నోట్ బందీ నో యూజ్: ఆర్బీఐ వార్నింగ్.. ఇదీ ఆర్టీఐ పిటిషన్‌కు రిప్లై

By Siva KodatiFirst Published Mar 12, 2019, 10:51 AM IST
Highlights

నల్లధనం వెలికితీత, అవినీతిని అంతమొందిస్తామని నరేంద్రమోదీ ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకున్నది. కానీ ఆచరణలో నల్లధనాన్ని వెలికితీసేందుకు 2016 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధాని మోదీ ప్రకటించిన నోట్ల రద్దు వల్ల ప్రయోజనం ఉండదని ఆర్బీఐ తేల్చేసింది. 

పెద్దనోట్ల రద్దుతో ప్రయోజనం ఉండబోదని, ఆర్థిక వృద్ధిపై స్వల్పకాలం వ్యతిరేక ప్రభావం పడుతుందని, ఇదే సమయంలో నల్లధన చెలామణిని నిరోధించడంలో పెద్ద పురోగతి ఉండబోదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) బోర్డు హెచ్చరించింది.

ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కూడా డైరెక్టరుగా ఉన్న బోర్డు సమావేశ వివరాలను ఆర్టీఐ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌పై ఆర్బీఐ ఈ వివరాలు బయటపెట్టింది. 2016 నవంబర్ ఎనిమిదో తేదీన రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడానికి కేవలం రెండున్నర గంటల ముందు మాత్రమే ఆర్బీఐ బోర్డు సమావేశమై ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించాల్సి వచ్చింది. 

పెద్దనోట్లను రద్దు చేయాలన్న ప్రభుత్వ వినతిని బోర్డు ఆమోదించింది. అప్పటి ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌ (ప్రస్తుతం ఆర్‌బీఐ గవర్నర్‌), ఆర్థిక సేవల కార్యదర్శి అంజులి చిబ్‌ దుగ్గల్‌, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు ఆర్‌.గాంధీ, ఎస్‌ఎస్‌ ముంద్రా ఆ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రస్తుతం గాంధీ, ముంద్రా ఆర్‌బీఐ బోర్డులో లేరు. శక్తికాంతదాస్‌ ఆర్‌బీఐ గవర్నర్‌గా గతేడాది డిసెంబర్‌లో నియమితులయ్యారు. ‘ఇది ప్రశంసనీయమైనా ప్రస్తుత (2016-17) ఆర్థిక సంవత్సర జీడీపీ వృద్ధిపై వ్యతిరేక ప్రభావం పడుతుంది’ అని సమావేశం పేర్కొన్నట్లు కామన్‌వెల్త్‌ హ్యూమన్‌ రైట్స్‌ వెబ్‌సైట్‌లో సహచట్ట కార్యకర్త వెంకటేశ్‌ నాయక్‌ తెలిపారు.

‘నల్లధనంలో అధికభాగం నగదు రూపంలో లేదు. అది స్థిరాస్తి, బంగారం వంటి రూపాల్లోకి మారింది. పెద్దనోట్ల రద్దుతో వాటిపై గణనీయ ప్రభావం ఏమీ పడదు’అని నాడు ఢిల్లీలో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశం అభిప్రాయ పడింది.

నకిలీనోట్లు ప్రమాదకరమైనా, మొత్తం నగదులో కేవలం రూ.400 కోట్లకు సమానమైన మొత్తమే ఈ రూపంలో ఉన్నందున, గుర్తించదగ్గ అంశం కాదని ఆర్బీఐ పేర్కొన్నది. వృద్ధిరేటు గణాంకాలు వాస్తవమని, అయితే కరెన్సీనోట్ల చెలామణిలో వృద్ధి నామమాత్రంగా ఉందని తెలిపింది. 

ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, వృద్ధిలో వ్యత్యాసం పెద్దగా ఉండకపోవచ్చునని, అందువల్ల పెద్దనోట్ల రద్దుకు సిఫారసు చేసే స్థాయిలో సానుకూల కారణాలు లేవని ఆర్బీఐ బోర్డు సమావేశం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మాత్రం పెద్దనోట్ల రద్దు వల్ల జీడీపీ వృద్ధిపై అధిక ప్రభావం ఏమీ ఉండదనే పేర్కొంది.

దీంతోపాటు నగదు వాడకం-కలిగి ఉండటాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడతామని కూడా నాడు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇదేవిధంగా పెట్రోల్‌ బంకులు సహా 23 రకాల వినియోగ బిల్లుల చెల్లింపునకు ఎన్ని రూ.500, 1000 నోట్లు వినియోగించారనే సమాచారం తమ వద్ద లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. 

ఈ రూపంలోనూ పాత పెద్దనోట్లు అధికంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయన్నది కాదనలేని వాస్తవం.ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వేటికెట్లు, ప్రజా రవాణా, విమానాశ్రయాల్లో టికెట్ల కొనుగోలు, పాల బూత్‌లు, శ్మశానాలు, పెట్రోల్‌ పంపులు, మెట్రోరైల్‌ టికెట్లు, డాక్టర్‌ చీటీతో ఔషధాల కొనుగోలు, వంటగ్యాస్‌ సిలెండర్లు, రైల్వే క్యాటరింగ్ వద్ద 2016 డిసెంబర్ 15 వరకు పాత నోట్లను అనుమతించారు.

విద్యుత్-నీరు బిల్లులు, జాతీయ రహదారుల టోల్‌ ప్లాజాలు, ఏఎస్‌ఐ స్మారకచిహ్నాల ప్రవేశ టికెట్ల కోసం 2016 డిసెంబర్ 15 వరకు పాత రూ.500 నోట్ల వినియోగాన్ని ప్రభుత్వం అనుమతించింది.

నోట్ల మార్పిడికి వాడుకుంటున్నారనే ఫిర్యాదులతో పెట్రోల్‌బంకులు, విమానటికెట్ల కొనుగోలుకు అనుమతిని రద్దు చేస్తూ 2016 డిసెంబర్ రెండో తేదీన 2న ఈ అనుమతిని ఉపసంహరించింది.

2016 నవంబర్ 8 నాటికి చెలామణిలో ఉన్న రూ.500, 1000 నోట్ల విలువ అక్షరాల రూ.15.41 లక్షల కోట్లని ఆర్బీఐ తెలిపింది. 2016 నవంబర్ ఎనిమిదో తేదీ నుంచి దేశీయులు 50 రోజుల్లో, 2017 జూన్‌ వరకు ప్రవాస భారతీయులు కలిపి బ్యాంకుల్లో జమచేసిన రూ.500, 1000 నోట్ల విలువ రూ.15.31 లక్షల కోట్లు ఉంటుంది. 

బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రాని పాత రూ.500, 1000 నోట్ల మొత్తం విలువ రూ.10,720 కోట్లు.బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగి వచ్చిన నోట్లు 99.9 %. నల్లధనాన్ని అరికట్టాలనే ప్రభుత్వ లక్ష్యమే దీనివల్ల ప్రశ్నార్థకంగా మారింది.

నల్లధనం చెలామణిని నిరోధించడం కూడా పెద్ద నోట్ల రద్దుకు ఒక ప్రధానాంశం కాగా, వ్యవస్థలో ఉన్న నగదులో 86 శాతాన్ని ఒక్కసారిగా ఉపసంహరించినట్లయ్యింది. దీంతోపాటు నకిలీనోట్ల నివారణ, తీవ్రవాదులకు ఆర్థికసాయం అందకుండా చూడటం తమ ఉద్దేశాలుగా నాడు ప్రభుత్వం పేర్కొంది.

click me!