హైదరాబాద్:రాష్ట్రంలో తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తమ పట్టు వీడడం లేదు. ప్రభుత్వం కూడ మెట్టు దిగడం లేదు.  సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని ఈ నెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడ ప్రభుత్వం స్పందించలేదు.ఆర్టీసీ సమ్మె విషయంలో గత వారంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికులతో చర్చల విషయంలో తగ్గలేదు.

RTC Strike:నల్గొండలో ఏడీసీ మల్లయ్య మృతి

తమ డిమాండ్ల సాధన కోసం  ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం ఆరు గంటలలోపుగా విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులంతా సెల్ఫ్ డిస్మిస్ అయినట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఆర్టీసీ జేఎసీ చేస్తున్న సమ్మెకు పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెకు ఒక్కొక్కరిని కూడగడుతున్నారు.

ఈ నెల 13వ తేదీన సమ్మె విషయమై తమకు ముందుగా చెప్పారా అని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ఆర్టీసీ జేఎసీ నేతలను ప్రశ్నించారు. తమ పట్ల రాజకీయపార్టీ నేతలు చేసిన ప్రచారాన్ని ఆయన  ఖండించారు. 

ఐదు లక్షలతో సకల జనుల సమర భేరీ: ఆర్టీసీ జేఎసీ నిర్ణయాలివే

అయితే ఆర్టీసీ జేఎసీ నేతలు మూడు రోజులకే మనసు మార్చుకొన్నారు. ఈ నెల 16వ తేదీన ఆర్టీసీ జేఎసీ నేతలు టీఎన్‌జిఓ నేతలతో సమావేశమయ్యారు. అదే రోజున టీఎన్‌జీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిలవాలని రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది. టీఎన్‌జీవోలతో పాటు తెలంగాణ ఉద్యోగుల జేఎసీ కూడ ఆర్టీసీ సమ్మకు మద్దతుగా నిలిచింది.

 

విద్యుత్ కార్మికులు కూడ ఆర్టీసీ సమ్మకు మద్దతుగా నిలిచారు. విద్యుత్ కార్మికులు కూడ నాలుగు మాసాల క్రితమే సమ్మె నోటీసు ఇచ్చారు.

ఈ నెల 19వ తేదీన విద్యుత్ ఉద్యోగ సంఘాలతో ట్రాన్స్‌కో, జెన్ కో సీఎండీ లు చర్చించారు. దీంతో విద్యుత్ ఉద్యోగులు సమ్మెను తాత్కాలికంగా  విరమించారు. అయితే వీరంతా విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా  పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

రెవిన్యూ ఉద్యోగులు కూడ ఈ సమ్మెకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.  టీఆర్ఎస్ మినహా సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్,బీజేపీలు  ఆర్టీసీ సమ్మెకు తమ మద్దతును ప్రకటించాయి.

ఆర్టీసీ సమ్మె విషయంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేరుగా రంగంలోకి దిగారు. ఈ నెల 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫోన్ చేశారు.

ఆర్టీసీ సమ్మె విషయమై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకొన్నారు.దీంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మను గవర్నర్‌ వద్దకు పంపారు.

ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం తీసుకొన్న చర్యల గురించి రవాణ శాఖ కార్యదర్శి సునీల్ శర్మ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వివరించారు.సెల్ఫ్ డిస్మిస్ గురించి గవర్నర్ తమిళిసై రవాణ శాఖ కార్యదర్శిని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకొంటున్నట్టుగా  సునీల్ శర్మ గవర్నర్ కు వివరించారు.

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు ఈ నెల 18వ తేదీన విచారణ జరిపింది.ఆర్టీసీ కార్మికులతో ఈ నెల 19వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేదు. హైకోర్టు  ఉత్తర్వులు తమకు అందని కారణంగా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చించలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు ఈ నెల 28వ తేదీన విచారణ జరపనుంది. అయితే ఈ విచారణణ జరిపే సమయానికి ప్రభుత్వం ఈ విషయమై ఏ రకమైన చర్యలు తీసుకొంటుందోననేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆర్టీసీ కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు. ఈ విషయమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 23న ఓయూలో ఆర్టీసీ కార్మికులు భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చల విషయంలో ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తోందోనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నెల 21వ తేదీన హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.ఈ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం తమకు కలిసొచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం ఉండదని అధికార టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఈ నెల 17న సీఎం కేసీఆర్ సభ వాతావరణం సరిగా లేని కారణంగా సభ వాయిదా పడింది. హుజూర్ నగర్ లో వర్షం కురవడం, వాతావరణం అనుకూలించని కారణంగా ఏవియేషన్ అధికారులు సీఎం పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. దీంతో కేసీఆర్ సభ వాయిదా పడింది.

చివరి రెండు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించాడు.హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్ధి విజయం సాధిస్తారో ఈ నెల 24న తేలనుంది.