గుంటూరు గ్యాంగ్ రేప్... హోంమంత్రి, డిజిపిలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు (వీడియో)

By Arun Kumar PFirst Published Jun 23, 2021, 3:34 PM IST
Highlights

గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం పుష్కరఘాట్ వద్ద జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన వైసిపి ప్రభుత్వాన్ని విమర్శలపాలు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ హోంమంత్రి, డిజిపిలతో సమావేశమయ్యారు. 

అమరావతి: కాబోయే భర్తతో సరదాగా బయటకు వెళ్లిన యువతిపై దుండగులు అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.  గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం పుష్కరఘాట్ వద్ద జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన వైసిపి ప్రభుత్వాన్ని విమర్శలపాలు చేసింది. రాష్ట్రంలో శాంతిభధ్రతలు క్షీణించడంవల్లే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  మహిళల భద్రతపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం అధికారులతో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులకు, ఇతర అధికారులకు సూచించారు. దిశ యాప్‌పై పూర్తి చైతన్యం కలిగించాలని... యాప్‌ ఎలా వాడాలన్న దానిపై పూర్తి అవగాహన కలిగించాలన్నారు. 

Latest Videos

వీడియో

''ఇంటింటికీ వెళ్లి అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసేలా చూడాలి. గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వాలంటీర్లతో అక్క చెల్లెమ్మలకు అవగాహన కలిగించాలి. ముందుగా మహిళా పోలీసులకు, వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా అక్క చెల్లెమ్మలకు అవగాహన కలిగించాలి. ప్రమాదకర పరిస్థితుల్లో ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలన్న దానిపై అక్క చెల్లెమ్మలకు చెప్పాలి. దీన్ని ఒక డ్రైవ్‌గా తీసుకోవాలి'' అని సీఎం ఆదేశించారు. 

కాలేజీలు, విద్యాసంస్థల్లో కూడా విద్యార్థినులకు యాప్‌ వినియోగంపై అవగాహన కలిగించాలి. ఈ చర్యల వల్ల దిశ యాప్‌ వినియోగం పెరుగుతుంది. అక్క చెల్లెమ్మలను ఆదుకునేలా ఆ మేరకు వెనువెంటనే చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధం కావాలి. దిశ పోలీస్‌స్టేషన్లు, స్థానిక పోలీస్‌స్టేషన్లు సత్వరమే స్పందించేలా వారిని సన్నద్ధం చేయాలి. పోలీస్‌ స్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్‌ వాహనాలను సమకూర్చాలి.'' అని తెలిపారు. 

ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్న ఈ సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

click me!