బిగ్ రిలీఫ్...రెపో రేటును స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించిన RBI..బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్ల వడ్డన లేనట్లే

By Krishna AdithyaFirst Published Jun 8, 2023, 10:30 AM IST
Highlights

Repo Rate Unchanged: బ్యాంకులు లోన్లపై వడ్డీ రేట్లు పెంచుతాయని ఆందోళన చెందుతున్న వారికి ఇది ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆర్బిఐ తన మానిటరీ పాలసీ సమావేశంలో రెపోరేట్లను స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఆర్బిఐ రెపోరేట్లను స్థిరంగా ఉంచడం వరుసగా ఇది రెండో సారి కావడం విశేషం

Repo Rate Unchanged:  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో  బ్యాంకుల నుంచి రుణాలను పొందిన కోట్లాదిమంది కస్టమర్లకు ఇది రిలీఫ్ వార్తగా చెప్పవచ్చు. బ్యాంకులు లోన్లపై వడ్డీ రేట్లను పెంచుతాయని మీరు ఆందోళన చెందుతుంటే మాత్రం, ఈ వార్త మీకు రిలీఫ్ ఇస్తుందనే చెప్పవచ్చు. 43వ ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో (MPC Meeting) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని ప్రకటించారు. రెపో రేటు మునుపటి స్థాయిలోనే స్థిరంగా  కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. కాగా ఇలా ప్రకటించడం వరుసగా రెండోసారి కావడం విశేషం. అంతకుముందు ఏప్రిల్‌లో జరిగిన ఎంపీసీ సమావేశంలో రెపో రేటును 6.5 శాతం స్థాయిలోనే కొనసాగించారు.

మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ, ఎంపీసీ సభ్యుల ఏకాభిప్రాయంతో రెపో రేటును 6.5 శాతం వద్దే ఉంచామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం రేటును నియంత్రించడానికి, RBI మే 2022 నుండి రెపో రేటును రెండున్నర శాతం పెంచింది.  గతేడాది 4 శాతంగా ఉన్న రెపో రేటు ఈసారి 6.5 శాతానికి పెరిగింది.

RBI యొక్క ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ప్రతి రెండు నెలలకు ఒకసారి జరుగుతుంది. ఏప్రిల్‌లో జరిగిన చివరి సమావేశం తర్వాత, రెపో రేటులో ఎటువంటి మార్పు చేయకూడదని ఆర్‌బిఐ నిర్ణయించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న రికవరీని కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు. అయితే, అవసరమైతే రెపో రేటును పెంచవచ్చని ఆయన ఈ సందర్భంగా సూచించారు. RBI రెపో రేటు పెంపు ద్వారా నేరుగా మీరు తీసుకున్న బ్యాంకు లోన్ EMIపై ప్రభావం చూపుతుంది. ఆర్బీఐ రెపోరేట్లు పెంచతే బ్యాంక్ వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. అప్పుడు మీ హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ EMI కూడా పెరుగుతుంది. 

ఆర్‌బిఐ రెపో రేటు అనేది రిజర్వ్ బ్యాంక్ సాధారణంగా వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు. RBI రెపో రేటు పెంచినప్పుడు, బ్యాంకులు RBI నుండి పొందే రుణాలు ఖరీదుగా మారుతాయి. బ్యాంకు ఎక్కువ వడ్డీకి రుణాన్ని పొందినట్లయితే, బ్యాంకు తన ఖాతాదారులకు కూడా రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతుంది. అంటే రెపో రేటు పెంపు భారం బ్యాంకు ద్వారా ఖాతాదారుల జేబుపై పడుతుంది. బ్యాంకు వడ్డీ రేట్లు పెరిగితే, మీరు తీసుకున్న గృహ రుణం, కారు రుణం, వ్యక్తిగత రుణం వంటి ఏ రుణం తీసుకున్నా వడ్డీ రేట్లు పెరుగుతాయి. 

RBI రెపో రేటు పెంపుదల, తగ్గింపు వెనుక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే అసలు లక్ష్యంగా ఉంటుంది, మార్కెట్‌లో క్యాష్ ఫ్లో ను నియంత్రించడానికి RBI రెపో రేటును పెంచుతుంది. రెపో రేటు పెంపు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య ప్రవాహాన్ని తగ్గిస్తుంది. డబ్బు ప్రవాహం తగ్గిన వెంటనే, డిమాండ్ తగ్గడం ప్రారంభమవుతుంది. అప్పుడు ద్రవ్యోల్బణం తగ్గుతుంది.

 

click me!