Asianet News TeluguAsianet News Telugu

Peng Shuai: అబ్బే.. నేనలా చెప్పలేదే..! లైంగిక వేధింపుల ఆరోపణలపై మాట మార్చిన పెంగ్ షువాయి

Peng Shuai U Turn: చైనా టెన్నిస్ క్రీడాకారిణి  పెంగ్ షువాయి.. ఆ దేశ ప్రభుత్వానికి చెందిన కీలక నేత, మాజీ వైస్ ప్రీమియర్ జాంగ్ గవోలి తనపై లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని నవంబర్ 2న తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 

Chinese Tennis Star Peng Shuai U Turn Over Sex Assault
Author
Hyderabad, First Published Dec 20, 2021, 5:56 PM IST

గత నెలరోజులుగా టెన్నిస్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరికి గురిచేసిన ఘటనపై స్వయంగా బాధిత క్రీడాకారిణే మాట మార్చింది. తననెవరూ లైంగిక వేధింపులకు పాల్పడలేదని యూటర్న్ తీసుకుంది. తాజాగా ఆమె ఓ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేసింది.  అందులో..  లైంగిక వేధింపుల ఆరోపణలను ప్రజలే తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పింది. అయితే  ఆమె వివరణ పై అంతర్జాతీయ క్రీడా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.  చైనా ప్రభుత్వం ఆమెను బలవంతం చేస్తుందని, ఇందులో భాగంగానే పెంగ్ షువాయి  ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. 

చైనా టెన్నిస్ క్రీడాకారిణి  Peng Shuai.. ఆ దేశ ప్రభుత్వానికి చెందిన కీలక నేత, మాజీ వైస్ ప్రీమియర్ జాంగ్ గవోలి తనపై లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని నవంబర్ 2న తీవ్ర ఆరోపణలు చేసింది. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్ చేసింది. అయితే అదే సమయంలో ఆమె కనిపించకుండా పోవడంతో టెన్నిస్ ప్రపంచం ఆందోళనకు గురైన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ వీడియోలో ఇందుకు సంబంధించి వివరణ ఇచ్చింది. దానిని సింగపూర్ కు చెందిన ఓ చైనా పత్రిక ప్రచురించింది. అందులో.. ‘నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. నేనెప్పుడూ ఎవరిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయలేదు. ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నా..’ అని తెలిపింది.  ఇక  జాంగ్ గవోలిపై  చేసిన వ్యాఖ్యలపై ఆమెను ప్రశ్నించగా.. ‘అది నా వ్యక్తిగత విషయం.. దాన్ని ప్రజలంతా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ విషయంపై పూర్తి సమాచారం ఇవ్వలేను...’ అంటూ  దాటవేసింది. 

ఇదీ కథ.. 

చైనాకు ట్విట్టర్ వంటిదని అక్కడి  ప్రజలు భావించే విబోలో పెంగ్ షువాయి.. ఓ వీడియోలో గవోలి కొన్నేళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. అయితే ఆమె పోస్ట్ చేసిన కొద్దిసేపటికే దానిని డిలీట్ చేసింది. ఆ తర్వాత నుంచి ఆమె బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. దీనిపై యావత్ టెన్నిస్ ప్రపంచం  ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె ఆచూకీ చెప్పాలని చైనాను నిలదీసింది. అయితే  ఆమె తన ఇంట్లోనే ఉందని, హోటల్ లో భోజనం చేస్తుందని, వీడియో కాల్స్ లో మాట్లాడుతుందని.. ఇలా పలువిధాలుగా చైనా ప్రభుత్వ అనుకూలమీడియా కథనాలు ప్రసారం చేసింది. ఎంత చెప్పినా ప్రజలు మాత్రం  జిన్ పింగ్ ప్రభుత్వాన్ని నమ్మలేదు. ఆఖరుకు  ప్రపంచ టెన్నిస్ అసోసియేషన్ చీఫ్ స్టీవ్ సైమన్ తో పాటు ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా  ఆమె తో వీడియో కాల్ లో మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. 

ప్చ్.. నమ్మలేం...!

ఇదిలాఉండగా.. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. వచ్చే ఏడాది బీజింగ్ లో వింటర్ ఒలింపిక్స్ జరుగనున్నాయి. పెంగ్ షువాయి తో పాటు వీగర్ ముస్లింలపై చైనా అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా  అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఆస్ట్రేలియా వంటి దేశాలు దౌత్య బహిష్కరణ పేరిట  నిషేధాలు విధిస్తున్నాయి. ఇక టెన్నిస్ సమాఖ్య కూడా వచ్చే ఏడాది దాకా చైనా లో జరిగే టోర్నీలను బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ స్థాయిలో వస్తున్న  విమర్శలకు తలొగ్గిన  చైనా.. పెంగ్ షువాయితో కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తుందని  ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రతినిధులు కామెంట్ చేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios