అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత

By telugu teamFirst Published Sep 20, 2019, 12:34 PM IST
Highlights

తెలంగాణ శాసనసభలో టీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత కన్నీటిపర్యంతమయ్యారు. డయాలసిస్ వ్యాధిగ్రస్తుడైన తన తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె తెలంగాణ అసెంబ్లీలో ఏడ్చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆలేరు శాసనసభ్యురాలు గొంగడి సునీత అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె డయాలిసిస్ పై ప్రశ్న వేశారు. ఈ సందర్భంలో కిడ్నీ సంబంధిత వ్యాధితో తన తండ్రి మరణించారని గుర్తు చేసుకుని సునీత ఏడ్చేశారు. 

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి ఎక్కువగా ఉండడం వల్ల మూత్రపిండాలు చెడిపోతున్నాయని ఆమె చెప్పారు. కొలనుపాకలో 24 ఏళ్ల ఓ యువకుడు మూత్రపిండాలు చెడిపోయి డయాలసిస్ కోసం వారంలో రెండు సార్లు హైదరాబాదుకు వచ్చి పోతున్నాడని ఆమె చెప్పారు.

అదే విధంగా ఓ పూజారి కుటుంబంలో 19 ఏళ్ల యువకుడు రెండు కిడ్నీలు చెడిపోయి మరణించాడని ఆమె చెప్పారు. తన తండ్రి 14 ఏళ్లు డయాలసిస్ రోగిగా ఉండడం వల్ల ఆర్థికంగా తాము ఎంత చితికిపోయాయని, తాము ఎంత బాధపడ్డామో తనకు తెలుసునని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. 

కిడ్నీ రోగుల సమస్యను గుర్తించే సిఎం కేసీఆర్ డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ఆదేశించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. పది వేల మందికి డయాలసిస్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఖమ్మం, కరీంనగర్, మంచిర్యాల లేదా రామగుండంల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించినట్లు ఆయన తెలిపారు.  

click me!