జగన్ ప్రభుత్వానికి సుప్రీంలో మరో షాక్: హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరణ

By narsimha lodeFirst Published Sep 3, 2020, 11:47 AM IST
Highlights

సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. ఒకటో తరగతి నుండి ఆరో తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కు సుప్రీంకోర్టు నిరాకరించింది.

అమరావతి: సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. ఒకటో తరగతి నుండి ఆరో తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కు సుప్రీంకోర్టు నిరాకరించింది.

ఒకటో తరగతి నుండి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం 81,85 జీవోలను జారీ చేసింది.ఈ జీవోలను ఏపీ హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీన కొట్టివేసింది.

మెజారిటీ విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం బోధనకు సానుకూలంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది విశ్వనాథన్ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయడం సరైంది కాదని ఆయన వాదించారు.

అయితే ఈ విషయమై ప్రతివాదులకు నోటీసులు ఇస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రతివాదులకు నోటీసులతో పాటు స్టే కూడ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే  స్టేకు కోర్టు నిరాకరించింది. 

విద్యా హక్కు చట్టంలో లో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్న నిబంధన ఏమీ లేదని ఏపీ ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.  
విద్యా బోధన ఇంగ్లీష్ మీడియంలో జరగాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రగతిశీల నిర్ణయమని ఆయన వాదించారు.

తెలుగు మీడియం విద్యా బోధన వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం తీవ్రంగా తగ్గిపోతుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.ప్రతివాదుల తరపు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది శంకర్నారాయణన్. 

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు తెలుగు మీడియాన్ని ఎంచుకునే అవకాశాన్ని కాలరాస్తుందని శంకర్ నారాయణన్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. 
తెలుగు మీడియాన్ని  పూర్తిగా కనుమరుగు చేసే ప్రతి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. 

హైకోర్టు తీర్పు విద్యార్థుల మాతృ భాష నేర్చుకునే హక్కులను కాలరాస్తున్న శంకర్ నారాయణన్ ఉన్నత న్యాయస్థానం ముందు తెలిపారు.
ప్రతివాదులు అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత స్టే అంశాన్ని పరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు తెలిపింది. 

జస్టిస్ చంద్రఛూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ ను విచారించింది. ఈ కేసు విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసుపై  కేవియట్ వేసిన  విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 

click me!