Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో పార్టీ.. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు: షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీపై వైఎస్‌ఆర్‌టీపీ (ysrtp) అధినేత్రి వైఎస్‌ షర్మిల (ys sharmila) స్పందించారు. ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చని, అదే విషయం తాను చెప్పానని వెల్లడించారు. తన బతుకు ఇక్కడే ముడిపడి ఉందని... వైఎస్‌ఆర్‌ని ప్రేమించిన ఈ ప్రజలకు సేవ చేయడానికే.. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పుట్టిందని షర్మిల స్పష్టం చేశారు.

ysrtp president ys sharmila sensational comments on party establishment in ap
Author
Hyderabad, First Published Jan 7, 2022, 7:27 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీపై వైఎస్‌ఆర్‌టీపీ (ysrtp) అధినేత్రి వైఎస్‌ షర్మిల (ys sharmila) స్పందించారు. శుక్రవారం హైదరాబాద్‌లో షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చని, అదే విషయం తాను చెప్పానని వెల్లడించారు. తన బతుకు ఇక్కడే ముడిపడి ఉందని... వైఎస్‌ఆర్‌ని ప్రేమించిన ఈ ప్రజలకు సేవ చేయడానికే.. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పుట్టిందని షర్మిల స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసమే ఇక్కడ పార్టీ పెట్టాననని, రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చని ఆమె వ్యాఖ్యానించారు. శాశ్వతంగా అధికారంలో ఉంటాను అనుకోవడం మూర్ఖత్వమని షర్మిల అన్నారు. అధికారంలో లేనివారు.. అధికారంలోకి రారనుకోకూడదని, పాలిటిక్స్ అంటేనే అప్ అండ్ డౌన్ ఉంటాయని ఆమె అన్నారు.

కొంత కాలంగా తన సోదరుడు సీఎం జగన్ (Ys jagan) తీరుపై షర్మిల ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల పులివెందుల వెళ్లినప్పుడు కూడా జగన్, షర్మిల మధ్య వాగ్వాదం జరిగిందనే వార్త గుప్పుమంది. అంతేకాదు జగన్ ఏపీలో ఉండి తెలంగాణలో తనకు నష్టం కలిగిస్తున్నారని షర్మిల అభిప్రాయం పడుతున్నట్లు సమాచారం. వాటన్నింటికి తెరదించేలా ఏపీలో కూడా షర్మిల పార్టీ పెడతారంటూ రాజకీయ వార్తల్లో ప్రచారం జరుగుతోంది.

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై షర్మిల విరుచుకుపడ్డారు.  కేసీఆర్‌కి పరిపాలన చేతకాదని ఆయన ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని ఆమె మండిపడ్డారు. ఆత్మహత్యలు చేసుకున్నా ఒక్కరైతు కుటుంబాన్ని అయినా కేసీఆర్ (kcr) పరామర్శించారా అని షర్మిల ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని ఆమె దుయ్యబట్టారు. రైతులకు సంబంధం లేని విషయాలను వాళ్ల నెత్తిన రుద్దడం భావ్యం కాదన్నారు. ఎంతైతే వారి పండిస్తారో .. ఆ మొత్తాన్ని ప్రభుత్వాలు  కొనాల్సిందేనని షర్మిల అన్నారు. 

కేసీఆర్ కేంద్రానికి అమ్ముకుంటారో.. లేక పక్క దేశానికి అమ్ముకుంటారో, లేక పక్కరాష్ట్రానికి అమ్ముకుంటారో, లేక బాయిల్ రైస్‌గా చేసుకుంటారో ఆయన ఇష్టమని.. కానీ కొనాల్సిందేనని షర్మిల తేల్చిచెప్పారు. ప్రత్నామ్నాయ పంటలు వేస్తే చాలా డబ్బులు వచ్చేస్తాయని .. చాలా లాభపడిపోతారని కేసీఆర్ చెబుతున్నారని ఆమె దుయ్యబట్టారు. మద్ధతు ధర వున్న పంటను వేసుకోవద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదని షర్మిల పేర్కొన్నారు. మిర్చి, పత్తి వంటి పంటలు వేసుకుని ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆమె ధ్వజమెత్తారు. 

ప్రత్యామ్నాయ పంటలు వేసుకున్న రైతులు కోటీశ్వరులు కాలేదని.. వాళ్లు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంట పండే భూముల్లో.. ఇంకోటి పండించడం కష్టమన్న ఇంగితం కేసీఆర్‌కు లేదంటూ ఆమె ఎద్దేవా చేశారు. గడిచిన ఏడున్నర సంవత్సరాల్లో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. వీరిలో ఏ ఒక్కరి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించలేదని, పైసా కూడా ఆర్ధిక సాయం చేయలేదని ఆమె దుయ్యబట్టారు. 

ఈరోజుకి కూడా వేలాది మంది ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూనే వున్నారని షర్మిల గుర్తుచేశారు. దున్న మీద వానపడ్డట్లు.. ఎంతమంది చనిపోతే నాకేందుకు అన్నట్లుగా కేసీఆర్ వున్నారని ఆమె చురకలు వేశారు. పిల్లికి కూడా పాలు పోయరు కానీ.. వీధిలో వున్న వారందరికీ ఉత్తిన దావత్ ఇస్తాడన్నారట అన్నట్లుగా కేసీఆర్ వ్యవహారం వుందన్నారు. ఇక్కడి రైతులను పట్టించుకోని కేసీఆర్.. ఎక్కడో హర్యానాలో (haryana) చనిపోయిన రైతులకు రూ.3 లక్షలు ఇస్తానని చెప్పారంటూ ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios