Asianet News TeluguAsianet News Telugu

హుజూర్ నగర్ ఉపఎన్నికకు ఆర్టీసి సమ్మె సెగ

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ లు పావులు కదుపుతున్నాయి. ఆర్టీసీ సమ్మెను ఈ ఎన్నికల్లో తమకు అనుకూలంగా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ప్రజలకు సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మికులతో పాటు విపక్షాలపై టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది.

Rtc strike effect: cpi withdrawn support to trs in huzurnagar bypoll
Author
Hyderabad, First Published Oct 13, 2019, 10:52 AM IST


 హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె చుట్టూ తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి. హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ తన మద్దతును ఉప సంహారించుకొంటామని ప్రకటించింది. ఈ మేరకు టీఆర్ఎస్ కు డెడ్‌లైన్ పెట్టింది..ఆర్టీసీ కార్మికులకు విపక్షాలు మద్దతుగా నిలిచాయి.ఈ నెల 19న విపక్షాలు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి. గత వారంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె చుట్టూనే తెలంగాణలో రాజకీయాలు నడిచాయి.

 తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5 వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ లోపుగా విదుల్లో చేరని ఆర్టీసీ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వేటేశారు. ఈ నెల 6వ తేదీ లోపుగా  విధుల్లో చేరిన 1200 మంది ఆర్టీసీ కార్మికులు మినహా మిగిలిన వారందరిని తొలగిస్తున్నట్టుగా సీఎం ప్రకటించారు.

ఆర్టీసీ కార్మికులకు విపక్షాలు మద్దతుగా నిలిచాయి. తమ సమ్మెకు మద్దతుగా నిలవాలని ఆర్టీసీ జేఎసీ అన్ని రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను కోరింది.ఈ మేరకు విపక్షాలన్నీ కూడ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా  నిలిచాయి.

దసరా తర్వాత అన్ని రాజకీయ పార్టీలు సమావేశమై ఆర్టీసీ జేఎసీకి తమ మద్దతును ప్రకటించాయి. ఈ నెల 19 వ తేదీన తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి రాజకీయ పార్టీలు.ఇదిలా ఉంటే ఈ నెల 21వ తేదీన హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప  ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకొంటామని సీపీఐ ప్రకటించింది. టీఆర్ఎస్ కు మద్దతు విషయమై ఈ నెల 14న జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం టీఆర్ఎస్ కు మద్దతుపై ఉపసంహరించుకొంటున్నట్టు అధికారికంగా ప్రకటించే చాన్స్ ఉందని సీపీఐ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ అనుసరించిన వైఖరిని నిరసిస్తూ సీపీఐ ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.. సమ్మె చేస్తున్న కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు... సమ్మె చేయడాన్ని తప్పుబట్టడం వంటి నిర్ణయాలను నిరసిస్తూ సీపీఐ ఈ నిర్ణయం తీసుకొంది.

ఈ నెల 1వ తేదీన జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని సీపీఐ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికులు తమ  సమ్మెకు మద్దతివ్వాలని టీఎన్జీవోలను కోరారు. అదే సమయంలో టీఎన్జీవో నేతలు సీఎం కేసీఆర్ తో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. 

ఆర్టీసీ కార్మికులు తమను మద్దతు కోరే విషయంలో అనుసరించిన విధానం సరిగా లేదని టీఎన్జీవో నేతలు అభిప్రాయపడ్డారు.ఈ మేరకు టీఎన్జీవో నేతలు ఆర్టీసీ జేఎసీ నేతలకు లేఖ రాశారు.

ఆర్టీసీ సమ్మెను  తమకు అనుకూలంగా మలుచుకోవాలని రాష్ట్రంలోని విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ ఈ అంశాన్ని ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తోంది.

ఆర్టీసీ సమ్మె విషయమై గవర్నర్ కు బీజేపీ ఫిర్యాదు చేసింది.ఈ విషయమై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయంగా ఈ విషయంలో కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

ఈ నెల 12వ తేదీన ఆర్టీసీ బస్ భవన్ ముందు బీజేపీ, ఆర్టీసీ జేఎసీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సమయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సొమ్మసిల్లిపడిపోయాడు. 

కాంగ్రెస్ పార్టీ కూడ ఆర్టీసీ సమ్మెను రాజకీయంగా తమకు ప్రయోజనం కల్గించే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఈ అంశాన్ని కాంగ్రెస్ తమకు అనుకూలంగా వాడుకొనే ప్రయత్నం చేస్తోంది.

ఆర్టీసీ సమ్మెకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో కాంగ్రెస్ ప్రత్యక్షంగా పాల్గొంటుంది. ఆర్టీసీ సమ్మె విషయమై సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయాలను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ విపక్షాలతో కలిసి పోరాటాల్లో పాల్గొంటుంది.

ఆర్టీసీ సమ్మెతో పాటు విపక్షాలు చేస్తున్న డిమాండ్ల విషయంలో ప్రభుత్వం, టీఆర్ఎస్ ఎదురు దాడికి దిగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అని ప్రశ్నించారు. ఆయా రాష్ట్రాల్లో ఆర్టీసీ పరిస్థితులపై కూడ ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేప్తున్నారు.

సమ్మెలో ఉన్న కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని సీఎం కేసీార్ ఈ నెల 12న నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు తేల్చి చెప్పారు. స్కూళ్లకు ఈ నెల 19వ తేదీ వరకు సెలవులను పొడిగించారు.తొలగించిన ఉద్యోగుల స్థానంలో కొత్త వారిని నియమించాలని సీఎం అధికారులను కోరారు.

రాష్ట్రంలోని అన్ని బస్సులు నడిచేలా చర్యలు  తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సమ్మె పేరుతో విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

మరో వైపు ఆర్టీసీ జేఎసీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ నెల 19 వరకు ఆందోళన కార్యక్రమాలను ప్రకటించారు. బస్ డిపోల వద్ద వంటావార్పులు, రాస్తారోకోలు, విద్యార్థి సంఘాలతో ర్యాలీలు, చివరగా ఈ నెల 19న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios