AUS vs SA Semi-Final: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సెమీస్ నేడే.. ఇరు జట్ల బలాబలాలేంటీ?
AUS vs SA Semi-Final: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ భాగంగా నేడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పోటీపడనున్నాయి. ఈ తరుణంలో బలాబలాలు చర్చనీయంగా మారాయి.
AUS vs SA Semi-Final: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంది. తొలి సెమీఫైనల్ లో న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. ఇక నేడు రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ మ్యాచ్ జరగనుంది. ఇందులో టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా, పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ ఉత్కంఠ పోరుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానున్నది. ఇందులో గెలుపొందిన జట్టు ఫైనల్ పోరులో టీమిండియాతో తలపడుతుంది. ఈ తరుణంలో బలాబలాలు చర్చనీయంగా మారాయి.
ఇప్పటికే ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా నేడు ఆరో టైటిల్ కోసం ముందుకు సాగనుంది. తొలిసారి ప్రపంచకప్ ఫైనల్ ఆడాలనే కలను నెరవేర్చుకునేందుకు దక్షిణాఫ్రికా జట్టు కూడా తీవ్రంగా శ్రమిస్తుంది. రెండు జట్లు చాలా పటిష్టంగా ఉన్నాయి. లీగ్ దశలో ఇరుజట్టు 7-7 మ్యాచ్‌లు గెలిచి సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో గెలుపు-ఓటముల గణాంకాలు దాదాపు సమానంగా ఉన్నాయి.
హోరాహోరీ పోరు తప్పదా..?
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు 109 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో దక్షిణాఫ్రికా జట్టు 55 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, కంగారూ జట్టు 50 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు టై కాగా, ఒక మ్యాచ్ నిలిచిపోయింది. ఈ రికార్డులను పరిశీలిస్తే.. దక్షిణాఫ్రికా పైజేయి. ఇటీవలి రికార్డులలో కూడా దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయించింది. ప్రపంచ కప్ 2023 లీగ్ దశ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 134 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
ఫైనల్ లో బర్త్ ఎవరికి ?
ఇరు జట్ల బలబలాలు సమానంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజేత ఎవరో చెప్పడం కష్టం. హెడ్-టు-హెడ్ గణాంకాలలో దక్షిణాఫ్రికా జట్టు ఆధిపత్యం చెలాయించగా, ఆస్ట్రేలియా జట్టుకు ప్రపంచ కప్ రికార్డుల్లో ఏ జట్టు సాటిరాదు. ఆస్ట్రేలియా ఇప్పటికే ఐదు సార్లు వన్డే ప్రపంచకప్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. ఇక దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్ లో అడుగుపెట్టలేదు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు సెమీ ఫైనల్ మ్యాచుల్లోనూ సఫారీ టీమ్‌కు చుక్కెదురైంది. కానీ.. ఈసారి మాత్రం ఎలాగైనా ఆస్ట్రేలియాను ఓడించి తొలిసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకోవాలనే కసితో ఉంది సఫారీ టీం.
ఈ వరల్డ్‌కప్ మహా టోర్నీలో సౌతాఫ్రికా అసాధారణ ఆట తీరుతో అందర్నీ అలరిస్తోంది. ఆడిన 9 మ్యాచుల్లో ఏడు మ్యాచుల్లో గెలుపొంది తన సత్తా చాటుకుంది. పైగా లీగ్ దశలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులోనూ గెలుపొందింది. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. తొలి రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన.. తరువాత జరిగిన అన్ని మ్యాచుల్లో విజయబావుటాను ఎగరవేసింది. వరుసగా ఏడు మ్యాచుల్లో గెలిని సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఈ తరుణంలో ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగనున్న సెమీస్ పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఇరు జట్లలోనూ టాలెండ్ ఫ్లేయర్స్ ఉన్నారు. ట్రావిస్ హెడ్, మిఛెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్మిత్,లబుషేన్, జోష్ ఇంగ్లిస్, స్టోయినిస్‌లతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్ లో కమిన్స్, జంపా, హాజిల్‌వుడ్, అబాట్, స్టోయినిస్ దూకుడు మీద ఉన్నారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా రాణిస్తోంది.
ఫైనల్ లో అడుగు పెట్టాలని ..
మరోవైపు సౌతాఫ్రికా కూడా గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది. సఫారీ బ్యాటింగ్ విషయానికి వస్తే.. డికాక్, బవుమా, వండర్ డుస్సెన్, డేవిడ్ మిల్లర్, క్లాసెన్, మార్‌క్రమ్ వంటి ఆటగాడ్లు సమయం వచ్చినప్పడల్లా బ్యాట్ ఝూళిపిస్తున్నారు. ఇక బౌలింగ్‌లో కూడా సఫారీ టీం బలంగా ఉంది. మార్కొ జాన్‌సెన్, ఎంగిడి, రబడా, కోయెట్జి, కేశవ్ మహారాజ్ వంటి స్టార్ బౌలర్లు జట్టులో ఉన్నారు. దక్షిణాఫ్రికా జట్టు కూడా గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకు మరోసారి ఫైనల్ ఆడే అవకాశం దక్కిందా? లేదా ఆసీస్ ఓడించి ఫైనల్ లో దక్షిణాఫ్రికా అడుగుపెడుతుందో లేదో వేచి చూడాలి?