భారత దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మణిిపూర్ అల్లర్లు, తెలంగాణలో కేసీఆర్ పాలనపై ఘాటుగా స్పందించారు వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.
హైదరాబాద్ :ఆనాడు భారత దేశ సంపదను తెల్లదొరలు దోచుకుంటే ఇప్పుడు తెలంగాణను నల్లదొర కేసీఆర్ దోచుకుంటున్నాడని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బ్రిటీష్ వారు దేశ ప్రజలకు ద్రోహం చేస్తూ దొరలాగే పాలిస్తూ కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడని అన్నారు. బ్రిటీష్ పాలన అంతంతో దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లే కేసీఆర్ నియంత పాలన పోతేనే తెలంగాణ నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని షర్మిల పేర్కోన్నారు.
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని వైఎస్సార్ టిపి కార్యాలయంలో అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం భారత పౌరులు, తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ...భిన్నత్వంలో ఏకత్వమే భారత దేశ గొప్పదనమని అన్నారు. విభిన్న కులమతాలు, సంస్కృతి సాంప్రదాయాలు, భాషల, ప్రాంతాల సమ్మేళనమే భారత దేశ సంపద అన్నారు. కానీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని... బ్రిటీష్ వాళ్ల మాదిరిగానే డివైడ్ ఆండ్ రూల్ పద్దతిని అనుసరిస్తోందంటూ షర్మిల ఆందోళన వ్యక్తం చేసారు.
మణిపూర్ లో అల్లర్లు చెలరేగి ప్రస్తుతం చోటుచేసుకుంటున్న ఘటనలు భరతమాతకే అవమానమని షర్మిల అన్నారు. మహిళలను నగ్నంగా పరేడ్ చేయించడం యావత్ భారత ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సిన అమానుష ఘటన అన్నారు. ఇంకా అనేక మంది అమాయక మహిళలు అల్లరిమూకలు చేతిలో రేప్ కు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అల్లర్ల కారణంగా 60వేల మంది నిర్వాసితులు అయ్యారని... 222 చర్చిలపై దాడులు జరిగాయని షర్మిల తెలిపారు. నెలల తరబడి అల్లర్లు కొనసాగుతున్నా లా ఆండ్ ఆర్డర్ కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అని షర్మిల ప్రశ్నించారు.
Read More కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీగా తెలంగాణ: కిషన్ రెడ్డి
ఇకనైనా మతాల పేరిట రాజకీయాలు చేయడం మానుకోవాలని బిజెపి ప్రభుత్వానికి షర్మిల సూచించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో చలికాచుకోవడంతో బిజెపికి అలవాటుగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకుని బిన్నత్వంలో ఏకత్వంగా సాగిన భారత సంస్కృతిని కొనసాగించాలని షర్మిల కోరారు.
దేశంలోనే కాదు తెలంగాణలోనూ దుర్మార్గపై పాలన సాగుతోందని షర్మిల అన్నారు. దేశానికి స్వాతంత్య్రం మాదిరిగానే తెలంగాణ రాష్ట్రం కూడా ఎందరో ప్రాణత్యాగాలు, మరెందరో పోరాటాల వల్ల వచ్చిందన్నారు. కానీ అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగడం లేదన్నారు. రూ.4 లక్షల కోట్ల అప్పు తెచ్చి రాష్ట్రాన్ని నడిపితే పాలన అంటారా? దిక్కుమాలిన పాలన అంటారా? అంటూ కేసీఆర్ సర్కార్ పై షర్మిల మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని... గుడులు బడుల కంటే వైన్ షాపులు, బెల్ట్ షాపులే ఎక్కువగా వున్నాయని షర్మిల పేర్కొన్నారు. మద్యం అమ్మకాలనే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా కేసీఆర్ మార్చారన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతంలో మద్యం అమ్మకాలు పదింతలు పెరిగాయి... ఇందుకోసమేనా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నది? అని షర్మిల ప్రశ్నించారు.
ఇక తెలంగాణలో మహిళలకు గౌరవమే లేకుండా పోయిందని షర్మిల ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణలో అర్ధరాత్రి కాదు కదా పట్టపగలు కూడా మహిళలు రోడ్లపై తిరిగే పరిస్థితి లేదన్నారు. ఆడపిల్లలనే కాదు మగపిల్లలను కూడా బయటకు పంపడానికి తల్లిదండ్రలు భయపడిపోతున్నారని అన్నారు. ఆడపిల్లలను అయితే భద్రత కోసం, మగపిల్లలను అయితే ఎక్కడ మద్యానికి బానిసలు అవుతారోనని తల్లిదండ్రులు బయటకు పంపేందుకు భయపడుతున్నారని షర్మిల అన్నారు.
