తాను టీడీపీలో చేరితే  రూ. 30 కోట్లు ఇస్తామని  టీడీపీ నాయకులు తనకు ఆఫర్ ఇచ్చారని వైసీపీకి చెందిన మాడ్గుల ఎమ్మెల్యే  బూడి ముత్యాలనాయుడు చెప్పారు. 

విశాఖపట్టణం: తాను టీడీపీలో చేరితే రూ. 30 కోట్లు ఇస్తామని టీడీపీ నాయకులు తనకు ఆఫర్ ఇచ్చారని వైసీపీకి చెందిన మాడ్గుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు చెప్పారు. 

ఆదివారం నాడు విశాఖ జిల్లా అనకాపల్లి గాంధీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను ఎప్పటికీ వైఎస్ జగన్‌తో ఉంటానని చెప్పారు.చిన్నప్పటి నుండి ఎమ్మెల్యే కావాలనే కోరిక ఉందన్నారు. జగన్ ఆశీస్సులతో తాను ఎమ్మెల్యే అయినట్టు ఆయన గుర్తు చేశారు.

టీడీపీ నేతలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడ తాను వైసీపీని వీడలేదన్నారు. టీడీపీలో చేరితే తనకు రూ. 30 కోట్లను ఇస్తారని ఆయన గుర్తు చేశారు. వైసీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి జిల్లాకు చెందిన మంత్రులపై విమర్శలు గుప్పించారు. 

 విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడుల ఆస్తులు వేల కోట్లకు ఎలా చేరాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ చీకటి ఒప్పందానికి బుద్ది చెప్పాలన్నారు.