Edible Oil Prices: దేశీయ అవసరాలకు కావాల్సిన వంటనూనె నిల్వలు ఉన్నాయి: కేంద్రం

By team teluguFirst Published May 2, 2022, 4:12 PM IST
Highlights

చుక్కలనంటుతోన్న వంట నూనెల ‎ధరల్ని కట్టడి చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో దేశీయ దిగుమతులపై గణనీయంగా ప్రభావం చూపుతోంది. వంట నూనెల ధరలు మూడు నెలల కాలంలో 50 శాతానికి మించి పెరగడంతో వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ చర్యలు చేపడుతోంది.
 

వంటనూనెల కొరత లేదని, దేశీయ అవసరాలకు సరిపడా స్థాయిలో నిల్వలు ఉన్నాయని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. ధరలు, సరఫరాను ఎప్పటికి అప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. దేశంలో ప్రస్తుతం దాదాపు 21 లక్షల టన్నుల వంట నూనెల నిల్వలు ఉన్నట్లు తెలిపారు. మరో 12 లక్షల టన్నుల నూనెలు ఈ నెలలో దిగుమతి అవుతున్నాయని, ఆహార, వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. నూనె గింజల ఉత్పత్తి విషయానికి వస్తే వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2022 ఫిబ్రవరిలో విడుదల చేసిన రెండో ముందస్తు అంచనాల ప్రకారం సోయాబీన్ ఉత్పత్తి గత ఆర్థిక సంవత్సరంలో 126.10 లక్షల టన్నులు ఉండగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 112 లక్షల టన్నులుగా ఉంది. ఆవగింజల నూనెలు అయితే రాజస్థాన్‌లో గత ఏడాది 114 లక్షల టన్నులు కాగా, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 37 శాతం అధికం.

వంట నూనెల ధరలు, లభ్యత పరిస్థితులను సమీక్షిస్తున్న ఆహార, ప్రజా పంపిణీ విభాగం క్రమం తప్పకుండా వంట నూనెల ప్రాసెసింగ్ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహిస్తోంది. దేశీయంగా వంట నూనెల ధరలు అదుపులో ఉండేలా చర్చలు జరుపుతోందని, దీంతో రిటైల్ వినియోగదారులకు ఊరట కల్పించాలని భావిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి బాగా తగ్గడంతో ఎగుమతి దేశాలు విధిస్తున్న పన్నులు పెరగడంతో వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి.

వంట నూనెల ధరల పెరుగుదలపై రోజువారి సమీక్షలు నిర్వహిస్తున్నారు. కృత్రిమ కొరతను సృష్టించడం వల్ల ధరలు పెరుగుతున్నాయని, ధరల నియంత్రణ, స్థిరీకరణతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం కోసం అన్ని చర్యలు చేపడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం ధరల నియంత్రణ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని, నిత్యావసర వస్తువుల చట్ట ప్రకారం ధరలను అదుపులో ఉంచేందుకు , ఎమ్మార్పీలను గణనీయంగా తగ్గించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది.

దేశీయ దిగుమతుల్లో పామాయిల్‌లో క్రూడ్, రిఫైండ్ దిగుబడులు 62శాతంగా ఉన్నాయి. ఇండోనేషియా, మలేషియాల నుంచి పామాయిల్ దిగుమతి అవుతోంది. ఇండోనేషియా నిషేధం విధించడంతో ప్రత్యామ్నయాలపై కేంద్రం దృష్టి పెట్టింది. పామాయిల్‌తో పాటు బ్రెజిల్, అర్జంటీనాల నుంచి 22శాతం సోయాబీన్ దిగుమతి చేసుకుంటున్నారు. రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి 15శాతం సన్‌ ఫ్లవర్‌ దిగుమతి జరుగుతోంది. ఇండోనేషియాతో పాటు, రష్యా, ఉక్రెయిన్ దిగుమతులపై కూడా గణనీయంగా ప్రభావం ఉన్నా భారత్‌కు పెద్ద ఇబ్బంది ఉండదని కేంద్రం చెబుతోంది.

click me!