క్రైమ్ రౌండప్: ఇస్రో సైంటిస్ట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు..మరిన్ని

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఇస్రో సైంటిస్ట్ సురేశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేరళలో గత 14 ఏళ్లుగా ఒకే కుటుంబంలోని ఆరుగురి వరుస మరణాల వెనుక ఉన్నది కోడలేనని పోలీసులు గుర్తించారు. ఆస్తి కోసం రెండో భర్తతో కలిసి ఆమె ఈ దారుణానికి పాల్పడింది. ఇంకా మరిన్ని నేరవార్తలు.

this week crime roundup

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఇస్రో సైంటిస్ట్ సురేశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్వలింగ సంపర్కం, ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు నిర్థారించారు.

సైంటిస్ట్ సురేశ్‌ నుంచి ఆశించిన స్థాయిలో డబ్బు రాకపోవడంతో శ్రీనివాస్ అనే వ్యక్తి అతనిని హతమార్చినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ సుమతి తెలిపారు. హత్య చేసే విధానం గురించి నిందితుడు గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

సురేశ్ ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. అమీర్‌పేటలోని ఓ డయాగ్నిస్టిక్ సెంటర్‌లో శ్రీనివాస్ పనిచేస్తున్నట్లుగా సమాచారం. ఇతని స్వస్థలం పెద్దపల్లి జిల్లా రామగుండం. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్న సురేశ్ కుమార్‌ అమీర్‌పేట ధరం కరం రోడ్‌లోని అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. 


ఆస్తి కోసం రెండో భర్తతో కలిసి కోడలి దాష్టీకం

కేరళలో 2002 నుంచి 2016 వరకు ఒకే కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల సీరియల్ హత్యల వెనుక మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం కోడలు జోలీయే సొంత కుటుంబసభ్యుల్ని హత్య చేస్తూ వచ్చినట్లు నిర్థారించారు.

వివరాల్లోకి వెళితే.. కోజికోడ్‌కు చెందిన రిటైర్డ్ టీచర్ అన్నమ్మ 2002లో కుప్పకూలినప్పుడు అందరూ ఇది సహజ మరణమని భావించారు. ఆరేళ్ల తర్వాత అదే ఇంట్లో అన్నమ్మ భర్త టామ్ థామస్ హార్ట్ ఎటాక్‌తో మరణించాడు.

2011లో వారి కుమారుడు జోలీ భర్త రాయ్ థామస్ సైతం హార్ట్ అటాక్‌తో కన్నుమూశాడు. అయితే పోస్ట్‌మార్టం నివేదికలో ఆయనపై విషప్రయోగం జరిగినట్లు తేలింది. ఆ తర్వాత 2014లో అన్నమ్మ సోదరుడు మ్యాథ్యూ మంజాదియల్ కూడా ఇదే తరహాలో మరణించడంతో అనుమానాలకు తావిచ్చింది.

2016లో అన్నమ్మ బంధువుల కుమార్తె రెండేళ్ల చిన్నారి  అల్ఫాన్సా  సైతం గుండెపోటుతో మరణించగా.. కొద్దినెలల్లోనే ఆమె తల్లి సిల్లీ మరణించింది. అయితే  ఈ హత్యల వెనుక వారి కోడలు, రాయ్ భార్య జోలీ హస్తం ఉన్నట్లు  తేలింది.

సిల్లీ భర్త షాజును పెళ్లాడిన జోలీ.. కుటుంబం ఆస్తిని తమ పేరున రాయాలని మావయ్య టామ్‌పై ఒత్తిడి తీసుకొచ్చి అనుకున్నది సాధించింది.

అయితే అమెరికాలో స్థిరపడిన టామ్ చిన్న కుమారుడు మోజో.. వదినకు ఆస్తి బదలాయింపుపై సవాల్ చేయడంతో పాటు తమ కుటుంబంలో జరుగుతున్న వరుస మరణాలపై క్రైం బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండో భర్త షాజుతో కలిసి సైనేడ్  ద్వారా జోలీ కుటుంబసభ్యులందరిని హతమార్చినట్లు  పోలీసులు ధ్రువీకరించారు. 

 

ప్రేమను ఒప్పుకోలేదని చంపి డ్రైనేజీలో పడేశాడు

అనంతపురం జిల్లాలో అనుమానాస్పద స్ధితిలో మరణించిన డిగ్రీ విద్యార్ధినిని ప్రేమ వ్యవహారమే బలి తీసుకుందని పోలీసులు నిర్థారించారు. వివరాల్లోకి వెళితే.. గుత్తికి  చెందిన అరుణ కుమారి పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం నుంచి ఆమె అదృశ్యమైంది.

అరుణకుమారి కోసం కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్రంగా గాలించారు. ఈ నేపథ్యంలో ఇంటికి సమీపంలోనే డ్రైనేజీ వద్ద ఆమె అపస్మారక స్థితిలో పడివుంది. వెంటనే స్పందించిన స్థానికులు అరుణను ఆసుపత్రికి తరలించారు.

ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే  మృతిచెందినట్లు తెలిపారు. అయితే అరుణ మెడపై గాట్లు ఉండటంతో పాటు తలకు వెనుక భాగంలో గాయాలుండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా తన ప్రేమను ఒప్పుకోలేదన్న కారణంతో రంగస్వామి అనే వ్యక్తి అరుణ కుమారిని గొంతునులిమి  దారుణంగా హత్య చేసినట్లు  తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 


తెలంగాణ సీఎంవో ముఖ్యకార్యదర్శి లేఖ ఫోర్జరీ: కేటుగాడి అరెస్ట్

ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి పేరుతో నకిలీ లెటర్‌హెడ్‌ను తయారు చేయడంతో పాటు ఏకంగా జీవో కాపీని సృష్టించిన మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని రామంతాపూర్‌కు చెందిన మహ్మద్  షఫీక్ అహ్మద్.. సీఎంవో ముఖ్యకార్యదర్శి పేరుతో నకిలీ లెటర్ హెడ్ తయారు చేశాడు.

దాని సాయంతో రాయదుర్గంలోని అత్యంత ఖరీదైన ఓ ప్రభుత్వ  భూమి క్రమబద్ధీకరణకు సంబంధించిన  నకిలీ ఆర్డర్‌ కాపీని సృష్టించాడు. అయితే ఆ స్థల యజమాని అర్జున్‌సింగ్ ఫిర్యాదుతో అహ్మద్ మోసం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు శనివారం కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా కొద్దిరోజుల క్రితం మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఓ హెడ్మాస్టర్ వ్యవహారం కలకలం రేగిన సంగతి తెలిసిందే.

నల్గొండ జిల్లా రావులపెంట జడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ మానవత్ మంగళ... కో ఆర్డినేటర్ పోస్ట్ కోసం మంత్రికేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ లెటర్ హెడ్‌ సృష్టించి కొంతకాలంగా ఆ పోస్టులో  కొనసాగుతున్నారు. అయితే ఫోర్జరీని గుర్తించిన ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. 

జనగామలో దారుణం: భర్తను చితక్కొట్టి... భార్య కిడ్నాప్

జనగామ జిల్లాలో దారుణం జరిగింది. భర్తపై దాడి చేసిన దుండగులు అతని భార్యను కిడ్నాప్ చేశారు. వివరాల్లోకి వెళితే.. జనగామకు చెందిన  బండ తిరుపతి, భాగ్యలక్ష్మీ దంపతులు ఆదివారం ఉదయం జనగామ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం, పారపల్లి గ్రామానికి బైక్‌పై వెళుతున్నారు.

ఈ క్రమంలో రాంపల్లి సమీపంలో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను కారుతో ఢీకొట్టిన దుండగులు తిరుపతిని చితక్కొట్టి ఆయన భార్యను అపహరించుకుపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి స్పృహ తప్పిపడిపోయిన తిరుపతిని స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితుడి నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆస్తి తగాదాల కారణంగానే ఈ కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios