హైదరాబాద్: డేటా చోరీ కేసు రెండు రాష్ట్రాల మధ్య యుద్ధాన్ని రాజేస్తోంది. ఏపీ ప్రజల డేటా చోరీకి గురైందంటూ వైసీపీ ఐటీ వింగ్ లోకేశ్వర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా రెండు పార్టీలకు చెందిన వ్యవహారం కాస్త ఇప్పుడు రెండు రాష్ట్రాలకు పాకింది. 

టీడీపీ, వైసీపీల మధ్య మెుదలైన ఈ డేటా చోరీ వ్యవహారం కాస్త తెలంగాణ రాష్ట్రసమితి పార్టీకి అంటుకుంది. డేటా చోరీకి గురైందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైబరారాబాద్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించడంపై టీడీపీ భగ్గుమంటోంది. 

ఈ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబుపై కూకట్‌పల్లి వైసీపీ నేతలు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డేటా చౌర్యం కేసుపై చంద్రబాబు ఏపీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇకపోతే ఐటీ గ్రిడ్ వ్యవహారంలో కీలక సూత్రధారి అయిన ఐటీ గ్రిడ్  కంపెనీ వ్యవస్థాపకుడు అశోక్ ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అతడిని పట్టుకునేందుకు ఐదు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.