అయోధ్య రామమందిరానికి తాళం వేసేస్తారు...: తెలుగు గడ్డపై ప్రధాని మోదీ సంచలనం

By Arun Kumar PFirst Published May 8, 2024, 6:05 PM IST
Highlights

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజంతా తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయోధ్య రామమందిరంపై కాంగ్రెస్ కుట్రలు చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

పీలేరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం కాదు మాఫియా కోసం పనిచేస్తోందని అన్నారు. వైసిపి రౌడీ రాజ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు... త్వరలోనే వారికి విముక్తి కలుగుతుందని ప్రధాని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోనూ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని... బిజెపి,టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఏపీలోని మాఫియా గ్రూపులన్నింటికి ఎన్డిఏ ప్రభుత్వం  ట్రీట్ మెంట్ ఇస్తుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. 

రాజంపేట లోక్ సభ పరిధిలోని పీలేరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసిపి సర్కార్, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసారు. వైసిపి సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యిందని ఆయన హెచ్చరించారు. రాయలసీమకు చెందిన అనేకమంది రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఇక్కడ అభివృద్ది జరగలేదని అన్నారు. రాయలసీమ ప్రజలు చైతన్యవంతులు... ఇదంతా గమనిస్తున్న వారు ఓటేసేముందు ఆలోచించాలని ప్రధాని మోదీ సూచించారు. 

రాయలసీమకు సాగునీరు, తాగునీరు కూడా  సరిగ్గా అందడం లేదు... అందువల్లే ఈ ప్రాంతం బాగా వెనకబడి పోయిందని ప్రధాని అన్నారు. అందువల్లే ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. సీమ ప్రజల కష్టాలు పోవాలంటూ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రధాని అన్నారు. ఎంతో నమ్మకంతో వైసిపిని  గెలిపించి అధికారం కట్టబెట్టి మరోసారి ప్రజలు మోసపోయారని అన్నారు. ఈ ఐదేళ్లలో ఏమాత్రం అభివృద్ది జరక్కపోగా విధ్వంసం జరిగిందన్నారు. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని ప్రధాని మోదీ ఆరోపించారు. 

ఇక దేశాన్ని మరోసారి విభజించి పాలించాలని కాంగ్రెస్ చూస్తోందని... అందులో భాగంగానే తెల్లవాళ్లు, నల్లవాళ్లు అంటూ కొందరు కామెంట్స్  చేస్తున్నారని ప్రధాని అన్నారు.  విభిన్న జాతుల సమూహమే మన దేశం... అంలాంటిది దేశ ప్రజలను అవమానించేలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకువస్తామని, రామమందిరానికి తాళం వేస్తామని కాంగ్రెస్ అంటోంది... అలాంటి పార్టీకి ఓటేద్దామా? అని మోదీ ప్రశ్నించారు. దేశంలో ఇలాగే శాంతిభద్రతలు కొనసాగాలంటే, విదేశాల్లో భారతీయులకు గౌరవం దక్కాలంటే, ప్రజలంతా సుఖంగా వుండాలంటే మళ్లీ ఎన్డిఏ అధికారంలోకి రావాలని ప్రధాని తెలిపారు. 

ఆంధ్ర ప్రదేశ్ అన్నిరకాలుగా అభివృద్ది చెందాలంటు ఎన్డీఏను గెలిపించాలని ప్రధాని మోదీ కోరారు. రాయలసీమ స్థితిగతులను కేవలం ఏన్డీఏ మాత్రమే తీర్చగలదని అన్నారు. ఏపీకి బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలని బిజెపి కోరుకుంటోందని అన్నారు. ఇప్పటికే కడప-బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ మంజూరయ్యిందని, కడప విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణంలో వుందన్నారు. ఇలా రాయలసీమ అభివృద్దికోసం ఎన్డిఏ ఎంతో చేస్తోంది... మళ్ళీ అధికారంలోకి రాగానే ఇంకెంతో చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. 


 

click me!