న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చేనెల ఒకటో తేదీన 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్‌లో సమర్పించనున్నారు. సరిగ్గా పని చేయని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాల ఉపసంహరణ ద్వారా ఆదాయం సమకూర్చుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. 

అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ప్రభుత్వ రంగ సంస్థల వాటాల ఉపసంహరణ ద్వారా రూ.లక్ష కోట్ల నిధులు సమీకరించాలని నిర్మలా సీతారామన్ ప్రతిపాదించనున్నారని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో పెట్టుబడుల ఉపసంహరణ కింద రూ.90 వేల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.  తదుపరి దాన్ని రూ.1.05 లక్షల కోట్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది కేంద్ర ప్రభుత్వం. 

also read  రోజురోజుకు పడిపోతున్న దేశ ఆర్థికా వృద్ధిరేటు...కారణం.. ?

ఇప్పటికే ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, కంటైనర్ కార్పొరేషన్ వంటి అతిపెద్ద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను ఉపసంహరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీగానే కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను ఉపసంహరించడం ద్వారా వచ్చిన ఆదాయంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా సంస్థలను నింపి మార్కెట్లోకి నిధులు విడుదల చేయాలని కేంద్రం తలపోస్తున్నది. 

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వాటాల ఉపసంహరణ శాఖ అధికారులు బ్లూ చిప్ సంస్థలైన నాల్కో, ఎన్ఎండీసీ, ఎన్టీపీసీ, కోల్ ఇండియా వంటి సంస్థల్లో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)గా వాటాలు విక్రయించ నున్నదని తెలుస్తోంది. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, ఎన్టీపీసీ, ఎన్ఎండీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, నేషనల్ ఫర్టిలైజర్స్, హిందూస్థాన్ కాపర్ తదితర సంస్థల్లో ఓఎఫ్ఎస్ ద్వారా వాటాలను 52 శాతం నుంచి 82 శాతం వరకు విక్రయించ తలపెట్టినట్లు తెలుస్తున్నది. 

also read Budget 2020: చైనా బొమ్మలంటే ఆలోచించాల్సిందే...ఎందుకంటే...?

ఎయిర్ ఇండియా, బీపీసీఎల్ సంస్థలలో పెండింగ్‌లో ఉన్న పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నాయి. చిన్న, పెద్ద సంస్థల్లో తమ వాటాలను 51 శాతం లోపుకు ఉపసంహరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. బీఈఎంఎల్ సంస్థలో ప్రస్తుతం ఉన్న 54 శాతం వాటాలో 28 శాతం వాటాలను వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణతోపాటు బీఎస్ఎన్ఎల్-ఎంటీఎన్ఎల్ విలీనం కోసం ఏర్పాటైన కేంద్ర మంత్రుల బ్రుందానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యం వహించారు. బీఎస్ఎన్ఎల్-ఎంటీఎన్ఎల్ విలీన ప్రక్రియ కొంత మెరుగు పడినట్లు కనిపిస్తోంది. ఎయిరిండియా ప్రైవేటీకరణకు కసరత్తు సాగుతూనే ఉన్నది. పలు సంస్థలు అనధికారికంగా ప్రభుత్వ ప్రతినిధులతో ఎయిర్ ఇండియా కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నాయి.