కడపలో వైసీపీ నేతల మధ్య విభేదాలు: ఇరు వర్గాల రాళ్లదాడి, పరిస్ధితి ఉద్రిక్తం

By Siva KodatiFirst Published Oct 15, 2019, 7:30 PM IST
Highlights

కడప జిల్లాలో అధికార వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రాజంపేట మండలం పోలిలో మట్టి తరలింపు విషయంలో జరిగిన గొడవ సందర్భంగా ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లుగా సమాచారం

కడప జిల్లాలో అధికార వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రాజంపేట మండలం పోలిలో మట్టి తరలింపు విషయంలో జరిగిన గొడవ సందర్భంగా ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లుగా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. 

ఓ పాలనాపరమైన చికాకులు వెంటాడుతుంటే ఇవి చాలవన్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీపరమైన చిరాకులు ఎక్కువయ్యాయి. కొద్దిరోజుల క్రితం పార్టీ సీనియర్ నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డిల ఎపిసోడ్‌ను అతి కష్టం మీద సర్దుబాటు చేశారు సీఎం.

జిల్లాపై ఆధిపత్యం కోసం కోటంరెడ్డి, కాకాణి నేరుగా తలపడటం.. చివరికి అది శ్రీధర్ రెడ్డి అరెస్ట్ వరకు వెళ్లడంతో సింహపురి రాజకీయాలు వెడేక్కాయి. ఇది చిలికి చిలికి గాలివానగా మారుతుండటంతో జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇద్దరిని అమరావతి పిలిపించి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డితో బుజ్జగింపచేశారు.

అంతలోనే అనంతపురంలోనూ పార్టీ నేతల విభేదాలు బయటపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని సీఎం గురువారం అనంతపురంలో లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలోనే నేతల మధ్య విభేదాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి పర్యటనలో ఎక్కడా తన పేరు లేదని.. కనీసం ఆహ్వాన పత్రిలో సైతం తన పేరు చేర్చలేదంటూ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జిల్లా మంత్రి శంకర్ నారాయణపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈ సమయంలో ఇద్దరికి మాటా మాటా పెరిగి వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఇతర నేతలు జోక్యం చేసుకుని పరిస్ధితిని చక్కదిద్దారు. నెల్లూరు జిల్లాలాగే.. అనంతపురంలో సైతం జిల్లాను రూల్ చేయాలనుకునేవారి సంఖ్య భారీగా ఉంది.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని హిందూపురం, ఉరవకొండ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలే గెలిచారు. ఇదే సమయంలో ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే, మరో నియోజకవర్గానికి వెళ్లినప్పుడు ప్రోటోకాల్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తమ ఆధిపత్యం ప్రదర్శించుకోవాలని ప్రతి ఒక్కరు ఆరాటపడుతున్నారు.. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.

click me!