పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయో వెల్లడించిన కేంద్రం.. వివరాలు ఇవే..

By Sumanth KanukulaFirst Published Feb 6, 2023, 5:42 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం కీలక వివరాలను వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు 2024 మార్చి నాటికి పూర్తిచేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది. అయితే గోదావరి వరదలు సంభవించిన కారణంగా జాప్యం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం కీలక వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న టైమ్‌లైన్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు 2024 మార్చి నాటికి, డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ను 2024 జూన్ నాటికి పూర్తి చేయడానికి షెడ్యూల్‌ చేయబడిందని కేంద్రం తెలిపింది. అయితే గోదావరి నదికి 2020, 2022లో భారీగా వరదలు పోటెత్తిన నేపథ్యంలో.. ప్రతిపాదిత షెడ్యూల్‌లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని  పేర్కొంది. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 

2016 సెప్టెంబర్ 30 నాటి  ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆఫీస్ మెమోరాండంకి అనుగుణంగా పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్  కోసం నిధులు అందజేయబడుతున్నాయని తెలిపారు. 2014 ఏప్రిల్ 1 నుంచి నీటిపారుదల కాంపోనెంట్‌కు ఖర్చును రీయింబర్స్ చేయాలని అందులో ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అర్హత గల వ్యయాన్ని భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు రీయింబర్స్ చేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) నుంచిధృవీకరించబడిన బిల్లులు, సిఫార్సులను స్వీకరించిన తర్వాత రీయింబర్స్‌మెంట్ చేయబడుతుందని చెప్పారు. 

2014 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ 2022 వరకు పోలవరం ప్రాజెక్ట్‌పై 16,035.88 కోట్లు వెచ్చించినట్టుగా ఏపీ ప్రభుత్వం తెలియజేసిందని చెప్పారు. అయితే ఇందులో అర్హత కలిగిన మొత్తం రూ.13,226.04 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించారు. రూ. 2,390.27 కోట్లు విలువ గల బిల్లులు పీపీఏ ద్వారా రీయింబర్స్‌మెంట్‌కు అర్హత పొందలేదని చెప్పారు. రూ.548.38 కోట్ల బిల్లులు పీపీఏ పరిశీలనలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలంలో ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన రీయింబర్స్‌మెంట్‌లు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన బిల్లులపై ఆధారపడి ఉంటాయని చెప్పారు.  అలాగే ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు కోసం పీపీఏ, సీడబ్ల్యూసీ సిఫార్సు చేసిన బిల్లులపై కూడా ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. 

పోలవరం ప్రాజెక్టుకు సంబందించి.. స్పిల్‌వే, అప్‌స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, కాంక్రీట్ డ్యామ్ (గ్యాప్ III), డయాఫ్రమ్ వాల్ ఆఫ్ ఎర్త్ కమ్ రాక్-ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) (గ్యాప్-I) వంటి అనేక కీలక భాగాలు పూర్తయ్యాయని చెప్పారు. ఈసీఆర్ఎఫ్ ఆనకట్ట నిర్మాణం (గ్యాప్ I & II), ప్రభావిత ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాల పునరావాసం ఇతర కీలక అంశాలు అమలులో వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. 

2022 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పురోగతికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు.  హెడ్ వర్క్స్ 77.10 శాతం, మెయిన్ డ్యామ్ ప్యాకేజ్ 78.05 శాతం, కనెక్టివిటీ ప్యాకేజెస్‌ 68.51 శాతం(లెఫ్ట్ కనెక్టవిటీ 62.39 శాతం, రైట్ కనెక్టివిటీ 75.82 శాతం), లెఫ్ట్ మెయిన్ కెనాల్ 72.80 శాతం, రైట్ మెయిన్ కెనాల్ 92.75 శాతం, మొత్తం ప్రాజెక్టు 78.99 శాతం పూర్తైనట్టుగా తెలిపారు. అయితే భూ సేకరణ, పునరావాసం 22.16 శాతం పూర్తైనట్టుగా పేర్కొంది. 

click me!