అమరావతిలో ఇటువైపు ఎన్టీఆర్...అటు అంబేద్కర్

First Published May 23, 2017, 7:30 AM IST
Highlights

అమరావతి పరిపాలనా నగరంలో రెండే విగ్రహాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అమరావతి, బహుశా , గాంధీ, నెహ్రూ నీడలు కూడా పడని నగరం అవుతుందేమో.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందిస్తున్న  అమరావతి వరల్డ్ క్లాస్ సిటిలో  ఉత్తరం వైపు ఎన్టీఆర్ విగ్రహం, దక్షిణాన అంబేద్కర్ విగ్రహం  ఉంటాయి. ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

 

అమరావతి పరిపాలనా నగరంలో రెండే విగ్రహాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. బహుశా గాంధీలు నెహ్రూలు నీడలు కూడా పడని నగరం అమరావతి అవుతుందేమో.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందిస్తున్న  అమరావతి వరల్డ్ క్లాస్ సిటిలో  ఉత్తరం వైపు ఎన్టీఆర్ విగ్రహం, దక్షిణాన  డా. బాబా సాహేబ్ అంబేద్కర్ విగ్రహం  ఉంటాయి.

ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

 

ఈ రెండు విగ్రహాలకు నడుమ అమరావతి నగరమంతా కనిపించేలా అత్యంత ఎత్తుగా ప్రత్యేకంగా టవర్ నిర్మించాలని నిర్ణయించారు.

 

సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు రూపొందించిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. దీనిపై నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించి పలు మార్పులు, చేర్పులు సూచించారు.

 

రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన పరిపాలనా నగరం తుది డిజైన్లను మరో రెండువారాల్లో నార్మన్ ఫోస్టర్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించనుంది. అమరావతి పరిపాలనా నగర రూపకల్పనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా, అధికారులు, నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు దాదాపు ఏకాభిప్రాయానికి, ఒక అవగాహనకు వచ్చారు.

 

  అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం సహా వివిధ నిర్మాణాలు రాజధానికి తలమానికంగా వుండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించిన హైకోర్టు భవనం అంతగా ఆకట్టుకోవడం లేదని దానిని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దాలని చెప్పారు.  సచివాలయం, హెచ్ఓడీల కార్యాలయాలు పక్కపక్కనే వుండాలని, వాటికి అభిముఖంగా నివాస సముదాయాలు రావాలని ముఖ్యమంత్రి అన్నారు. పరిపాలన నగరంలో పూర్తిగా ప్రభుత్వ సొత్తు అని, ప్రైవేటు ఆస్తులకు ఎక్కడా చోటులేదని చెప్పారు. అన్నిరకాల సాంస్కృతిక ప్రదర్శనలకు వీలుగా అత్యంత అద్భుతంగా ఒక భవనాన్ని ప్రస్తుతం నిర్ణయించిన కన్వెన్షన్ సెంటర్ సమీపంలోనే నిర్మించాలని ముఖ్యమంత్రి చెప్పారు. శాసనసభ, శాసనమండలికి మధ్యలో సెంట్రల్ హాల్ వుండాలని అన్నారు. నగరానికి రెండు వైపులా అతి పెద్ద పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. బీఆర్టీ, ఎమ్మార్టీ, ఈ బస్ వేల గురించి ముఖ్యమంత్రికి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు వివరించారు.

 

  ఓవైపు పరిపాలనా భవంతులు, మరోవైపు సాధారణ ప్రజానీకం సందర్శించేలా కన్వెన్షన్ సెంటర్, సాంస్కృతిక భవనం, ఎగ్జిబిషన్ సెంటర్, వాణిజ్య కూడలి, పార్కులు వుండాలంటూ తన ఆలోచనలను నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. పరిపాలనా నగరంలో నిరంతరం నీటి ప్రవాహం వుండేలా చర్యలు తీసుకోవాలని, జస్టిస్ సిటీకి పక్కనే మరో నగరానికి చోటు కల్పించాలని చెప్పారు. ప్రజాప్రతినిధులకు, న్యాయమూర్తులకు నివాస సముదాయాలపైనా చర్చ జరిగింది. రాజ్ భవన్‌కు సమీపంలోనే ముఖ్యమంత్రి నివాస భవనం రానుంది.

 

click me!