ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత ఘోరంగా.. వరల్డ్ బ్యాంక్ ఆందోళన

By Sandra Ashok KumarFirst Published Jun 10, 2020, 12:49 PM IST
Highlights

కరోనా నియంత్రణకు విధించిన లాక్ డౌన్, షట్ డౌన్‌లతో ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక మాంద్యం 1870 తరువాత ఇదే అత్యంత దారుణమైందని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వ్రుద్ధి రేటు 5.2 శాతం తగ్గుముఖం పడుతుందని పేర్కొంది.
 

వాషింగ్టన్‌: కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు వివిధ దేశాలు అమలు చేసిన లాక్ డౌన్ వల్ల  ఆర్థిక కార్యకలాపాల ప్రతిష్టంభించడంతో తీవ్రమైన ఆర్థిక మాంద్య పరిస్థితి ఏర్పడనుందని చెప్పింది.

దీంతో ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 5.2 శాతం తగ్గిపోతుందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. అంతేకాదు కరోనా అధికంగా ఉన్న దేశాల్లో ఆర్థిక కష్టాలు దారుణంగా ఉంటాయని తెలిపింది.

తలసరి ఆదాయం ఈ ఏడాది 3.6 శాతం మేర తగ్గవచ్చునని, ఇది లక్షల మంది పేదలను కడు పేదరికంలోకి నెట్టివేస్తుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఆర్థిక ప్రభావంతో పాటు అంతకు మించిన తీవ్రమైన, దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక ప్రభావాలుంటాయని తెలిపింది. 

కరోనా మహమ్మారి తదనంతరం దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను బలహీనపరుస్తుందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో నెలకొన్న సంక్షోభం, ఆర్థికమాంద్యం ఏర్పడిందని  1870 తర్వాత వచ్చిన అత్యంత దారుణమైన మాంద్యం ఇదేనని తెలిపారు.

also read   లాక్‌డౌన్‌ తర్వాతే కొత్త కొలువుల జోరు:తాజా సర్వే

మహమ్మారి అత్యంత తీవ్రంగా ఉన్న దేశాలలో, ప్రపంచ వాణిజ్యం, పర్యాటక రంగం, వస్తువుల ఎగుమతులు , విదేశీ రుణాలపై  అధికంగా ఆధారపడే దేశాలలో ఈ దెబ్బ తీవ్రంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్‌పాస్ అన్నారు. దీంతో వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి మైనస్ 2.5 శాతంగా ఉండవచ్చునన్నారు. 

60 ఏళ్లలో ఇంతటి ప్రభావం ఇదే తొలిసారని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్‌పాస్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడే ఆర్థిక పునరుత్తేజం సాధ్యమన్నారు. 

ఈ మాంద్యంలో  వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల వాటా 90 శాతానికి పైగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్‌పాస్ తెలిపారు. ఇది 1930-32 మహా మాంద్యం సమయం నాటి 85 శాతం కంటే ఎక్కువన్నారు. 

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి దారుణ పరిస్థితులు ఇప్పుడు కనిపించవచ్చునని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. 1870 నుండి14  ఆర్థిక మాంద్యాలను ప్రపంచం ఎదుర్కొందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. 1870, 1876, 1885, 1893, 1908, 1914, 1917 -1921, 1930-32, 1938, 1945-46, 1975, 1982, 1991, 2009, 2020 లలో ప్రపంచంలో ఆర్థికమాంద్యం వచ్చిందని తెలిపింది.

click me!