతానికి ఈ19 మందికి కరోనా లక్షణాలు లేవని... అయితే ముందు జాగ్రత్తల్లో భాగంగా హోంక్వారంటైన్ లో వుండాల్సిందిగా సూచించినట్లు అధికారులు తెలిపారు. విదేశాలనుండి, ఇతర రాష్ట్రాలనండి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి ఉంచి అవసరమైతే పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సంసిద్దంలుగా ఉన్నారని తెలిపారు.  కేవలం ముందు జాగ్రత్త  చర్యల్లో భాగంగానే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని... ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేన్నారు నంద్యాల ప్రభుత్వాసుపత్రి వైద్యులు వెల్లడించారు. 

click me!