మెయిన్ ప్రాబ్లం ఇన్ ఫ్రా: అధిగమిస్తే భారత్‌కు కంపెనీల వెల్లువ

By Sandra Ashok KumarFirst Published May 25, 2020, 12:25 PM IST
Highlights

కరోనా నేపథ్యంలో చైనా నుంచి వైదొలగాలని భావిస్తున్న పలు కంపెనీలకు మౌలిక వసతులు కల్పిస్తే భారతదేశంలోకి వెల్లువలా వచ్చేస్తాయని ఆర్థిక, పారిశ్రామిక నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల భారతదేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.  
 

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి అంతర్జాతీయ వాణిజ్య రూపురేఖల్నీ మార్చేస్తోంది. పలు బహుళ జాతి దిగ్గజ కంపెనీలకు మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా ఉన్న చైనాపై ప్రస్తుతం పలు దేశాలన్నీ ప్రస్తుతం కారాలుమిరియాలు నూరుతున్నాయి. చైనా ఉద్దేశపూర్వకంగా కరోనా మహమ్మారిని ప్రపంచం మీదకు వదిలిందని భావిస్తుండటమే ఇందుకు కారణం. 

దీంతో ఇప్పటి వరకు తమ సరుకుల ఉత్పత్తి కోసం చైనానే నమ్ముకున్న అమెరికా, యూరప్‌, జపాన్‌ దేశాల దిగ్గజ కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి. ఎంత చౌకగా వస్తున్నా ఒక్క చైనాపైనే ఆధారపడితే కష్టకాలంలో ప్రమాదం ఉంటుందని ఈ కంపెనీలు గ్రహించాయి. 

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తరచూ చైనా మీద కఠిన ఆంక్షలు విధించనున్నట్లు ప్రకటిస్తుండటం ఈ సంస్థలను మరింత భయపెడుతోంది. దీంతో చైనాలోని పలు విదేశీ కంపెనీలు.. భారత్‌తో పాటు పలు దేశాల వైపు చూస్తున్నాయి. కొన్ని కంపెనీలైతే ఏకంగా చైనాకు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నాయి. 

భారత్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని అధిగమిస్తే.. చైనా నుంచి విదేశీ కంపెనీలు వెల్లువలా వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులంటున్నారు. భారత్‌లోని ప్రత్యేక వ్యాపార అవకాశాలు మరింతగా ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు.  

భారత్‌లో రవాణా, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలు ఇప్పటికీ చైనా స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం విదేశీ కంపెనీలను నిరుత్సాహపరుస్తోంది. మరోవైపు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలు పీకల్లోతు నష్టాల్లో ఉండడం, విద్యుత్‌ కోతలు, వాణిజ్య కాంట్రాక్టుల అమలులో లోపాలు బహుళ జాతి కంపెనీలను భయపెడుతున్నాయి. 

అధిక స్టాంప్‌ డ్యూటీ కూడా భారత్‌లో పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలకు ఇబ్బందిగా మారింది. నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తే పెట్టుబడులను ఆకట్టుకోవటం సమస్య కాదని నిపుణులంటున్నారు. వాణిజ్య కాంట్రాక్టుల అమలు కోసం ప్రత్యేక వాణిజ్య కోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు అధిగమించవచ్చని చెబుతున్నారు. 

also read    హోటళ్లు, రవాణా రంగంపై ‘కరోనా’ కాటు: 2 కోట్ల కొలువులు ఔట్... ...

అడ్డంకులు అధిగమించగలిగితే భారతదేశంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా  తక్కువ వేతనాలకే నిపుణులైన కార్మికులు లభించడం ఒక కారణం. మరోవైపు క్రమంగా తగ్గుతున్న కార్పొరేట్‌ పన్నులు, ఉద్యోగస్వామ్యం ఇంకొక కారణం. 

వివిధ రకాల ఉత్పత్తులకు విస్తృతమైన దేశీయ మార్కెట్‌ ఉన్నది. ఇక సులభతర వ్యాపార విధానాలు మెరుగుపడుతున్నాయి. దేశీయ ప్రైవేటు రంగం బలంగా ఉంది. 

చైనాలోని కంపెనీలు బారతదేశానికి వస్తే పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దీనివల్ల దేశీయంగా సంపద సృష్టి జరుగుతుంది. దీంతోపాటు ‘మేకిన్‌ ఇండియా’ పథకానికి ఊతం లభిస్తుంది. దేశీయ జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా మరింత పెరిగే అవకాశం ఉంది. 

చైనాకు భారత్‌ సహజసిద్ధమైన ప్రత్యామ్నాయమని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. ఇందుకోసం మరింత సమర్థవంతంగా సంస్కరణలను అమలు చేయాలని, అప్పుడే విదేశీ సంస్థలకు మనపై నమ్మకం ఏర్పడుతుందన్నారు. 

ఖైతాన్‌ అండ్‌ కో పార్ట్‌నర్ అతుల్‌ పాండే ప్రతిస్పందిస్తూ.. ‘చైనాతో పోలిస్తే భారత్‌లో వేతనాలు తక్కువ. కంపెనీలపై పన్నుల భారమూ క్రమంగా తగ్గుతోంది. ఇవన్నీ భారత్‌ను ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తున్నాయి’ అని అన్నారు. 

పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్ మహ్మద్‌ అథర్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘వాణిజ్య, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానాలను మెరుగుదల ద్వారా మన పోటీ సామర్ధ్యం పెంచుకునేందుకు ఇదో అద్భుత అవకాశం అవుతుంది’ అని చెప్పారు. 

click me!