కరోనా వైరస్, లాక్‌డౌన్ వల్ల తగ్గిన పసిడి డిమాండ్...కానీ..

By Sandra Ashok KumarFirst Published May 1, 2020, 1:01 PM IST
Highlights

ఆర్థిక మందగమనానికి తోడు కరోనా విలయతాండవంతో పసిడికి డిమాండ్ పడిపోయింది. కాకపోతే ఆన్ లైన్ విక్రయాలు చోటు చేసుకోవడం ఊరటనిచ్చే అంశం అని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది.
 

ముంబై: కరోనా మహమ్మారి ప్రభావంతో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్‌, తీవ్ర ఆర్థిక మందగమనం వల్ల 2019-20 ఆర్థిక సంవత్సరంలో పసిడికి డిమాండ్ పడిపోయింది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌, ధరలు స్థిరంగా ఉండకపోవడంతో జనవరి-మార్చి త్రైమాసికలో దేశంలో బంగారానికి 36 శాతం డిమాండ్‌ పడిపోయింది. దీంతో 101.9 టన్నులకు తగ్గిందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) వెల్లడించింది.

అలాగే ప్రస్తుత ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో నగలు, బంగారంపై పెట్టుబడి డిమాండ్‌ కూడా పడిపోయిందని, ఇది చాలా సవాళ్లతో కూడుకున్న ఏడాదిగా నిలువనున్నదని పేర్కొంది. ఆభరణాలతోపాటు పెట్టుబడి రీత్యా కూడా గిరాకీ తగ్గడం అంటే ఈ ఏడాది పసిడి రంగానికి సవాల్ వంటిదేనని డబ్ల్యూజీసీ తెలిపింది. 

లాక్ డౌన్ ముగిశాక సాధ్యమైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభింపజేయడంతోపాటు సరఫరా వ్యవస్థలన్నింటినీ గాడిన పెట్టడంపైనే బులియన్ పరిశ్రమ పురోగతి ఆధారపడి ఉంటుందని డబ్ల్యూజీసీ పేర్కొంది. మొదటి త్రైమాసికంలో బంగారం డిమాండ్‌ 20 శాతం పడిపోయి రూ.37,580 కోట్లకు చేరిందని వ్యాఖ్యానించింది.

పది గ్రాముల బంగారం ధర 25 శాతం పెరిగి, ఎక్సైజ్‌ సుంకం, ఎలాంటి పన్నులు లేకుండా రూ.36,875కు చేరిందని, 2019 ఆర్థికసంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇది రూ.29,555గా ఉందని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ పీఆర్‌ సోమసుందరం వెల్లడించారు. 

also read ట్రెండ్ సెట్ చేసిన ముకేశ్ అంబానీ...వార్షిక వేతనాన్ని వదులుకునేందుకు సిద్ధం...

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో బంగారు నగలకు డిమాండ్‌ 41 శాతం పడిపోయి 73.9 టన్నులకు తగ్గిందని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ పీఆర్‌ సోమసుందరం చెప్పారు. ఇది 2019, జనవరి-మార్చి త్రైమాసికంలో 125.4 టన్నులుగా ఉన్నదని తెలిపారు.

ఏడాది క్రితం పది గ్రాముల బంగారం ధర సగటున రూ.29,55 కాగా, ఈ ఏడాది మార్చిలో సుంకాలు, కస్టమ్స్ సంుకాలు కలుపకుండానే 25 శాతం అధికమై రూ.36,875లకు చేరుకున్నది. గత త్రైమాసికం ప్రారంభంలో కొన్ని వారాలు వివాహాది శుభకార్యాల వల్ల పసిడి అమ్మకాలు జరిగాయని డబ్ల్యూజీసీ భారత్ ఎండీ సోమసుందరం చెప్పారు.

కానీ మార్చి నుంచి కరోనా ప్రభావం వల్ల కొనుగోలుదారుల్లో విశ్వాసం దెబ్బ తిన్నదని డబ్ల్యూజీసీ భారత్ ఎండీ సోమసుందరం తెలిపారు. పసిడి అమ్మకాలు ఆన్ లైన్ పరిధిలోకి రావడం సానుకూల పరిణామంగా మారిందన్నారు. అధిక ధరల వల్ల పాత బంగారం పునర్వినియోగంతోపాటు గ్రుహ, వ్యాపార అవసరాల కోసం ఆభరణాల తనఖా వ్యాపారం బాగా పెరుగుతుందని అంచనా వేశారు. 

పసిడి గిరాకి 2019తో పోలిస్తే 2020లో 20 శాతం పెరిగింది. ఆభరణాల గిరాకి 41 శాతం తగ్గి 125.4 టన్నుల నుంచి 73.9 టన్నులకు పడిపోయింది. పెట్టుబడుల రీత్యా 17 శాతం తగ్గిపోయింది. అంటే 28.1 టన్నులకు పసిడి పరిమితమైంది. 

click me!