ప్రతీ శుక్రవారం సినిమా లవర్స్ ఏ సినిమా థియేటర్ లోకి వస్తుందా..? అని వెతుక్కుంటూ ఉంటారు. వీకెండ్ ఎంజాయ్ చేయడానికి సినిమాలే బెస్ట్ ఆప్షన్ అని చాలా మంది భావిస్తారు. అయితే ఈ వారం మాత్రం సరైన సినిమాలు లేక ఆడియన్స్ నిరాశ చెందడంతో పాటు బాక్సాఫీస్ వెలవెలబోయింది. అక్టోబర్ 2 'సైరా' సినిమా రిలీజైంది. దీంతో పోటీకి ఏ 
సినిమా రాదని అనుకున్నారు.

కానీ గోపీచంద్ తను నటించిన 'చాణక్య' సినిమాను అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. పైగా 'సైరా' లాంటి పెద్ద సినిమా థియేటర్ లో ఉండడంతో 'చాణక్య'కి పెద్ద దెబ్బ పడింది. ఓవరాల్ గా చూసుకుంటే కనీసం ఐదు కోట్ల కలెక్షన్స్ కూడా రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. ఇక ఈ వారం రెండు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి.

అందులో ఒకటి పాయల్ నటించిన 'ఆర్డీఎక్స్ లవ్' కాగా మరొకటి సిద్ధార్థ్ నటించిన 'వదలడు'. ఇది డబ్బింగ్ సినిమా కావడం, సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించలేకపోయింది. కనీసం ఈ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందని కూడా జనాలకు తెలియదు.  ఇక పాయల్ నటించిన 'ఆర్డీఎక్స్ లవ్' లో ఆమె గ్లామర్ తప్ప మరేమీ లేదని క్రిటిక్స్ తేల్చేశారు. ఏ మాత్రం ఆకట్టుకోని సీరియస్ డ్రామా కావడంతో ప్రేక్షకులు కనీసం ఆ సినిమావైపు చూడడం లేదు.

ఇక బాలీవుడ్ లో రిలీజైన 'ది స్కై ఈజ్ పింక్' మాత్రం అక్కడి ఆడియన్స్ ని మెప్పించింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా విషయంలో ఆసక్తి చూపుతున్నారు. ఎంతో ఎమోషనల్ గా సాగే ఈ కథలో ప్రియాంక చోప్రా అధ్బుతంగా నటించింది. ఆమె నటన కోసమైనా సినిమా చూడాలనే మాటలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ క్రిటిక్స్ ఈ సినిమాకి ఆకాశానికెత్తేస్తున్నారు.