ప్రియుడిని కట్టేసి యువతిపై గ్యాంగ్ రేప్: ఏపీ డీజీపీకి చంద్రబాబు ఘాటు లేఖ

By telugu teamFirst Published Jun 21, 2021, 6:32 PM IST
Highlights

గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్ లో యువతిపై జిరగిన సామూహిక అత్యాచార ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు.

అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర్ ఘాట్ వద్ద యువతిపై సామూహిక అత్యాచార ఘటనను ఖండిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండేళ్లుగా మహిళలపై దాడులు పెరగడం విచారకరమని ఆయన అన్నారు. నేరస్థులలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడంతో నేరస్థులు, సామాజిక వ్యతిరేక శక్తులు మహిళలపై దాడులకు పాల్పడుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఈ నేపథ్యంలో దిశా చట్టం, దిశా పోలీస్ స్టేషన్లు, దిశా మొబైల్ వాహనాలు, చివరకు దిశా యాప్ మిథ్యగా మిగిలిపోయాయని, ప్రజలను మోసపూరితంగా నమ్మించేందుకు ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు. కృష్ణా నది ఒడ్డున ఉన్న సీతనగరం పుష్కర్ ఘాట్ సమీపంలో తనకు కాబోయే భర్తను బందీగా ఉంచి ఒక మహిళను మానభంగం చేయటం మరో దురదృష్టకర సంఘటన అని ఆయన అన్నారు.

సంఘటన జరిగిన ప్రదేశం ముఖ్యమంత్రి నివాసం నుండి 1-2 కిలోమీటర్ల దూరంలో ఉండగా డిజిపి, స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయం 2-3 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆయన గుర్తు చేశారు. పత్రికల సమాచారం ప్రకారం జూన్ 19, 2021 (శనివారం) రాత్రి 8 గంటలకు, ఒక మహిళ తన కాబోయే భర్తతో కలిసి కొంత సమయం గడపడానికి సీతానగరం పుష్కర్ వద్దకు వచ్చారని, ఆ సమయంలో ఇద్దరు దుండగులు ఆ జంటపై దాడి అతనిని కట్టిపడేసి, బ్లేడ్ తో  గొంతు కోస్తామని  బెదిరించారని, మరో దురాక్రమణదారుడు ఈ సమయంలో మహిళను మానభంగం చేసాడని ఆయన అన్నారు.
 
తరువాత దుండగులు జంట దగ్గర ఉన్న నగలను దోచుకుని చీకటిలో తప్పించుకు పారిపోయారని చంద్రబాబు చెప్పారు. మనం మహిళలకు రక్షణ కల్పించలేకపోతే, కొత్త చట్టాలు తీసుకు వస్తున్నామని చెబుతున్న డాబుసరి మాటలు వ్యర్థమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇటువంటి ఘోరమైన నేరాలను నివారించడానికి ఇప్పుడున్న చట్టాలు, మౌలిక సదుపాయాలు సరిగా అమలు చేస్తే సరిపోతాయని ఆయన చెప్పారు.
    
ప్రభుత్వం దిశా పేరిట ప్రజలకు చెబుతున్న మాటలకు, చేస్తున్న చేష్టలకు, వాస్తవికతకు భిన్నంగా ఉంది. దిశా చట్టం ఉనికి గురించి ప్రజలకు తెలియజేయాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో దిశా చట్టం అమల్లో ఉందా? దిశా చట్టం కింద ఎన్ని కేసులను నమోదు చేసి చర్యలు తీసుకున్నారు? దిశా చట్టం ప్రకారం 24 గంటల్లో చర్య తీసుకుంటానని చేసిన వాగ్దానం ఏమి అయిందని ఆయన ప్రశ్నించారు.
  
సీతానగరం సంఘటన జరిగి ఎన్ని గంటలు గడిచాయని ఆయన అడిగారు. దిశా పేరిట ప్రభుత్వం సాధించిన ఏకైక లక్ష్యం పాలక వైసీపీ పార్టీ రంగులను దిశా పోలీస్ స్టేషన్లకు వేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించడం తప్ప మహిళలకు మేలు చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు.  ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీస్ పెట్రోలింగ్ చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గతంలో సీతానగరం పుష్కర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్ట్ శిథిలావస్థలో ఉందని ఆయన చెప్పారు. డిజిపి కార్యాలయం, ముఖ్యమంత్రి ఇంటికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో మాదకద్రవ్యాల విక్రయాలు, సంఘ విద్రోహ శక్తులుపై అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలను ప్రారంభించలేదని ఆయన తప్పు పట్టారు.

ఈ నేపథ్యంలో సీతానగరం సమీపంలోని కృష్ణా నది ఒడ్డున పోలీసు పెట్రోలింగ్‌ను వెంటనే మెరుగుపరచాలని ఆయన కోరారు. ప్రజలలో విశ్వాసాన్ని పెంపొందించడానికి, రాష్ట్రవ్యాప్తంగా మహిళలను రక్షించడానికి పోలీసులు వెంటనే స్పందించి నేరస్థులను త్వరితగతిన పట్టుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

click me!