Asianet News TeluguAsianet News Telugu

Disneyplus Hotstar: డిస్నీ హాట్‌స్టార్ సరికొత్త రికార్డు.. ఫైనల్ మ్యాచ్ లో ఎంతమంది చూశారో తెలుసా?

Disneyplus Hotstar: ప్రముఖ ఓటీ ప్లాట్ఫామ్ డిస్నీ+ ప్లస్ హాట్‌స్టార్‌  సరికొత్త రికార్డును నమోదు చేసింది. అహ్మ‌దాబాద్ లోని న‌రేంద్ర మోదీ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న భారత్- ఆస్ట్రేలియా ఫైన‌ల్ మ్యాచ్ సమయంలో రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ ఎంతమంది చూశారంటే..?

Disneyplus Hotstar sees record 59 million concurrent viewers in  ICC World Cup India-Australia match KRJ 
Author
First Published Nov 20, 2023, 7:13 AM IST

Disneyplus Hotstar: ప్రముఖ ఓటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ గత రికార్డులన్ని బద్దలయ్యాయి. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగిన వన్డే క్రికెట్ ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ సమయంలో డిస్నీ-హాట్‌స్టార్‌లో రికార్డు స్థాయిలో వీక్షించారు. ఏకంగా 59 మిలియన్ల మంది వీక్షకులు వీక్షించారు. అంటే.. ఏకకాలంలో 5.9 కోట్ల మందికి పైగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ లో ప్రత్యక్షంగా వీక్షించారు.

ఇప్పటివరకు ఏ క్రికెట్ మ్యాచ్ ను ఇంత పెద్ద సంఖ్యలో ఓ OTTలో ప్రత్యక్షంగా చూడలేదు. ఇదే హై రియల్ టైమ్ వ్యూస్. దీంతో గతంలో నమోదైన అన్ని రికార్డులు బద్దలయ్యాయి. అయితే మ్యాచ్ ప్రారంభంలో వీక్షకుల సంఖ్య పెరిగినా.. మ్యాచ్ క్రమంగా ఆస్ట్రేలియాకు అనుకూలంగా మారడంతో వీక్షకుల సంఖ్య తగ్గుతూ వచ్చింది.  

డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో వన్డే క్రికెట్ ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా అత్యధికంగా 5.9 కోట్ల మంది వీక్షకులు నమోదయ్యారని OTT ప్లాట్‌ఫాం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రికార్డుతో భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో నమోదైన 5.3 కోట్ల మంది వీక్షకుల రికార్డు బద్దలైందని తెలిపింది. అలాగే.. 
ప్రపంచ కప్ పోటీ లీగ్ దశలో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లో 3.5 కోట్ల మంది వీక్షకులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా మ్యాచ్‌ను వీక్షించారు.

ఈ సందర్భంగా డిస్నీ-హాట్‌స్టార్ ఇండియా హెడ్ సజిత్ శివానందన్ మాట్లాడుతూ.. “డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఫైనల్ మ్యాచ్‌ను 5.9 కోట్ల మంది వీక్షకులు వీక్షించారు. దీంతో అన్ని రికార్డులు బద్దలయ్యాయి. భారత క్రికెట్ అభిమానుల తిరుగులేని మద్దతు లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్‌లో తాము నూతన శిఖరాలను అధిరోహించడానికి మరింత స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. 

ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే.. 

ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.  ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. శుభ్‌మన్ గిల్‌ ముందుగానే అవుట్ అయినా.. రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అతడు ఎక్కువ సేపు మైదానం ఉండలేకపోయారు. 47 పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. ఆ తరువాత వచ్చిన కోహ్లీ(54), కేఎల్ రాహుల్ (66) చేసి అవుట్ అయ్యారు. కీలక మ్యాచ్‌లో గిల్, శ్రేయాస్, సూర్యకుమార్ లు చేతులెత్తేశారు. దీంతో టీమిండియా 240 పరుగులకే కుప్పకూలింది. 

అనంతరం లక్ష్య చేధనకు వచ్చిన ఆసీస్ బ్యాటర్లు మొదట తడబడ్డారు. వార్నర్, స్మిత్, మార్ష్ వంటి కీలక ఆటగాళ్ల వికెట్లు వెనువెంటనే పడటంతో టీమిండియా అభిమానుల ఆశలు చిగురించాయి. ఈ సారి కప్ మనదే అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ, ఆసీస్ బ్యాటర్లు హెడ్(141), లబుషేన్‌లు(58) పరుగులతో అద్భుతంగా రాణించారు.  కేవలం 43 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించింది. 

ఈ విజయంతో ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. అదే సమయంలో మూడోసారి ట్రోఫీని చేజిక్కించుకోవాలన్న భారత్ కల చెదిరిపోయింది. టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచినా రోహిత్ సేన 11వ మ్యాచ్‌లో వెనుకబడింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో భారత్ రెండోసారి ఓటమిని చవిచూసింది. రికీ పాంటింగ్ సారథ్యంలోని జట్టు చివరిసారిగా 2003లో ఓడిపోయింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios