గ్రామవాలంటీర్లకు జీవో జారీ: ఈనెల 24 నుంచి ఆన్ లైన్లో దరఖాస్తు

By Nagaraju penumalaFirst Published Jun 22, 2019, 5:19 PM IST
Highlights


గ్రామవాలంటీర్లు 50 కుటుంబాలకు ఒక్కొక్కరు చొప్పున నియమిస్తారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా వాలంటీర్లను నియమించాలని సీఎం జగన్ ఆదేశించారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా వాలంటీర్లు పనిచేయాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్వ్యూ పద్ధతిలో గ్రామ వాలంటీర్లను ఎంపిక చేయనున్నట్లు స్పష్టం చేసింది. 

గ్రామ వాలంటీర్లలో 50 శాతం పోస్టులు మహిళలకు కేటాయించనున్నట్లు నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. ఎక్కడైతే జాబ్‌కు అప్లై చేసుకుంటారో సంబంధిత గ్రామ వాసిగా ఉండాలని షరతులు విధించింది. 

గ్రామవాలంటీర్ పోస్టుకు కనీస విద్యార్హత ఇంటర్మిడియట్ ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో పదవ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుందని తెలిపింది.
 
అలాగే 18 నుంచి 35 ఏళ్లోపు వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈనెల 24 నుంచి వచ్చే నెల 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. జూలై 10 వరకు స్క్రూటినీ ఉంటుందని, జూలై 11 నుంచి 25 వరకు ఎంపిక జరుగుతుందని స్పష్టం చేసింది. 

ఇంటర్వ్యూ పద్ధతిలో గ్రామ వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపింది. ఎంపికైన వారి జాబితాను ఆగష్టు 1న ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఆగష్టు 15నాటికి అమలులోకి గ్రామ వాలంటీర్ వ్యవస్థ అందుబాటులోకి రానుందని తెలిపింది. 

గ్రామవాలంటీర్లు 50 కుటుంబాలకు ఒక్కొక్కరు చొప్పున నియమిస్తారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా వాలంటీర్లను నియమించాలని సీఎం జగన్ ఆదేశించారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా వాలంటీర్లు పనిచేయాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 

అంతేకాదు వాలంటీర్లుగా నియమితులయ్యే వారు తమ పరిధిలో ఉండే కుటుంబాల నుంచి అందే వినతులు, వారి సమస్యలపై ఎప్పటికప్పుడు గ్రామ, వార్డు సచివాలయంతో పాటు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి పని చేయాలని కూడా నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడంలో, సంబంధిత సమస్య పరిష్కారంలో కీలకంగా వ్యవహరించాలని సూచించింది.  

click me!