చివరకు ట్రస్ట్ భవన్ కు ఏం గతి పట్టింది ?

First Published Nov 25, 2017, 2:49 PM IST
Highlights
  • మన కళ్ళ ముందే కళకళలాడుతూ చివరకు ప్రాభవాన్ని కోల్పోవటమంటే కాస్త బాధే.

రాజుల కాలం, జమిందార్ల కాలంలో కళకళలాడిన భవనాల గురించి మనం చదువుకున్నాం. కొన్ని సినిమాల్లో చూసే ఉంటాం. కానీ మన కళ్ళ ముందే కళకళలాడుతూ చివరకు ప్రాభవాన్ని కోల్పోవటమంటే కాస్త బాధే. ఇంతకీ ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గురించే లేండి. 1995 ప్రాంతంలో ట్రస్ట్ భవన్ నిర్మించిన దగ్గర నుండి 2014 వరకూ ప్రతి రోజూ కాంపౌడ్ కళకళలాడిపోయేది. రోజుకు కొన్ని వేలమంది వచ్చి పోయేవారు.

అటువంటిది ట్రస్ట్ భవన్ కు రాష్ట్ర విభజన పెద్ద శాపమైపోయింది. సరే, ఏపిలో అధికారంలోకి వచ్చారు కదా అనుకుంటే వెంటనే ‘ఓటుకునోటు’ కేసు చంద్రబాబునాయుడును తగులుకున్నది. దాంతో హైదరాబాద్ నుండి అర్ధాంతరంగా విజయవాడ చేరుకోవటంతో ట్రస్ట్ భవన్ కార్యకలాపాలు సగం తగ్గిపోయాయి. దానికితోడు సచివాలయం, అసెంబ్లీ కూడా ఏపికి మారిపోవటంతో ప్రజా ప్రతినిధులెవరూ హైదరాబాద్ కు వచ్చే అవసరం కూడా లేకపోయింది. ఇపుడు ఏపి నేతలెవరూ ట్రస్ట్ భవన్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా టిటిడిపి నుండి ఎంఎల్ఏలు టిఆర్ఎస్ లో చేరిపోవటం, రేవంత్ రెడ్డితో పాటు చాలామంది నేతలు పార్టీకి రాజీనామా చేయటంతో ట్రస్ట్ భవన్ దాదాపు ఖాళీ అయిపోయింది. వందలా మంది కూర్చుని పని చేసుకోవటానికి సరిపడా భవనంలో ఇపుడు పదుల సంఖ్యలో కూడా నేతలు లేరు, సిబ్బందీ లేరు. దాంతో భవనాలన్నీ దాదాపు ఖాళీనే.

అన్ని భవనాలను ఏం చేయాలన్న సమస్య మొదలైంది. ఎందుకంటే, ఈ భవనం టిడిపి సొంత ఆస్తి కాదు. ప్రభుత్వం నుండి స్ధలం లీజుకు తీసుకున్నదే. సరే, ప్రభుత్వానికి స్ధలాన్ని తిరిగి అప్పగిస్తారా లేదా అన్నది వేరే సంగతి. ఖాళీగా ఉంటే ప్రభుత్వం వెనక్కు తీసేసుకునే ప్రమాదముంది. అందుకనే భవనంలో అవకాశం ఉన్నపుడల్లా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ, సివిల్స్ కోచింగ్ కేంద్రాలుగాను, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగాను నెట్టుకొస్తున్నారు. తాజాగా సంగీత పోటీలకు కూడా స్ధానం కల్పించారు. శనివారం ట్రస్ట్ భవన్లో పాటల పోటీలు కూడా జరిగాయి. ఎలాంటి ట్రస్ట్ భవన్ ఎలా అయిపోయిందో చివరకు ?

 

click me!