వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఒకసారి మాట ఇస్తే జరిగి తీరుతుందని ఆమె తల్లి వైఎస్ విజయమ్మ అన్నారు. తెలంగాణలో షర్మిల అడ్రస్ పాలేరు అని చెప్పారు.

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఒకసారి మాట ఇస్తే జరిగి తీరుతుందని ఆమె తల్లి వైఎస్ విజయమ్మ అన్నారు. తెలంగాణలో షర్మిల అడ్రస్ పాలేరు అని చెప్పారు. వైఎస్ విజయమ్మ గురువారం పాలేరులో వైఎస్సార్‌టీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాతో దివంగత సీఎం వైఎస్సార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణకు ప్రధాన గుమ్మం ఖమ్మం అయితే.. రేపటి ప్రభుత్వానికి పాలేరు సింహద్వారం అవుతుందని అన్నారు. 

వైఎస్ షర్మిల తెలంగాణ బిడ్డ కాదని అనేవాళ్లకు ఆమె ప్రేమనే జవాబు చెబుతుందని అన్నారు. తమ కుటుంబానికి పులివెందుల ఎలాగో తన కూతురు షర్మిలకు పాలేరు అలాంటిదేనని చెప్పారు. ప్రస్తుతం ప్రారంభించిన కార్యాలయం తాత్కాలికమైనా కార్యకర్తలకు అందుబాటులో ఉంటుందన్నారు. జూలై 8న కొత్త ఆఫీసు, ఇంటిని ప్రారంభించనున్నట్లు చెప్పారు. 

వచ్చే ఎన్నికల్లో షర్మిలను భారీ మెజార్టీతో గెలిపించి.. పాలేరును బహుమతిగా ఇవ్వాలని విజయమ్మ కోరారు. పాలేరు ప్రజలకు షర్మిల జీవితాంతం సేవ చేస్తుందని చెప్పారు. అదే సమయంలో వైఎస్ షర్మిల ప్రగతి భవన్‌కు వెళ్లేందుకు యత్నించిన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను కూడా విజయమ్మ ప్రస్తావించారు.