కోచ్ వివాదం పై నోరు విప్పని పి.‌వి సింధు...

అభిమానుల అంచనాలు, విశ్లేషకుల విమర్శలు తనపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోవని భారత బ్యాడ్మింటన్‌ సూపర్‌స్టార్‌ వ్యాఖ్యానించింది. గత ఏడాది ద్వితీయార్థం పూర్తిగా పరాజయాలే పలకరించినా, సానుకూల దృక్పథంతో టోక్యో 2020 ఒలింపిక్స్‌ మెడలే ధ్యేయంగా షటిల్‌ కోర్టులో శ్రమిస్తున్నానని సింధు తెలిపింది. 

p.v sindhu dont want to speak on coach issue

గత కొంత కాలంగా వరుస వైఫల్యాలతో నిరాశను ఎదుర్కుంటూ... వ్యక్తిగత కోచ్ చేసిన వ్యాఖ్యల వల్ల విమర్శలను కూడా ఎదుర్కుంటున్న పీవీ సింధు ఎట్టకేలకు తన మనసులో ఏమనుకుంటుందో, అసలు తన ముందున్న సవాళ్లేమిటి, తదుపరి లక్ష్యాలేమిటో ఒక మీడియా ఏజెన్సీతో పంచుకుంది. 

అభిమానుల అంచనాలు, విశ్లేషకుల విమర్శలు తనపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోవని భారత బ్యాడ్మింటన్‌ సూపర్‌స్టార్‌ వ్యాఖ్యానించింది. గత ఏడాది ద్వితీయార్థం పూర్తిగా పరాజయాలే పలకరించినా, సానుకూల దృక్పథంతో టోక్యో 2020 ఒలింపిక్స్‌ మెడలే ధ్యేయంగా షటిల్‌ కోర్టులో శ్రమిస్తున్నానని సింధు తెలిపింది. 

also read వయసు తక్కువగా చెప్పాడని... ఇండియన్ క్రికెటర్ పై ఏడాది నిషేధం

2019 ఆగస్టులో బిడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ సాధించిన సింధు, ఈ ఘనత దక్కించుకున్న ఏకైక భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించింది. కానీ ఆ తర్వాత జరిగిన వరుస టోర్నీల్లో దురదృష్టం ఆమెను వెక్కిరించింది. దాదాపుగా అన్ని టోర్నీల్లోనూ ప్రీ క్వార్టర్స్‌లోపే నిష్క్రమించింది. 

డిసెంబర్‌లో జరిగిన టాప్‌-8 షట్లర్లు పోటీపడే బిడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగినప్పటికీ, గ్రూప్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది. 2019లో అత్యున్నత విజయాలు నమోదు చేసిన మన తెలుగు తేజం, కెరీర్‌లో స్టార్‌డమ్‌ పొందిన తర్వాత అత్యంత చెత్త ప్రదర్శనను కూడా గతేడాదే చవిచూడడం గమనార్హం.  

ఒలింపిక్స్‌ ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో పి.వి సింధుపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తొలి ప్రయత్నంలోనే రియోలో రజతం సాధించిన సింధు, టోక్యోలో మరో మెడల్‌ కొడితే దిగ్గజ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ సరసన నిలుస్తుంది. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగాల్లో రెండు పతకాలు సాధించిన ఏకైక అథ్లెట్‌ గా సుశీల్‌ కుమార్‌ రికార్డు నెలకొల్పాడు. టోక్యోలో ఆ ఘనత సాధించి అతని సరసన నిలిచేందుకు సింధు ఉపక్రమించింది.

నేర్చుకుంటున్నా...ఇక పుంజుకోవడమే: ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ అత్యంత గొప్పగా సాగాయని సింధు అభిప్రాయపడింది. కానీ ఆ తర్వాత వరుస టోర్నీల్లో ఆరంభ రౌండ్లలోనే ఓటమి పాలయినా కూడా సానుకూల దృక్పథంతోనే ఉన్నానని సింధు వ్యాఖ్యానించింది. ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించటం సాధ్యపడదని, కొన్నిసార్లు అత్యద్భుతంగా ఆడవచ్చని, మరికొన్నిసార్లు పొరపాట్లు చేయవచ్చని జయాపజయాలపై తన మనసులోమాటను బయటపెట్టింది స్టార్ షట్లర్. 

తాను గతంలో చేసిన పొరపాట్ల నుంచి ఎంతో నేర్చుకున్నానని, సానుకూల వైఖరితో ఉండటం అత్యంత కీలకమని అభిప్రాయపడింది. తప్పిదాల నుంచి నేర్చుకుని, మరింత ధృడంగా పుంజుకోవటం ప్రధానమైన అంశమని, తానిప్పుడు అదే పనిలో నిమగ్నమయినట్టు తెలిపింది. 

డోంట్ కేర్...

తాను ఎక్కడ బరిలోకి దిగినా, విపరీతమైన అంచనాలు ఉంటున్నాయని, కానీ అంచనాల ఒత్తిడి, విమర్శలు తనపై ఎటువంటి ప్రభావం చూపలేవని సింధు పేర్కొంది. తాను ఎప్పుడు ఆడినా నెగ్గాలని అభిమానులు కోరుకుంటున్నారని అది సహజమే అని కానీ ఆ అంచనాల ఒత్తిడి తనపైన పడకుండా చూసుకోగలనని ఆశాభావం వ్యక్తం చేసింది. 

ఏ అథ్లెట్‌ కి అయినా ఒలింపిక్స్‌ లో మెడల్ అంతిమ లక్ష్యమని, స్కిల్‌, వర్కవుట్స్‌, టెక్నిక్‌పై ప్రతి రోజు ఎంతో కష్టపడుతున్నానని, ఒలింపిక్‌ సీజన్‌లో తన ఆట అంతా పద్దతి ప్రకారం సాగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపింది. 

బిందువు బిందువు కలిస్తేనే సింధువు...

ఇక సుశీల్ కుమార్ పథకాల రికార్డును సమం చేసే విషయం గురించి కూడా సింధు స్పందించింది. సుశీల్‌ కమార్‌ ని రెజ్లింగ్‌ దిగ్గజమని పేర్కొంటూ, దేశానికి ఎన్నో ఘన విజయాలు అందించాడని అతడిని కొనియాడింది. తాను కూడా అదే రీతిలో మంచి విజయాలు అందించాలని కోరుకుంటున్నానని, అలంటి విజయాలను అందిస్తాననే నమ్మకంతో ఉన్నట్టు చెప్పింది.

ఇతరుల ఘనతలు, విజయాల గురించి ఆలోచించబోనని స్పష్టం చేసింది. తనకు సంబంధించి ఒక్క అడుగుతోనే అన్ని ప్రారంభమవుతాయని, ఈ విజయాలు సాధించడమనేది కూడా ఇలాంటిదేనని అభిప్రాయపడింది. మరింత కఠినంగా శ్రమించి, కష్టపడితేనే అత్యుత్తమంగా రాణించగలనని తాను నమ్ముతున్నట్టు సింధు తెలిపింది. 

అంత వీజీ కాదు : 

ఈ ఏడాది అంత సులువేమీ కాదని, 2020 జనవరిలోనే మలేషియా, ఇండోనేషియా ఓపెన్‌లు ఉన్నాయని, ఒలింపిక్స్‌ అర్హత కోసం మరిన్నీ టోర్నీల్లో ఆడాల్సి ఉందని  సింధు తన ముందున్న టోర్నీల గురించి పంచుకుంది. ఈ ఏడాది ప్రతి టోర్నీ కూడా ప్రధానమైనదేనాని, బ్యాడ్మింటన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో ఆడటం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది. జనవరిలో జరిగే పీబీఎల్‌లో అన్ని జట్లూ బలంగానే ఉన్నాయని, ప్రతి మ్యాచ్‌ ముఖ్యమైనదేనాని పేర్కొంది. 

పీబీఎల్‌ భారత్‌ లో జరుగే టోర్నీ అని, ప్రజలు, అభిమానులు ప్రపంచంలోని టాప్‌ షట్లర్ల ఆట చూడాలని ఆతృతగా ఎదురుచూస్తుంటారని, అందుకే ఈ లోకల్ వేడుకంట తనకెంతో ఇష్టమని తెలిపింది సింధు. ఏడాదికోసారి జరిగే పీబీఎల్‌లో గొప్ప వాతావరణం ఉంటుందని, యువ షట్లర్లు సీనియర్ల నుంచి నేర్చుకునేందుకు పీబీఎల్‌ ఎంతో మంచి వేదిక అని సింధు అభిప్రాయపడింది.

also read ఫార్మాట్ ఏదైనా దశాబ్దపు సారధులు మాత్రం మనోళ్లే!

వివాదంపై మాత్రం సైలెంట్...

సింధు పర్సనల్ మాజీ కోచ్‌ కిమ్‌ జీ హ్యూన్‌ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై సింధు స్పందించలేదు. కొరియా కోచ్‌ శిక్షణలోనే సింధు వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌, ప్రపంచ చాంపియన్‌షిప్‌ విజయాలు సాధించింది. వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ తర్వాత భర్త అనారోగ్య కారణాలను సాకుగా చూపి కిమ్‌ జీ హ్యూన్‌ స్వదేశానికి వెళ్లిపోయింది. అప్పట్నుంచి సింధు ప్రదర్శనలో దారుణ మార్పు చోటుచేసుకుంది. 

జ్వరంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో, ట్రైనింగ్‌కు ఎప్పుడు వస్తారని సింధు అడిగింది కానీ, ఆరోగ్యం ఎలా ఉంది? అని ఒక్క మాటైనా అడుగలేదని కిమ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సింధుకు హృదయం లేదని కిమ్‌ పేర్కొనటాన్ని సింధు తండ్రి రమణ తప్పుపట్టారు. 

తాజాగా భారత బ్యాడ్మింటన్ డబుల్స్ కోచ్ సైతం కిమ్ వ్యాఖ్యలను తాను అర్థం చేసుకోగలనని, ఇతర క్రీడాకారుల్లో కూడా ఇలాంటి వైఖరే కనబడుతుందని కిమ్ ఆరోపణలను ఒకరకంగా బలపర్చాడు. క్రికెట్‌ సూపర్‌స్టార్‌ విరాట్‌ కోహ్లి తర్వాత బ్రాండ్‌ అంబాసిడర్‌గా అత్యధికంగా ఆర్జిస్తున్న సింధు నుంచి మార్కెట్‌ వర్గాలు సైతం సూపర్‌ ప్రదర్శన ఆశిస్తున్నాయి. అభిమానులు సైతం సింధు జైత్రయాత్రను వీక్షించాలని కోరుకుంటున్నారు. మరి మన సింధు ఏం చేస్తుందో చూడాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios