IND Vs AUS Final: ఆ బాధ వర్ణనాతీతం.. కన్నీరు పెట్టుకున్న టీమిండియా ప్లేయర్స్.. వీడియో వైరల్
ICC World Cup 2023: ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. దీంతో భారత ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. టీమిండియా ఆటగాళ్లు కన్నీరు పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది.
ICC World Cup 2023: గుజరాత్‌లోని అహ్మదాబాద్ మైదానం వేదికగా జరిగిన 2023 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టైటిల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 240 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా 7 ఓవర్ల ముందుగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత జట్టు ప్రపంచ కప్‌ను సగర్వంగా ఎత్తుకుంటుందనే ఆశలు ఒకసారిగా అడియాశలయ్యాయి.
ఈ మెగా టోర్నీలో పరాజయం ఎదుర్కొని జట్టుగా రోహిత్ సేన జైత్రయాత్రను కొనసాగించింది. కానీ, కీలక ఫైనల్ పోరులో ఎవరూ ఊహించని విధంగా టీమిండియా బోల్తా పడటంతో ఈ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఓటమి అనంతరం మైదానంలో ఆటగాళ్లతో పాటు అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ పెవిలియన్ కు వెళ్తున్న సమయంలో కన్నీరు పెట్టుకున్నారు. విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కూడా చాలా ఎమోషనల్‌గా కనిపించారు. కోహ్లీ కళ్లలో నీరు తిరగాయి. మహ్మద్ సిరాజ్ కళ్లలో నీళ్లు ఆగడం లేదు. అతను తన టీ షర్టుతో కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించాడు. అభిమానులు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, రోహిత్, విరాట్‌లకు ఇదే చివరి వరల్డ్ కప్ అని ఆవేదన చెందుతున్నారు.
ఈ ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఈ టోర్నీలో ఫైనల్ మినహా ఒక్క మ్యాచ్‌లోనూ భారత్ ఓడిపోలేదు. ఈ టోర్నమెంట్‌లో టాప్ బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ, టాప్ బౌలర్ గా మహ్మద్ షమీ నిలిచారు. ఇవే భారత ఆటగాళ్ల ఆట తీరుకు సాక్ష్యం
ఈ ఫైనల్‌లో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. శుభ్‌మన్ గిల్‌ను ముందుగానే అవుట్ చేసిన తర్వాత, రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అతడు ఎక్కువ సేపు మైదానం ఉండలేకపోయారు. 47 పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. ఆ తరువాత వచ్చిన కోహ్లీ(54), కేఎల్ రాహుల్ (66) చేసి అవుట్ అయ్యారు. కీలక మ్యాచ్‌లో గిల్, శ్రేయాస్, సూర్యకుమార్ లు చేతులెత్తేశారు. దీంతో టీమిండియా 240 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య చేధనకు వచ్చిన ఆసీస్ బ్యాటర్లు మొదట తడబడ్డారు. వార్నర్, స్మిత్, మార్ష్ వంటి కీలక ఆటగాళ్ల వికెట్లు వెనువెంటనే పడటంతో టీమిండియా అభిమానుల్లో ఆశ చిగురించింది. ఈ సారి కప్ మనదే అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ, ఆసీస్ బ్యాటర్లు హెడ్(130), లబుషేన్‌లు(60) పరుగులతో అద్భుతంగా రాణించారు. కేవలం 43 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించింది. ఆ స్ట్రేలియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.