మధ్య తరగతికి ఊరట లభిస్తుందా?!: ఐటీ మినహాయింపులకు మార్గముందా?!

By Siva KodatiFirst Published Jan 22, 2020, 2:47 PM IST
Highlights

వేతన జీవులు, అధికాదాయం పొందుతున్న మధ్యతరగతి ప్రజానీకం బడ్జెట్‌లో ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు. 

కేంద్ర ప్రభుత్వం జీడీపీ వ్రుద్దిరేటును ముందుకు పరుగెత్తించాలంటే వినియోగ దారుల నుంచి డిమాండ్ పెంపొందించాల్సిందే. ఈ నేపథ్యంలో ఆదాయం పన్ను మినహాయింపుపై మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఇప్పటికే పన్ను రూపేణా ఆదాయం తగ్గిన నేపథ్యంలో మళ్లీ ఆదాయం పన్ను విషయంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఉపశమనం ప్రకటిస్తుందా? అన్న అంశంపై సందేహం నెలకొన్నది. 

వేతన జీవులు, చిన్న తరహా పారిశ్రామికవేత్తలుగా ప్రాతినిధ్యం వహించేది మధ్య తరగతి ప్రజానీకమే. వీరంతా ఏటా రూ.5 నుంచి రూ.15 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్న వారే. రూ.5 లక్షల పై చిలుకు ఆదాయం కల వారు 20 శాతం, రూ.10 లక్షల పై చిలుకు ఆదాయం గలవారు 30 శాతం ఆదాయం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 

ఇప్పటి వరకు అమలులో ఉన్న మొదటి శ్లాబ్‌కు రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు ఐదు శాతం పన్ను విధించవచ్చు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయంపై పన్నును 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించవచ్చనంటున్నారు. అదేవిధంగా వార్షిక ఆదాయంపై రూ.10 లక్షల నుండి రూ.25 లక్షలకు పన్నును 30 శాతం నుండి 20 శాతానికి తగ్గించవచ్చు.

కొంతమంది ఆర్థికవేత్తలు 25 లక్షల నుండి రూ.కోటి వరకు ఆదాయంపై 25 శాతం పన్నును ఉంచాలని సూచించారు. అటువంటి ఆదాయం ఉన్నవారు ఎక్కువ పన్ను చెల్లించగలరని, ఎందుకంటే రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం పన్ను విధించాలని అన్నారు.

ధనవంతులపై ఆదాయపు పన్ను సర్‌చార్జీని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవాస్ రుణాలపై రెండు లక్షల రూపాయల వడ్డీపై పన్ను తగ్గింపు ఇంకా లభిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. రియాల్టీ రంగాన్ని మందగమనం నుండి బయటపడటానికి, అటువంటి వ్యక్తులకు దామాషా ప్రాతిపదికన ఎక్కువ పన్ను మినహాయింపు ఇవ్వాలని సూచిస్తున్నారు. 

Also Read:budget 2020: ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో.... రూ.90 వేల కోట్లు....

ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్నుల కోడ్‌ను ఆదాయపు పన్ను చట్టంతో భర్తీ చేయాలని కూడా భావిస్తున్నారు. దీనికి అనుబంధంగా ఉన్న కమిటీ మధ్యతరగతికి ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించాలని సిఫారసు చేసింది. ఈ సిఫార్సులు అమలు చేస్తే, మధ్యతరగతిపై పన్ను భారం తగ్గించవచ్చు. 

ప్రభుత్వం ఇప్పటికే 5 లక్షల వరకు వార్షిక పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని పూర్తిగా మినహాయించింది. దీంతో రూ.8.5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు ఇవ్వవచ్చు. అయితే రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయంపై రూ .12,500 వరకు పన్ను మినహాయింపు ఉంది. 

చాలా సందర్భాల్లో రూ. 5 లక్షలపైన ఆదాయం ఉంటే రూ.12,500లే కాదు, ఇంకా చాలా పన్ను చెల్లించాలి. అలాంటి వారు ఎక్కువగా కలత చెందుతారు. అలాంటి వారి ఉపశమనం కోసం కొన్ని నిబంధనలు రూపొందిస్తున్నారు. కమిటీ నివేదిక ప్రకారం, పన్ను స్లాబ్‌లో మార్పులతో కొన్ని సంవత్సరాలు ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అయితే దీర్ఘకాలంలో దాని ప్రయోజనం కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే, ఇప్పటికే కార్పొరేట్ పన్ను తగ్గించడంతో ఆదాయం భారీగా కోల్పోయింది కేంద్రం. ఈ నేపథ్యంలో మరోసారి బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆదాయం పన్ను ఉపశమనం ప్రకటించడం సాహసమే అవుతుంది. అయితే కొన్ని మార్పులు, చేర్పులు ఉండవచ్చునని తెలుస్తున్నది. 

ప్రభుత్వం ఆదాయం పన్ను శ్లాబ్‌లో మార్పులు చేసిన చట్టంలోని 80సీ సెక్షన్ పరిధి పెంచే అవకాశం ఉన్నది. ఇంటి రుణాల వడ్డీపై మినహాయింపు పరిమితి పెంచే అవకాశాలు దండిగానే ఉన్నాయి. ఇదే జరిగితే రెండు వైపులా ప్రయోజనకర నిర్ణయంగా నిలుస్తుంది.

ఒకవైపు ఇళ్ల కొనుగోళ్లను పెంచడంతోపాటు మరోవైపు ఇళ్ల నిర్మాణం ప్లస్ రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఊపునిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతోపాటు ప్రజల వద్ద నగదు మిగులు కూడా పెరుగుతుంది.

ప్రభుత్వం ఆదాయం పన్ను మినహాయింపుల పెంపుతో ఏర్పడిన లోటును పరోక్ష పన్నులను పెంచుతూ తీర్చుకోవచ్చు. జీఎస్టీ శ్లాబ్‌లో స్వల్ప మార్పులతో దీనిని పూరించుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే మినహాయింపుల మొత్తం జీఎస్టీ రూపంలో వాపస్ వస్తుంది. 

Also Read:బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తాలపై ఐటీ శాఖ దర్యాప్తు...

ప్రభుత్వం ఆదాయం పన్నులో ఉపశమనాలు పెద్దగా కల్పించకపోవచ్చునన్న వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను రూపేణా రూ.6.6 లక్షల కోట్లు, జీఎస్టీ రూపేణా రూ.13.35 లక్షల కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

కానీ రెవెన్యూ లక్ష్యాలు రెండూ గాడి తప్పాయి. మరో పక్క కార్పొరేట్ పన్నురేట్లు తగ్గించి 15, 22 శాతంగా కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయానికి గండి పడింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరో దఫా ప్రభుత్వాదాయంలో కోత విధించడానికి సిద్ధ పడక పోవచ్చునని భావిస్తున్నారు. 

click me!