2019 Round Up: ఎండాకాలంలో వాటికి డిమాండ్...టీవీలు, ఓవెన్లకు నో రెస్పాన్.. కానీ..

By Sandra Ashok KumarFirst Published Dec 23, 2019, 11:38 AM IST
Highlights

ఈ ఏడాది కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ బాగానే పుంజుకున్నది. ఎండల తీవ్రతతో పెద్ద ఎత్తున ఏసీలు, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు సాగాయి. కానీ టెలివిజన్లు, మైక్రోవేవ్ ఓవెన్లకు ఆదరణ లభించలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా 2019లో కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ టర్నోవర్ రూ.76,400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మందగమనం పరిస్థితులు వచ్చే ఏడాది విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

న్యూఢిల్లీ: కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇండస్ట్రీ.. ఈ ఏడాది స్థిరమైన వృద్ధిని సంతరించుకున్నది. దాదాపు రెండేళ్లుగా నిశ్చలంగా ఉన్న ఈ రంగం.. 2019లో తిరిగి పుంజుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ టర్నోవర్ విలువ దాదాపు రూ.76,400 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈసారి వేసవికాలం ఎక్కువ రోజులుండటం, ఎండలు దంచి కొట్టడంతో ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్ల వంటి కంప్రెషర్ ఆధారిత కూలింగ్ ఉత్పత్తుల అమ్మకాలు పెద్ద ఎత్తున జరిగాయి. దీంతో సుమారు 10 శాతం వృద్ధిరేటు సాధ్యమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 

ఒక్క ప్రథమార్ధంలోనే ఏసీల విక్రయాలు 30 శాతానికిపైగా, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు 15 శాతానికిపైగా పెరిగాయని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) తెలిపింది. తాము 42 శాతం వృద్ధిని చూశామని వోల్టాస్ ఎండీ, సీఈవో ప్రదీప్ బక్షీ చెప్పారు.

also read 2020లో కొత్త ఉద్యోగులను తీసుకునే అవకాశాలు తక్కువే...కారణం ?

అయితే టెలివిజన్లు, మైక్రోవేవ్ ఉత్పత్తులకు ఆదరణ అంతంతమాత్రంగానే కనిపించింది. ఈ ఏడాది టీవీ ప్యానెళ్లకు డిమాండ్ లేదని పరిశ్రమ పేర్కొన్నది. కాగా, 2024-25 నాటికి అప్లియెన్సెస్ అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ (ఏసీఈ) పరిశ్రమ పరిమాణం రూ.1.48 లక్షల కోట్లను తాకగలదన్న అంచనాలు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇండస్ట్రీ వ్యక్తం చేస్తోంది.  

ఈ ఏడాది కన్జ్యూమర్ డ్యూరబుల్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం నుంచి పలు ప్రోత్సాహకాలు లభించాయి. టీవీ ప్యానెళ్ల (ఓపెన్ సెల్స్) దిగుమతిపై కస్టమ్స్ సుంకం తగ్గింపు తదితర నిర్ణయాలు కలిసొచ్చాయి. దేశీయంగా టీవీల తయారీకి ఊతమిచ్చే సంస్కరణలనూ మోదీ సర్కార్ ఈ ఏడాది ప్రవేశపెట్టింది. 

‘గత ఐదేళ్లలో తయారీదారులు దాదాపు రూ.7,500 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా సామర్థ్య విస్తరణ, కొత్త సాంకేతికత అభివృద్ధిపై దృష్టి సారించారు’ అని గోద్రేజ్ అప్లియెన్సెస్ బిజినెస్ అధిపతి, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు కమల్ నంది తెలిపారు. పానాసోనిక్ ఇండియా-దక్షిణాసియా అధ్యక్షుడు, సీఈవో మనీశ్ శర్మ సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

నగదు కొరత సమస్యలూ ఒకింత కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అమ్మకాలను దెబ్బతీశాయి. ముఖ్యంగా ద్వితీయార్ధం (జూలై నుంచి)లో విక్రయాలు ప్రభావితమయ్యాయని హైయర్ ఇండియా అధ్యక్షుడు ఎరిక్ బ్రగంజా తెలిపారు. ప్రథమార్ధం (జనవరి-జూన్) బాగుందని, మొత్తం గా ఈ ఏడాది ఆశాజనకంగానే కొనసాగిందని సంతృప్తి వ్యక్తం చేశారు. 

ద్రవ్యవ్యవస్థలో తగ్గిన కరెన్సీ చలామణి అలాగే ఉంటే పరిశ్రమకు ఇబ్బందేనన్న ఆందోళనలు మెజారిటీ సంస్థల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రథమార్ధంలో ఎండల కారణంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలతో లాభించిన పరిశ్రమకు.. ద్వితీయార్ధంలో ఆర్థిక మందగమనం సెగ తాకింది.స్థూలంగా ఈ ఏడాది మొత్తం గత రెండేళ్లతో పోల్చితే కన్జూమర్ డ్యూరబుల్స్ మార్కెట్ పరిస్థితి మెరుగ్గానే ఉందన్న అభిప్రాయాలు ఆయా సంస్థల నుంచి వస్తున్నా.. మార్కెట్ చోటుచేసుకున్న స్తబ్ధత భయపెడుతూనే ఉన్నది.

also read  ఉల్లి తరువాత, ఇప్పుడు వంట నూనె ధరలకు రెక్కలు...

మార్కెట్ నెలకొన్న ప్రస్తుత పరిస్థితులనుబట్టి వచ్చే ఏడాది కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగానికి ఇబ్బందులు తప్పవన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. 2020లోనూ ఎండలు మండిపోతే ఏసీలు, రిఫ్రిజిరేటర్లకు డిమాండ్ పెరుగవచ్చని, దీనివల్ల ఇండస్ట్రీ గట్టెక్కగలదన్న విశ్వాసమూ కనిపిస్తున్నది. 

‘వచ్చే ఏడాది ప్రథమార్ధం కూలింగ్ ఉత్పత్తులకు డిమాండ్ ఉండొచ్చు’ అని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) అధ్యక్షుడు కమల్ నంది పీటీఐకి తెలిపారు. మందగమనం ఇలాగే కొనసాగితే విక్రయాలు క్షీణించడం ఖాయమన్నారు.

ఇదే జరిగితే పెట్టుబడులు తగ్గిపోతాయని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) అధ్యక్షుడు కమల్ నంది పేర్కొన్నారు. వినియోగ సామర్థ్యం పెరిగితేనే పరిశ్రమ మనుగడ సాగిస్తుందని వ్యాఖ్యానించారు. గ్రామీణ భారతంలో ఆర్థిక పరిస్థితులు బలపడితే నిలకడైన వృద్ధి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

click me!