సన్ రూఫ్ తీసి కారులో ప్రయాణిస్తున్నారా? అయితే.. ఈ వీడియో తప్పక చూడాల్సిందే!

By Rajesh KarampooriFirst Published May 7, 2024, 7:18 PM IST
Highlights

Video Viral: కారులో సన్ రూఫ్ ఓపెన్ చేసి ప్రయాణం చేయడం ఇటీవల ఫ్యాషన్ గా మారింది. ట్రాఫిక్ రూల్స్ పాటించుకోకుండా.. ఇష్టానుసారంగా ప్రయాణిస్తున్నారు.అలాంటి వారు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే.

Video Viral: ప్రస్తుతం ప్రజల జీవన శైలి మారిపోయింది. గతంలో పల్లెటూర్లలో సాధాసీదాగా జీవనం సాగించిన ప్రజలు ప్రస్తుతం విలాసవంతమైన జీవనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దాని కోసం అవసరమైన డబ్బు సంపాదించేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. పెద్ద పెద్ద టౌన్ లలో, మెట్రోపాలిటన్ సిటీల్లో అయితే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగ, వ్యాపారాలు చేస్తున్నారు. వచ్చిన ఆదాయంలో మెజారిటీ భాగం పిల్లల చదువులు, వారికి కావాల్సినవి కొనివ్వడం, విలాసవంతమైన జీవనానికే వెళ్తోంది. ఇలా చేయడం తప్పు కాదు కూడా. అయితే ఎంజాయ్ మెంట్ చేయడంలో పిల్లలను కూడా భాగస్వామ్యులను చేయడం కొన్ని సార్లు ప్రమాదాలకు దారి తీస్తోంది. 

ఈ కాలంలో కారు లేకపోతే చిన్న చూపు చూస్తారని ఎగువ మధ్య తరగతి కుటుంబాలు భావిస్తున్నాయి. అందుకే వారి స్థోమతకు అందకపోయినా కారు కొనుగోలు చేస్తున్నారు. అందులోనూ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న కార్లను కొంటున్నారు. వీటిలో కూడా చాలా మంది సన్ రూఫ్ ఉన్న కార్లనే కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. సాయంత్రం సమయాల్లో పిల్లలు, పెద్దలు ఈ సన్ రూఫ్ తీసి జర్నీ చేస్తూ, ఎంజాయ్ మెంట్ లో మునిగి తేలుతున్నారు. 

Latest Videos

అయితే ఇలా జర్నీ చేయడం కొన్ని సార్లు ప్రమాదాలకు దారి తీస్తోంది. కారులో కూర్చొని, సీటు బెల్టు ధరించడం వల్ల చాలా వరకు ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి అయినా ప్రజలు ప్రమాదాల బారిన పడకూడదని పోలీసులు సూచించారు. 

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే ? 

అదో సాయంత్రం సమయం. చాలా కార్లు రోడ్డుపై ప్రయాణం చేస్తున్నాయి. అందులో ఓ కారు. దానికి సన్ రూఫ్ ఫీచర్ ఉంది. ఇంకేముంది ఆ కారులో ఉన్న ఓ అబ్బాయి, అమ్మాయి దానిని ఓపెన్ చేసి నిలబడ్డారు. కారు రోడ్డుపై కదులుతూ ఉండగా.. వాళ్లిద్దరూ నిలబడి జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆ కారు మామూలు కంటే కొంచెం ఎక్కువ స్పీడ్ లోనే వెళ్తోంది. కానీ ఒక్క సారిగా ముందు వెళ్తున్న కారు స్లో అయిపోయింది. అయితే దానిని ఈ కారు డ్రైవర్ గమనించలేదో తెలియదు గానీ.. నేరుగా ఆ కారును ఢీకొట్టాడు. 

ముందు కారును గుద్దిన వేగానికి, సన్ రూఫ్ తీసిన కారులో నిలబడి ప్రయాణిస్తున్న అబ్బాయి, అమ్మాయి ఎగిరి కింద పడ్డారు. ముందు ఉన్న కారు కూడా కాస్త డ్యామేజ్ అయ్యింది. ఆ అబ్బాయి, అమ్మాయికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సన్ రూఫ్ తీసి జర్నీ చేయడం ప్రమాదకరమని ఈ వీడియో చెబుతోంది. పిల్లలను ఇలాంటి వాటికి అలవాటు చేయకపోవడం చాలా ఉత్తమమైన పని. దీనిపై మీరేంమంటారు ?

Risks of standing on the sunroof, while the car is moving.

Always stay belted in a moving car. pic.twitter.com/PAFsFTKTUU

— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC)
click me!