ఆఫీసులు మార్చడం కాదు... అదీ నిజమైన వికేంద్రీకరణ అంటే: కళా వెంకట్రావు

By Arun Kumar PFirst Published Jul 4, 2020, 6:49 PM IST
Highlights

అభివృద్ధి వికేంద్రీకరణ అంటే స్థానిక సంస్థలకు విధులు-నిధులు బదిలీ చేయడమని... కేవలం ఆపీసులు మార్చడం కాదని టిడిపి ఏపి అధ్యక్షులు కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు.

అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణ అంటే స్థానిక సంస్థలకు విధులు-నిధులు బదిలీ చేయడమని... కేవలం ఆపీసులు మార్చడం కాదని టిడిపి ఏపి అధ్యక్షులు కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. 1993 లో భారత రాజ్యాంగ చట్ట సవరణలు 73, 74 ల ద్వారా దేశంలోని గ్రామ పంచాయతీలకు, మున్స్పిపాలిటీలు, కార్పోరేషన్లకు విదులు, నిధులను బదలాయించామని పేర్కొన్నారని తెలిపారు. కానీ జగన్ స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు తగ్గించిందని... టిడిపి ప్రభుత్వ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖలకు రివైజ్డ్ బడ్జెట్ లో రూ.31,208 కోట్లు కేటాయించగా, దాన్ని జగన్ ప్రభుత్వం రూ.11,661 కోట్లకు కోత కోశారని అన్నారు. 

''నరేగాకు టిడిపి 2018-19 లో 9 వేల కోట్లు ఖర్చు చేయగా, దాన్ని జగన్ ప్రభుత్వం రూ.6,700 కోట్లకి పరిమితం చేశారు. వాలంటీర్లు, కన్సల్టెంట్ల పేరుతో పంచాయతీ, మున్సిపల్, జిల్లా పరిషత్ ల అధికారాలు జగన్ కుదింపు చేస్తున్నారు. తన పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా చేసుకుని స్థానిక సంస్థల అధికారాలను కుదించేశారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులు ల్లో సమాంతరంగా ప్రైవేటు కన్సెల్టెంట్లను నియమించుకుని స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు'' అని మండిపడ్డారు. 

''స్థానిక సంస్థలలో అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన 14 వ ఆర్ధిక సంఘం నిధులు పంచాయతీ భవనాలకు వేసిన వైకాపా పార్టీ రంగులను తుడవడానికి ఖర్చు చేస్తున్నారు. మరోవైపు అన్ని నిత్యవసరాల ధరలు పెంచి రూ.50 వేల కోట్లు ప్రజల చేతుల్లో నుండి జగన్ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొన్నది'' అని అన్నారు. 

read more  వారిని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టే కుట్ర: జగన్ మీద కళా వెంకట్రావు

'' వికేంద్రీకరణ అంటే ఆపీసులు మార్చడం కాదు. రాష్ట్రంలోని 175 నియోజక వర్గాలలో పారిశ్రామిక పెట్టుబడులను పెట్టి అభివృద్ధి చేయడం  గత ఏడాది పాలనలో జగన్ పారిశ్రామికవేత్తల నుండి జే-టాక్స్ వసూలు చేయడంతో రూ. 1.80 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రక్క రాష్ట్రాలకు పారిపోయేలా చేశారు. ప్రతీ పంచాయతీకి సాగునీరు అందించడం అధికార వికేంద్రీకరణ. టిడిపి ప్రభుత్వం సాగు, త్రాగు నీటికి 2018-19 లో రూ.13,988 కోట్లు ఖర్చు చేయగా జగన్ దాన్ని రూ. 4,911 కోట్లకు కోత కోశారు'' అని తెలిపారు. 

''జగన్ తన సొంత సామాజిక వర్గానికి 702 మందిని కీలకమైన నామినేషన్ పదవుల్లో నియమించుకున్నారు. నామినేషన్ పదవుల్లో 50 శాతం ఎస్.సి, ఎస్.టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చట్టం చేసి గొప్పలు చెప్పిన జగన్ 36 మంది ట్రస్టు సభ్యులలో 5 మంది ఎస్సి, బీసీలను మాత్రమే నియమించారు'' అని ఆరోపించారు.

''2000-01లో కూడా చంద్రబాబు ప్రభుత్వం 34శాతంతో ఎన్నికలు జరిపింది. 2005-06లో కూడా 34 శాతంతో ఎన్నికలు జరిగాయి. 2012 హైకోర్టు ధర్మాసనం 34శాతంకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పటికీ ఆనాటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి 34 శాతానికి అనుకూలంగా తీర్పు పొంది 60.55 శాతంతో ఎన్నికలు నిర్వహించడమైంది. మరి జగన్ ప్రభుత్వం ఆ విధంగా సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు? ఇది సామాజిక న్యాయం కుదించడం కాదా? అధికారం తన వర్గం చేతిలో కేంద్రీకరించడం కాదా?'' అని ప్రశ్నించారు. 

''2018-19 లో ఎస్సీ సబ్ ప్లాన్ కు రూ. 9 వేల కోట్లు ఖర్చు చేస్తే. 2019-20 లో జగన్ ప్రభుత్వం రూ.4,370 కోట్లు ఖర్చు చేసినట్టు బడ్జట్ గణాంకాల్లో చూపారు. కానీ ఇందులో ఫించన్లు, అమ్మఒడి ఖర్చు మినహాయిస్తే నికరంగా చేసిన ఖర్చు రూ.3,373 కోట్లు మాత్రమే. కేటాయింపులు కొండత. ఖర్చు గోరంత'' అని కళా వెంకట్రావు వెల్లడించారు. 

click me!