గురువారం కుప్పంలో జరిగిన ఘటనపై స్పందించారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబువి దరిద్రపు ఆలోచనలని.. పేదవాళ్లకి సంక్షేమ పథకాలు అందకుండా చేయడమే బాబు లక్ష్యమని రామకృష్ణారెడ్డి ఆరోపించారు.  

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనపై మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలు పీకేశారని ఆరోపించారు. మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్లుగా తిరిగి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని సజ్జల సెటైర్లు వేశారు. చంద్రబాబువి దరిద్రపు ఆలోచనలని.. పేదవాళ్లకి సంక్షేమ పథకాలు అందకుండా చేయడమే బాబు లక్ష్యమని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పేదల ఆకలి నిజంగా తీర్చాలనుకుంటే.. అన్న క్యాంటీన్‌ను 2014లోనే ఎందుకు ఏర్పాటు చేయలేదని సజ్జల ప్రశ్నించారు. 

నిన్నటి నుండి కుప్పంలో చంద్రబాబు పర్యటన అంతా డ్రామా లా జరుగుతుందని ఆయన దుయ్యబట్టారు. గొడవ చేసింది వాళ్ళే.. వీరంగం చేసింది వాళ్ళే.. మళ్ళీ వైసీపీని పోలీసులను అంటున్నారని రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో జరిగిన అల్లర్లకు చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కుప్పంలో వైసీపీ కార్యకర్తలు శాంతియతంగా నిరసన తెలియజేశారని.. 30 ఏళ్లుగా కుప్పాన్ని చంద్రబాబు ఉక్కుపాదాల కింద నొక్కి పెట్టారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో ప్రజలు స్వేచ్చగా బ్రతుకుతున్నారని సజ్జల పేర్కొన్నారు. 

30 ఏళ్లుగా జరగని అభివృద్ధిని తాము మూడేళ్లలో చేశామని, కుప్పం ప్రజలు చంద్రబాబు వల్ల విసిగిపోయారని ఆయన దుయ్యబట్టారు. ప్రజలు వైసీపీకి మద్దతుగా నిలుస్తుంటే చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇకపై కుప్పంలో చంద్రబాబుకి స్థానం లేదని తెలిసిపోయిందని, అందుకే రిజెక్ట్ చేసేశారని సజ్జల వ్యాఖ్యానించారు. ఇకపై చంద్రబాబు చొక్కాలు విప్పుకుని అరిచినా ఉపయోగం లేదని, ఇన్ని రోజులు కుప్పం ఎమ్మెల్యే గా ఉన్న చంద్రబాబు ఈరోజు ఆఫీస్ ప్రారంభించారని ఆయన సెటైర్లు వేశారు. 

ALso Read:కుప్పం నుండే ధర్మపోరాటం: జగన్ మీద చంద్రబాబు నిప్పులు

సొంత నియోజవర్గంలో కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదని, చుట్టం చూపుగా వెళ్తాడు.. వస్తాడు అంతేనంటూ సజ్జల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈరోజు రోడ్ పై కూర్చున్నాడు.. రేపు పడుకుంటాడేమేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేష్, పవన్‌ల చిల్లరి వేషాలు ప్రజలు భరించాల్సివస్తుందని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన రహస్య మైత్రి ఎందుకు కలిసి వెళ్లాలంటూ ఆయన ఎద్దేవా చేశారు. పవన్ చెప్తున్న వైసీపీ విముక్త రాష్ట్రం అంటే సంక్షేమ పథకాలు అపెయ్యడమేనా అని సజ్జల ప్రశ్నించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు అవ్వడం పవన్, చంద్రబాబులకు ఇష్టం లేదని ఆయన చురకలు వేశారు. 

పవన్‌కి ఓపిక ఉంటే మా ఎమ్మెల్యేలతో గడప గడపకి తిరగాలని.. ఏం చేస్తున్నామో ప్రజలే చెప్తారంటూ సజ్జల అన్నారు. పవన్‌‌‌కి వ్యూహం అంటూ ఉంటేగా.. ఆయనకి వ్యూహం చంద్రబాబు చెప్పాలని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. షిండే సీఎం అవ్వలేదా అని బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగాలి అనుకుంటే దానికి అనుగుణంగా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన హితవు పలికారు. వైసీపీకి ప్రజలు సరదాగా ఓట్లు వెయ్యడం లేదని, జగన్ పై నమ్మకంతో ఓట్లు వేశారని సజ్జల అన్నారు. మూడేళ్లలో 95 శాతం హామీలు అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్ అని రామకృష్ణారెడ్డి ప్రశంసించారు.