heavy rains: ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే అలర్ట్ అయిన ఏపీ సర్కారు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించింది. సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలిచ్చారు.
andhra pradesh rainfall : ఆంధ్రప్రదేశ్ లో వానలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షంతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. చాలా ప్రాంతాలు జలమయ్యాయి. అల్పపీడనం కారణంగా భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులు, వాటి ఉపనదులతో సహా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల గుండా ప్రవహించే నదుల్లో మరో రెండు రోజుల పాటు నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరో రెండుమూడు రోజుల వరకు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలతో ఏపీ సర్కారు అప్రమత్తం అయింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ తో వర్షాలపై పరిస్థితిని సమీక్షించించారు.
undefined
వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఓర్వకల్లు పర్యటనను కూడా రద్దు చేసుకుని వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందనీ, పూర్తి అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగానికి సీఎం ఆదేశాలిచ్చారు. కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క అధికారి పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు వర్షం వల్ల వచ్చే ఇబ్బందులను తొలగించి సహాయం అందించడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు.
అధికారులకు సీఎం సూచనలు, ఆదేశాలు ఇవే..
భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయి అప్రమత్తతో ఉంటే ప్రజల ఇబ్బందులను తగ్గించవచ్చు. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలనీ, పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై భారీ స్థాయిలో నీరు చేరి ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోంది. వీటిపై దృష్టిపెట్టాలన్నారు. పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు. వర్షాలు, వరదల కారణంగా తాగునీరు, ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనిపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు.
అల్లూరి జిల్లాలో కలుషిత ఆహారం ఘటనపై ఆరా తీసిన ముఖ్యమంత్రి వీటిపై అధికారులు సీరియస్ గా దృష్టిపెట్టాలనీ, బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు. కలుషిత ఆహారం ఘటనలకు గల కారణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థవంతంగా పనిచేయాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా ఏజెన్సీలలో జ్వరాలు బారిన పడిన గిరిజనులకు వైద్యం అందేలా చూడాలన్నారు. ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దనీ, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అన్నారు.
ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది
భారీ వర్షాల నేపథ్యంలో వాట్సాప్ గ్రూప్ ల ద్వారా వివిధ శాఖల అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుకుని సమన్వయంతో పనిచేయాలనీ, తద్వారా ప్రజలకు సత్వర సాయం అందుతుందని సూచించారు. క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో డ్రోన్లు వంటి టెక్నాలజీని విరివిగా వాడలన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలపై సమాచారం ఇవ్వాలనీ, భారీ వర్షాలు, వరదలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు అలెర్ట్ మెసేజ్ లు పంపాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలిచ్చారు. విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం తమకు ఆదుకుంటుంది అనే నమ్మకం వారికి కల్పించేలా అధికారుల, ప్రజా ప్రజాప్రతినిధుల స్పందన ఉండాలన్నారు.
పింఛన్ల పంపిణీకి వర్షం దెబ్బ
ఇరిగేషన్ ప్రాజెక్టులలో నీటి నిల్వలను నిరంతరం మానిటర్ చేయాలన్నారు. దీంతో ప్రమాదాలను ముందుగానే నివారించే అవకాశముంటుందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధులు విడుదలకు ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలిపారు. ప్రాజెక్టుల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. అధికారులు ఈ విషయంలో బాధ్యతగా ఉండాలన్నారు. పింఛన్ల పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు ఇచ్చామనీ, రేపు సెలవు కాబట్టి ముందు రోజే పింఛన్లు ఇవ్వాలని చూశామన్నారు. అయితే భారీ వర్షాల కారణంగా పింఛన్ల పంపిణీకి సమయం పెంచామన్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో సచివాలయ ఉద్యోగులు పింఛన్ల పంపిణీ పూర్తి చెయ్యవచ్చు. వర్షాలు లేని ప్రాంతాల్లో యధావిధిగా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. విజయవాడలో కొండచరియలు విరిగి ఇంటిపై పడిన ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రకటించారు.
కరెంట్ తీగలతో జాగ్రత్త... విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ అధికారులను అప్రమత్తం చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రజల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలనీ, ప్రమాదాల నివారణపై అధికారులు దృష్టి సారించాలన్నారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాని కోరిన మంత్రి.. అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అన్నారు. విద్యుత్ తీగలు తెగిపడిన, కిందకు జారిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలనీ, వాటిని తాకడం, పక్కకు నెట్టడం లాంటి పనులు చేయవద్దన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు అలసత్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.