Asianet News TeluguAsianet News Telugu

ఏపీ , తెలంగాణ కలవవు.. ఇలాంటి ఘటనలు ఎప్పుడో ఒకసారే : సజ్జలకు షర్మిల కౌంటర్

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలవవు అన్నారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఈ మేరకు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఆమె ట్విట్టర్ ద్వారా కౌంటరిచ్చారు. 
 

ysrtp president ys sharmila counter to ysrcp leader sajjala rama krishna reddy
Author
First Published Dec 8, 2022, 9:38 PM IST

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలు తిరిగి ఉమ్మడి రాష్ట్రంగా కలవాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు నాట కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణకు చెందిన టీఆర్ఎస్, బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా స్పందించారు. సజ్జల వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్న ఆమె.. అవి అర్ధం లేనివిగా కొట్టిపారేశారు. ఈ మేరకు షర్మిల ట్వీట్ చేశారు. 

‘‘ సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివి. నేడు తెలంగాణ ఒక వాస్తవం. ఎంతోమంది బలిదానాలు, ఎంతో మంది త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రెండు రాష్ట్రాలు కలవడం అసాధ్యం. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయి. విభజిత రాష్ట్రాలను ఎలా కలుపుతారు’’ అంటూ ఆమె మండిపడ్డారు.

‘‘మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు, మీ ప్రాంత అభివృద్ధి మీద. మీ హక్కుల కోసం పోరాటం చేయండి; మీ ప్రాంతానికి న్యాయం చేయండి. అంతేకాని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం మీకు తగదు’’ అంటూ షర్మిల చురకలంటించారు.

అంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే తమ పార్టీ విధానమన్నారు. రెండు రాష్ట్రాలు కలసి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుందన్నారు.  రెండు రాష్ట్రాలు  కలిసే దానికోసం వైకాపా పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచీ  తమ పార్టీ పోరాడుతుందన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్  పనిగట్టుకుని జగన్ వైపు చూపించినట్లు తెలుస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.  అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ ,బీజేపీలు విభజనకు అనుకూలంగా వ్యవహరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే  తొలుత స్వాగతించేది తామేనన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో మా వాదనలు బలంగా వాదనలు  వినిపిస్తామన్నారు.  రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలన్నారు. లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరతామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.  రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే  న్యాయస్థానంలో  కేసు వేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. విభజన చట్టంలో హామీల అమలు కోసం కాదన్నారు.విభజనచట్టంలో  హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉందని ఆయన చెప్పారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios