Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్‌పై షర్మిల ఆగ్రహం.. చిన్న దొర, సన్నాసి అంటూ వరుస ట్వీట్లు

తెలంగాణ ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. బీఆర్ఎస్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని ఆమె జోస్యం చెప్పారు. 
 

ysrtp president ys sharmila fires on minister ktr
Author
First Published Feb 5, 2023, 5:35 PM IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆదివారం ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లు చేశారు. 

‘‘ కొత్తొక వింత..పాతొక రోత అన్నట్లుగా ఉంది చిన్న దొర అబద్ధాల ప్రసంగం.నిజాలు కప్పిపుచ్చి,అబద్ధాలు వల్లించడం ఆయనకే చెల్లింది.ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి,డబుల్ బెడ్ రూం ఇండ్ల, రుణమాఫీ గురించి ప్రస్తావించకుండా నటించడం చిన్నదొరకే సాధ్యం.మీ పాలనలో నిధులు ఏరులై పారితే.. సర్పంచుల బిల్లులు ఎందుకు చెల్లించడం లేదు? నిరుద్యోగం లేకుండా చేస్తే.. దేశంలో తెలంగాణ ఐదో స్థానంలో ఎందుకుంది? తెలంగాణ ధాన్యాగారమైతే వడ్ల రాశులపై గుండెలు ఆగిన దారుణ పరిస్థితులు ఎందుకొచ్చినయ్​? కాళేశ్వరం పర్యటనకు విదేశీయులకు అనుమతి ఉంది కానీ తెలంగాణ ప్రజలకు ఎందుకు అనుమతి లేదు’’ అని షర్మిల ప్రశ్నించారు.

 

 

రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే.. ఆత్మహత్యలే లేవు అన్న సన్నాసి ఎవరు? పోడు పట్టాలు అడిగితే బేడీలు వేసి, కొట్టించిన దుష్టుడు ఎవరు? పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తొమ్మిదేండ్లుగా సాగదీస్తూ రైతుల ఉసురు తీస్తున్న దుర్మార్గుడు ఎవరు? ట్రిబ్యునల్ మీటింగ్ లకు డుమ్మాలు కొట్టిన పనికిమాలిన వ్యక్తి ఎవరు? ధనిక రాష్ట్రమని గప్పాలు కొడుతున్న చిన్న దొర.. ఫీజు రీయింబర్స్ మెంట్ ఎందుకు చెల్లించడం లేదు? రుణమాఫీ ఎందుకు చేయడం లేదు? కార్పొరేషన్ లోన్లు ఎందుకు ఇవ్వడం లేదు? డిస్కంలకు బకాయిలు ఎందుకు కట్టడం లేదు? అని ఆమె నిలదీశారు. 

‘‘ సున్నా వడ్డీ రుణాలు ఎందుకివ్వడం లేదు? ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదు? బీఆర్ఎస్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని భయపడి, మంచి స్క్రిప్ట్ చదివి.. మభ్యపెట్టాలని చూస్తే తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు చిన్న దొర’’ అంటూ షర్మిల దుయ్యబట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios