వైఎస్ జగన్, చంద్రబాబుల కంటే గొప్ప శ్రీమంతుడు... ఎవరీ పెమ్మసాని చంద్రశేఖర్..?

By Arun Kumar PFirst Published May 2, 2024, 4:27 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో రిచ్చెస్ట్ పొలిటీషన్ ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదంటే చంద్రబాబు నాయుడు పేరు వినిపిస్తుంది. కానీ వారిని తలదన్నే ఆస్తులను కలిగివున్నాడో టిడిపి అభ్యర్థి. అతడు ఎవరంటే... 

గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే అన్నిపార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఆస్తిపాస్తుల వివరాలన్ని బయటకు వచ్చాయి. ఇందులో ఒక్కొక్కరికి వందలు వేల కోట్ల ఆస్తులుంటే మరికొందరికి కేవలం లక్షల ఆస్తులు మాత్రమే వున్నాయి. కొందరయితే పార్టీల అధినేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కంటే అధికంగా ఆస్తులు కలిగివున్నారు. ఇలా టిడిపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే ధనిక అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచారు. 

ఎవరీ పెమ్మసాని చంద్రశేఖర్ : 

గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం గ్రామంలో ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిపెరిగారు పెమ్మసాని చంద్రశేఖర్. చిన్నతనంనుండే చదువులో చురుగ్గా వుండే ఆయన ఇంటర్మీడియట్ తర్వాత ఎంబిబిఎస్ సీటు సాధించారు. ఇంటర్ వరకు చదువంతా తెలుగు మీడియమే.. అయినా ఎంతో కష్టపడి డాక్టర్ పట్టా తీసుకున్నారు. మెడిసిన్ పూర్తయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అమెరికాకు వెళ్ళడం అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.  అనుకోకుండా 'యూ వరల్డ్ ఆన్ లైన్ ట్రైనింగ్' పేరిట నర్సింగ్, న్యాయ, వాణిజ్య, అకౌంటింగ్ పరీక్షలకు శిక్షణను ఇచ్చే సంస్థను స్థాపించారు.  ఇలా విద్యార్థిగా అమెరికాకు వెళ్లిన పెమ్మసాని వ్యాపారిగా మారారు. 

రాజకీయ ప్రమాణం : 

పెమ్మసాని చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావుకు ఎన్టీ రామారావు అంటే చాలా ఇష్టం. ఈ కారణంతోనే ఆయన తెలుగుదేశం పార్టీ చేరారు. ఆ తరువాత నరసరావుపేట పట్టణ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇలా తన తండ్రి కొనసాగిన పార్టీలో చంద్రశేఖర్ చేరారు. ఆయనకు చంద్రబాబు అంటే చాలా ఇష్ఠం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలో పర్యటిస్తున్న వేళ ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేసిన ఆ సమావేశాలకు చంద్రశేఖర్ తప్పకుండా హాజరయ్యారు. ఆ సమయంలోనే చంద్రబాబుతో ముఖాముఖి పరిచయం ఏర్పడింది.చంద్రశేఖర్ సాధించిన విజయాన్ని చూసి చంద్రబాబు కూడా ఎంతో అభినందించారు. అలా రాజకీయాలపై మరింత ఆసక్తి పెంచుకొని చంద్రబాబు టిడిపితో కలిసి పని చేయడం ప్రారంభించారు.

చంద్రశేఖర్ .. 2014లోనే టీడీపీ నుంచి నర్సరావుపేట లోక్‌సభ టిక్కెట్‌ కోసం ప్రయత్నించారు. కానీ, 2014, 2019లో మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావుకు అవకాశం ఇవ్వడంతో ఆయన కొంత కాలం వేచి ఉన్నారు. ఈ తరుణంలో ఆయనకు నరసాపురం అసెంబ్లీ టిక్కెట్ వస్తుందని అందరూ భావించారు. కానీ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం తీసుకుంటున్నానని ప్రకటించడంతో చంద్రశేఖర్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగంలోకి దిగారు. 

పెమ్మసాని కుటుంబ ఆస్తులు : 

ఇటీవలే గుంటూరు లోక్ సభ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ వేసారు. ఈ సందర్భంగా అతడు సమర్పించిన అఫిడవిట్ లో ఏకంగా రూ.5,705 కోట్ల ఆస్తులను చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది వైఎస్ జగన్, చంద్రబాబు కుటుంబ ఆస్తులకంటే చాలా ఎక్కువ.  

పెమ్మసాని పేరిట రూ.2,316 కోట్లకు పైగా చరాస్తులు వున్నాయి. అతడి భార్య కొనేరు శ్రీరత్న పేరిట రూ.2,289 కోట్లు, కుమారుడు అభినవ్ పేరిట రూ.496 కోట్లు, కుమార్తె సహస్ర పేరిట మరో రూ.496 కోట్లకు పైగా ఆస్తులు వున్నాయి. 

ఇక చంద్రశేఖర్ పేరిట మరో 72 కోట్లు, భార్య పేరిట 34 కోట్ల స్థిరాస్తులు వున్నాయి. మొత్తంగా పెమ్మసాని కుటుంబం ఆస్తులు రూ. 5, 705 కోట్లుగా వున్నాయి. విద్యా, వ్యాపారంలో సత్తాచాటిన పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పుడు రాజకీయాల్లో తనదైన మార్క్  చూపించాలని ప్రయత్నిస్తున్నారు. 

click me!