Peng Shuai: నేను క్షేమంగానే ఉన్నా..! ఐవోసీ అధ్యక్షుడికి వీడియో కాల్ చేసిన పెంగ్ షువాయ్.. కానీ..?

WhereIsPengShuai: టెన్నిస్ క్రీడాలోకాన్ని ఆందోళనకు గురి చేస్తున్న చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ షువాయ్ ఆచూకీ ఎట్టకేలకు తెలిసింది. ఆమె క్షేమంగానే ఉన్నట్టు వీడియో కాల్ లో తెలిపింది.  

I am Safe, says Chinese Tennis Star Peng Shuai In a Video Call With IOC Chief

యావత్ టెన్నిస్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న చైనా టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయ్ ఆచూకీ తెలిసింది. తాను ఎక్కడ ఉన్నాననే విషయం ఆమె అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ కు తెలిపింది. ఆయనతో వీడియో కాల్ లో మాట్లాడింది. ఈ మేరకు స్వయంగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. తాను పెంగ్ షువాయ్ తో వీడియో కాల్ లో మాట్లాడానని.. ఆమె క్షేమంగానే ఉందని చెప్పినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. చైనా ప్రభుత్వంలోని ఓ మాజీ ఉన్నతాధికారి తనను లైంగికంగా వేధింపులకు గురి చేశారని ఆరోపించిన పెంగ్.. కొద్దిరోజుల నుంచి కనిపించకపోవడంతో ఆమె ఆచూకీ గురించి టెన్నిస్ లోకం ఆందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. 

షువాయ్ ఆచూకీ గురించి థామస్ బాచ్ మాట్లాడుతూ.. ‘ఆమె (పెంగ్ షువాయ్) క్షేమంగానే ఉందని నాతో చెప్పింది.  బీజింగ్ లోని తన ఇంట్లోనే ఆమె ఉన్నట్టు కూడా తెలిపింది. కానీ ప్రస్తుత సమయంలో తనకు ప్రైవసీ కావాలని షువాయ్ కోరుకుంటున్నది. అందుకే ఆమె తన ఫ్రెండ్స్, కుటుంబసభ్యులను తప్ప మరెవరినీ కలవడానికి ఇష్టపడటం లేదు. మరికొద్దిరోజుల్లోనే ఆమె తనకెంతో ఇష్టమైన టెన్నిస్ ను తిరిగి ప్రారంభించబోతున్నది’ అని తెలిపారు. 

చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంలోని ఓ మాజీ ఉన్నతాధికారి తనను లైంగికంగా వేధించినట్లు ఇటీవలే పెంగ్ ఆరోపించింది. ఆ తర్వాత ఆమె కనబడకుండా పోవడంతో తీవ్ర కలకలం రేగింది. తాజా మాజీ  టెన్నిస్ క్రీడాకారులు ఆమె ఎక్కడుంది..? అని చైనాపై ప్రశ్నల వర్షం కురిపంచారు. ఆమె ఆచూకీ తెలపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వరల్డ్ నెంబర్  టెన్నిస్ స్టార్ జకోవిచ్ దగ్గర్నుంచి మొదలు.. నవోమి ఒసాకా, సెరెనా విలియమ్స్ లు పెంగ్ ఎక్కడుంది..? అని ట్వీట్లు చేశారు.  ఈ క్రమంలో ట్విట్టర్ లో #whereIsPengShuai హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయింది.

 

క్రీడాకారులతో పాటు  ఐవోసీ కూడా ఈ ఇష్యూపై సీరియస్ అయింది. షువాయ్ క్షేమంగా ఉందని భరోసా ఇవ్వకుంటే చైనాలో జరుగబోయే టెన్నిస్ ఈవెంట్లను ఆపేస్తామని ఐవోసీ జిన్ పింగ్ ప్రభుత్వాన్ని  హెచ్చరించింది. మరో రెండున్నర నెలల్లో అక్కడ శీతాకాల ఒలింపిక్స్ జరుగనున్నాయి. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో వాటి నిర్వహణ పై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. 

 

ముప్పేట దాడి జరుగుతుండటంతో చైనా ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పెంగ్ క్షేమంగానే ఉందంటూ.. ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలను చైనా అధికార పార్టీకి వంతపాడే పత్రిక గ్లోబల్ టైమ్స్ లో ఓ కథనాన్ని ప్రచురించింది.  బీజింగ్ లో నిర్వహించిన ఓ ఈవెంట్ కు పెంగ్ అతిథిగా  హాజరైనట్లు.. అంతేగాక  చిన్నారులకు టెన్నిస్ బంతులపై ఆటోగ్రాఫ్ చేస్తున్నట్టు వీడియోలో కనిపించింది. అయితే  దీనిపై కూడా పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హు జిన్ మరో వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నాడు. అందులో పెంగ్.. బీజింగ్ లోని ఓ రెస్టారెంట్లో భోజనం చేస్తున్నట్టుగా ఉంది.

 

అయితే చైనాను నమ్మడానికి లేదని, గతంలో కూడా చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఆ దేశం ఎలా హింసించిందో తమకు తెలుసని అంతర్జాతీయ సమాజం ఆరోపిస్తున్నది. పెంగ్ షువాయ్ బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే తప్ప ఈ వీడియోలు, ఫోటోలతో లాభం లేదని అంతర్జాతీయ సమాజం చైనాను హెచ్చరిస్తున్నది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios