Asianet News TeluguAsianet News Telugu

నేడు తెలంగాణ గవర్నర్‌ను కలవనున్న వైఎస్ షర్మిల.. ఎందుకోసమంటే..

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలవనున్నారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగుంది. 

YSRTP president YS Sharmila to meet Governor Tamilisai Soundararajan today
Author
First Published Aug 8, 2022, 9:15 AM IST

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలవనున్నారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగుంది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై గవర్నర్‌ తమిళిసైకి షర్మిల ఫిర్యాదు చేయనున్నట్టుగా వైఎస్సార్‌టీపీ వర్గాలు తెలిపాయి. ఇక, నేడు గవర్నర్‌ను కలవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో.. సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన తన పాదయాత్రను షర్మిల వాయిదా వేసుకున్నారు. మంగళవారం (ఆగస్టు 9) వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి పాదయాత్రను షర్మిల ప్రారంభించనున్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు ముంపునకు, నిర్మాణంలో అవినీతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత బుధవారం వైఎస్ షర్మిల..  జలసౌధ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ఇంజినీర్ ఇన్ చీఫ్ సీ మురళీధర్ రావుకు వినతి పత్రం అందించారు. “కాంట్రాక్టర్లు నాణ్యత తనిఖీ, సరైన డిజైన్ లేకుండా పనులను అమలు చేశారు. రక్షణ గోడ కూడా సక్రమంగా నిర్మించలేదు. సుమారు రూ. లక్ష కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా సక్రమంగా సాగునీరు అందడం లేదు’’ అని షర్మిల వినతి పత్రంలో పేర్కొన్నారు. 

కాళేశ్వరం ఇంజినీరింగ్‌ అద్భుతమని సీఎం కేసీఆర్ చెబుతారని.. అలా అయితే అది ఎందుకు మునిగిపోయిందని ప్రశ్నించారు. ప్రాజెక్టు ముంపునకు బాధ్యలు ఎవరని ప్రశ్నల వర్షం కురపించారు. తన రక్తాన్ని, మెదడును పెట్టుబడిగా పెట్టానని చెప్పుకున్న ముఖ్యమంత్రి ఈ విషయంలో ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆ సమయంలో షర్మిల మాట్లాడుతూ.. మరో రెండు రోజుల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలుస్తానని చెప్పారు. ఇందుకు సంబంధించి గవర్నర్‌కు మెమోరాండం అందజేస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల నేడు గవర్నర్ తమిళిసైను కలవనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios