రవాణా రంగంలో మార్పులు... కొత్తగా కోట్ల ఉద్యోగాలు పక్కా: తేల్చేసిన ఐఎల్ఓ

By Sandra Ashok KumarFirst Published May 23, 2020, 12:21 PM IST
Highlights

రవాణా రంగంలో మార్పులు చేస్తే కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించవచ్చునని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) పేర్కొన్నది. పర్యవరణహిత వాహనాలపై దృష్టి సారిస్తే.. కర్బన ఉద్గారాలు, వాయు, శబ్ద కాలుష్యాలు కూడా తగ్గుతాయని తెలిపింది.

న్యూఢిల్లీ: రవాణా రంగం పర్యవరణ హితంగా మారేందుకు పెట్టుబడులు పెడితే.. కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల మందికి ఉద్యోగాలు సృష్టించవచ్చని ఓ నివేదిక తెలిపింది. అలాగే దేశాలు కాలుష్య రహితంగా, పచ్చగా, ఆరోగ్యకర ఆర్థిక వ్యవస్థలుగా రూపొందడానికి దోహదపడుతుందని వెల్లడించింది.

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ), ఐరాస ఆర్థిక కమిషన్ ఫర్ యూరప్ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం రవాణా, వాహనరంగాల్లో సమూల మార్పులు తేవడం కోసం పెట్టే ఈ పెట్టుబడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా కోటి ఉద్యోగాలు సృష్టించవచ్చని పేర్కొంది. రవాణా రంగంలో 50 శాతం వరకు విద్యుత్ వాహనాలు తయారు చేస్తే యూఎన్​ఈసీఈ ప్రాంతంలో మరో 29 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని నివేదిక తెలిపింది. 

ఇవే దేశాలు ప్రజారవాణాలో పెట్టుబడులు పెడితే 25 లక్షల ఉద్యోగాలు... అదే పెట్టుబడులను రెట్టింపు చేస్తే 50 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమని పేర్కొంది. వాహన రంగానికి తోడు.. వస్తు, సేవలపై పెట్టుబడులు పెంచి, చమురు ఖర్చులు తగ్గించడం కూడా ఉద్యోగాల కల్పనకు సహకరిస్తుందని నివేదిక తెలిపింది. ప్రైవేట్ వాహనాలు, సరకు రవాణా వాహనాలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా రూపొందించడంతో మరిన్ని ఉద్యోగాలు సృష్టించవచ్చని అభిప్రాయ పడింది.

also read 

‘రవాణా రంగంలో ఇలాంటి మంచి మార్పుల వల్ల కర్బన ఉద్గారాలు నివారించవచ్చు. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్య స్థాయిలు పడిపోతాయి. ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గుతాయని" నివేదిక స్పష్టం చేసింది.

వాహన, రవాణా రంగాల్లో వచ్చే సమూల మార్పులే ఉపాధి అవకాశాలను పెంచడానికి దోహదపడతాయని నివేదిక స్పష్టం చేసింది. అందువల్ల దీని కోసం సమగ్ర విధానాలు రూపొందించి, అమలు చేయాలని సిఫార్సు చేసింది. నైపుణ్యాల అభివృద్ధి, సామాజిక భద్రత, లేబర్ మార్కెట్ విధానాలు అత్యవసరమని తేల్చి చెప్పింది.

ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోవాలంటే ప్రతి రంగంలో ఆరు కట్ల మందికి పైగా ఉద్యోగులను నియమించాల్సి ఉంటుందని ఐఎల్ఓ పేర్కొన్నది. తద్వారా మాత్రమే 2030 నాటికి సుస్థిర ప్రగతి సాధించగలమని వల్లడించింది. 
 

click me!